Share News

రాజధానిలో రాజ్యాంగేతర శక్తి!

ABN , Publish Date - Jul 26 , 2024 | 03:46 AM

రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులు జగన్‌ ఐదేళ్ల పాలనలో నరకం చూశారు. అక్రమ కేసుల్లో ఇరుక్కుని, అణచివేతకు గురయ్యారు. కానీ ఆ ప్రాంతంలో ఓ సాధారణ వ్యక్తి మాత్రం కోట్లకు పడగలెత్తారు. మరో ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచిన ఆయన రాజధాని ప్రాంతంలో అరాచకాలకు తెగబడ్డారు. భారీగా డబ్బు పోగేసుకోవడంతో పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని

రాజధానిలో రాజ్యాంగేతర  శక్తి!

జగన్‌ పాలనలో అడ్డగోలుగా దందా

ప్రైవేటు సైన్యంతో రెచ్చిపోయిన వైసీపీ నేత

ఐదేళ్లూ ఇసుకలో కుమ్ముడే కుమ్ముడు

మట్టి, కంకర, రోడ్లనూ వదలని వైనం

నాడు ఫొటోగ్రాఫర్‌గా సాధారణ జీవితం

నేడు 500 కోట్ల అక్రమార్జనకు అధిపతి

కూటమి ప్రభుత్వం రాగానే నేత అదృశ్యం

అమరావతి ప్రాంతానికి చెందిన ఆయన... మొదట ఓ సాధారణ ఫొటోగ్రాఫర్‌. గత చంద్రబాబు ప్రభుత్వంలో అమరావతి రాజధానికి శ్రీకారం చుట్టిన సమయలో జరిగిన అరటి తోటల దహనం కేసులో అనుమానితుడిగా ఉన్నారు. ఇదే కారణంతో జగన్‌కు దగ్గరయ్యాయి. 2019లో మరో ప్రాంతం నుంచి వైసీపీ తరఫున ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆయనలోని అసలు మనిషి బయటకొచ్చారు.

జగన్‌ ఐదేళ్ల పాలనలో సదరు నేత అమరావతిని అడ్డాగా చేసుకుని ఎన్నో దౌర్జన్యాలు, దాడులు, అక్రమాలు, ఇసుక తవ్వకాలు, సెటిల్మెంట్‌లకు పాల్పడ్డారు. దాదాపు 500 కోట్ల అక్రమాస్తులు సంపాదించినట్టు ఆరోపణలున్నాయి. అంతేగాక తన స్వార్థం కోసం పుట్టి పెరిగిన ప్రాంతానికి ద్రోహం చేసి అమరావతి రాజధాని వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించారు. కూటమి ప్రభుత్వం రావడంతో గోవాకు జంప్‌ అయ్యారు. సదరు నేత అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలన్న డిమాండ్లు వస్తున్నాయి.

రాజధాని అమరావతి కోసం భూములు త్యాగం చేసిన రైతులు జగన్‌ ఐదేళ్ల పాలనలో నరకం చూశారు. అక్రమ కేసుల్లో ఇరుక్కుని, అణచివేతకు గురయ్యారు. కానీ ఆ ప్రాంతంలో ఓ సాధారణ వ్యక్తి మాత్రం కోట్లకు పడగలెత్తారు. మరో ప్రాంతం నుంచి ప్రజాప్రతినిధిగా గెలిచిన ఆయన రాజధాని ప్రాంతంలో అరాచకాలకు తెగబడ్డారు. భారీగా డబ్బు పోగేసుకోవడంతో పాటు అధికారాన్ని అడ్డు పెట్టుకుని గత ఐదేళ్లూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించారు. ప్రైవేట్‌ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారు. అమరావతి రాజధాని కోసం పోరాడిన రైతులు శిబిరాల్లో జై అమరావతి అనడమే నేరం అన్నట్లుగా వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారు. గడిచిన ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో ఆయన, ఆయన అనుచరులు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. రాజధాని ప్రాంతం తన సామ్రాజ్యం అన్నట్టుగా ఒక సామంత రాజులాగా రెచ్చిపోయారు. మొదట అక్కడ ఇసుక రీచ్‌లపై కన్నేశారు. ఆయన ప్రజాప్రతినిధిగా ఎన్నిక కాకముందే రీచ్‌లపై స్పష్టమైన అవగాహన ఉంది. గతంలో రీచ్‌లలో పనిచేసిన అనుభవం ఉంది. దీంతో ఇసుక రీచ్‌ల నుంచి ఐదేళ్లూ నిత్యం వందలాది లారీల ఇసుకను తరలించి కోట్లు కొల్లగొట్టారు. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన నాటి ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సభ కోసం ఏర్పాటు చేసిన వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఐదారు హెలిప్యాడ్ల ప్రాంతాన్ని ఇసుక డంపింగ్‌ యార్డ్‌గా మలుచుకున్నారు. అక్కడి నుంచి రాత్రి వేళ ఇసుక తరలించేవారు. ఆయనకు సంబంధించిన లారీలకు ముందు భాగంలో ప్రత్యేకమైన రంగు ఉంటుంది. ఆ లారీలను పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం కూడా చేసేవారు కాదు. ఒక్క ఇసుకలోనే 400 నుంచి 500 కోట్ల వరకు కొట్టేసినట్లు అంచనా. నాటి వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధికి చెందిన లారీలు ఆ ప్రాంతంలో తిరగకూడదన్నట్లుగా వ్యవహరించారు. స్థానిక వైసీపీ మహిళా ప్రజాప్రతినిధిని అడుగడుగునా అవమానం, అవహేళనకు గురిచేసేలా వ్యవహరించారు. తానే అక్కడ వైసీపీ ప్రజాప్రతినిధి అన్నట్టుగా వ్యవహరించారు. ఆయన ఆగడాలు భరించలేక ఆమె పార్టీని వీడారు. దీంతో రాజధాని ప్రాంతంలో తనకు తిరుగే లేదన్నట్లుగా మరింత రెచ్చిపోయారు. ఇసుక దోపిడీ కొనసాగిస్తూనే రాజధాని ప్రాంతంలో గత టీడీపీ ప్రభుత్వంలో వేసిన కంకర, మట్టి, రోడ్లను సైతం తవ్వేసి సొమ్ము చేసుకున్నారు. మరోవైపు పంచాయితీలు, దందాలపైనా దృష్టి సారించారు. భారీగా అక్రమార్జన వస్తుండటంతో తన గ్రామ సమీపంలోని నదీపాతంలో అంటే లంకలో కట్టడాల నిర్మాణం నిషేధమైనా అనుమతులు లేకుండా రూ.12 కోట్లతో ఓ ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు పక్కన ఉద్దండరాయునిపాలెం పరిధిలో సీఆర్‌డీఏ భూములను ఆక్రమించి ఓ కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. అక్కడి నుంచి దందాలు, సెటిల్మెంట్లు ఇతర ప్రైవేటు కార్యకలాపాలు సాగించారు.

అమరావతి వ్యతిరేక ఉద్యమంలో...

నాటి జగన్‌ ప్రభుత్వం అమరావతిని ధ్వంసం చేసి ఆడిన మూడుముక్కలాటలో సదరు ప్రజాప్రతినిధి కీలకపాత్ర పోషించారు. స్వార్థ ప్రయోజనాల కోసం అమరావతికి వ్యతిరేకంగా మూడు రాజధానులకు మద్దతుగా నిలిచారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని ఆశ కల్పించి దళిత ఉద్యమ నాయకుడు మారగాని గురునాథాన్ని పావుగా వాడుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు అనేక ప్రాంతాల్లో నిరవధికశిబిరాలు ఏర్పాటు చేసి దీక్షలు కొనసాగిస్తుంటే.. అందుకు పోటీగా తాళ్లాయపాలెం వై జంక్షన్‌లో మూడు రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేయించారు. విజయవాడ చిట్టినగర్‌, మంగళగిరి, గుంటూరు తదితర ప్రాంతాల్లోని పేద దళిత వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని ఆశ పెట్టి ఈ శిబిరానికి రప్పించారు. మొదట్లో పేదలు ఈ మాటలు నమ్మినా తరువాత విషయం తెలుసుకుని వెనకడుగు వేశారు. దీంతో రోజువారీ కూలీ ఇచ్చి ఆ శిబిరాన్ని కొనసాగించారు. మూడు రాజధానుల శిబిరం ముసుగులో పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో తమను మోసం చేశారని గ్రహించిన దళిత ఉద్యమ నేత గురునాథం ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. సదరు నేత తమను ఎలా మోసం చేసింది, చేసిన అక్రమాలను ఆయన ఏకరువు పెట్టారు. రాజధాని ఉద్యమ సమయంలో రైతులు జై అమరావతి అని నినాదాలు చేసినందుకు వారిపై అక్రమ కేసులు బనాయించారు. నందిగామలో రైతులు జై అమరావతి అంటూ గులాబీలు ఇచ్చినందుకు వారిని అడ్డుకుని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. 17 మంది రైతులపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టించి బెయిల్‌ రాకుండా 30 రోజులు జైల్లో ఉండేలా చేశారు. అమరావతికి సమీపంలోని శిబిరంలో రైతులు జై అమరావతి అన్నందుకు శిబిరం వద్దకు వెళ్లి నానా యాగీ చేశారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి అరెస్టులు చేయించారు.

ఎన్నో దాడులు, దౌర్జన్యాలు

వైసీపీ ఐదేళ్ల పాలనలో సదరు నాయకుడు రాజధాని ప్రాంతంలో ఎంతో మందిపై దాడులు, బెదిరింపులకు పాల్పడ్డారు. కొట్టడమే గాక బాధితులపైనే ఎదురు కేసులు పెట్టి మరీ వేధింపులకు గురి చేశారు. మందడం ప్రాంతంలో ఓ టీ స్టాల్‌ వద్ద ఆయన అనుచరుల వైపు కన్నెత్తి చూశారనే కారణంగా విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టారు. బాధితులపైనే ఎదురు కేసు పెట్టి భయబ్రాంతులకు గురి చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులోనూ ఆయన ఆదేశాల మేరకు అనుచర గణం పాల్గొన్నట్లు పోలీసు వర్గాలు ధ్రువీకరించాయి. ఆ కేసులో ఆయనతో పాటు ఆయన అనుచరులను కూడా నిందితులుగా చేర్చారు. ముందస్తు బెయిల్‌కు ఆయన దరఖాస్తు చేసుకోగా కోర్టులో విచారణ జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అడ్డుపెట్టుకుని పెద్ద ఎత్తున ప్రైవేటు పంచాయితీలు, సెటిల్మెంట్లకు తెరదీశారు.

గోవాలో ప్రత్యక్షం

కూటమి ప్రభుత్వం రాగానే ఆ మాజీ ప్రజా ప్రతినిధి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా గోవాలో ప్రత్యక్షమయ్యారు. అక్కడ వెలగబెడుతున్న రాచకార్యాల వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.

ఎలా సంపాదించారో చెప్పండి?

ఒక సాధారణ వ్యక్తి ప్రజాప్రతినిధి అయ్యాక కోట్ల రూపాయల ఆస్తులు ఎలా కూడబెట్టారో చెప్పాలని సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్‌గా మారాయి. ఎలా సంపాదించారో చెబితే తామూ ఆయనలా కష్టపడి ఆస్తులు సంపాదించుకుంటామని పలువురు నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. వాటిలో కొన్ని...

  • 12 కోట్లతో కృష్ణా నది ఒడ్డున విలాసవంతమైన ప్యాలెస్‌ నిర్మాణం ఎలా సాధ్యం?

  • ఇసుక పనికి పోయిన వ్యక్తి రూ.40 కోట్లతో తన బయోపిక్‌ సినిమా ఎలా తీయగలిగారు?

  • ఒకప్పుడు అరిటాకులు అమ్ముకున్న వ్యక్తి ప్రజాప్రతినిధి అయ్యాక నాలుగు ఆడి కార్లు, మూడు రేంజ్‌ రోవర్‌ కార్లు, మూడు బీఎండబ్ల్యూ కార్లు ఎలా వచ్చాయి?

  • ఒక సాధారణ ప్రజాప్రతినిధి విజయవాడ గురునానక్‌ కాలనీలో నాలుగు కోట్ల రూపాయలతో డూప్లెక్స్‌ ఎలా కొనగలిగారు?

  • హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో ఎకరం 9 కోట్లు చొప్పున 15 ఎకరాలు (రూ.135 కోట్లు) ఎలా కొనగలిగారు.

  • రాజధాని తుళ్లూరులో బినామీ పేరుతో నాలుగు అంతస్థుల అపార్టుమెంట్‌ ఎలా కొన్నారు? మందడం పెట్రోల్‌ బంకు సమీపంలో అపార్టుమెంట్‌ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజధానిలో 7 ప్లాట్లు ఎలా వచ్చాయి?

  • కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో ఏడు ఎకరాల భూమి ఎలా సంపాదించారు?

-(గుంటూరు)

Updated Date - Jul 26 , 2024 | 03:46 AM