Share News

Union Ministry : ‘స్టేట్‌’ మారాల్సిందే!

ABN , Publish Date - Oct 11 , 2024 | 03:09 AM

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రంలోనే పనిచేయాలని, పక్క రాష్ట్రంలో విధులు కుదరదని తేల్చి చెప్పింది.

Union Ministry : ‘స్టేట్‌’ మారాల్సిందే!

  • కేటాయించిన కేడర్‌ స్టేట్‌లోనే పనిచేయాలి

  • ఏపీ, తెలంగాణ ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు డీవోపీటీ ఆదేశం

  • ఏపీకి రానున్న ఐదుగురు ఐఏఎస్‌, ఇద్దరు ఐపీఎ్‌సలు

  • ఏపీ నుంచి ముగ్గురు ఐఏఎ్‌సలు తెలంగాణకు

  • ఈనెల 16వ తేదీలోపు రిపోర్ట్‌ చేయాల్సిందే

అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణకు చెందిన పలువురు ఐఏఎస్‌, ఐపీఎ్‌సలకు కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (డీవోపీటీ) షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర విభజన సమయంలో కేటాయించిన రాష్ట్రంలోనే పనిచేయాలని, పక్క రాష్ట్రంలో విధులు కుదరదని తేల్చి చెప్పింది. ఈనెల 16వ తేదీలోపు తమ సొంత కేడర్‌ రాష్ట్రంలో చేరిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం... ఏపీ కేడర్‌కు కేటాయించినప్పటికీ తెలంగాణలో పని చేస్తున్న ఐఏఎస్‌ అధికారులు ఆమ్రపాలి కాట, రోనాల్డ్‌ రాస్‌, మల్లెల ప్రశాంతి, వాణీ ప్రసాద్‌, వాకాటి కరుణ.. ఐపీఎస్‌ అధికారులు అంజనీ కుమార్‌, అభిలాష బిస్త్‌ ఏపీకి వచ్చేయనున్నారు. అలాగే... విభజన సమయంలో తెలంగాణకు కేటాయించినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఐఏఎ్‌సలు కె.సృజన, సీహెచ్‌ హరికిరణ్‌, శివశంకర్‌ లోతేటి ఏపీ నుంచి వెళ్లిపోనున్నారు.

రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆలిండియా సర్వీసు అధికారులను ఇరురాష్ట్రాలకు కేటాయించారు. అయితే... ఏపీకేడర్‌కు కేటాయించిన అధికారులు కొందరు తెలంగాణలో, తెలంగాణ కేడర్‌కు కేటాయించిన అధికారులు కొందరు ఏపీలో కొనసాగుతూ వచ్చారు. ‘క్యాట్‌’ నుంచి స్టే తెచ్చుకున్నామన్న ఒకే ఒక్క కారణం చూపించి పదేళ్లకుపైగా పొరుగు రాష్ట్రాల్లో కొనసాగుతూ వస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈ విషయంపై దృష్టి సారించలేదు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా ఉన్న జగన్‌, కేసీఆర్‌ కూడా అలాగే వదిలేశారు. అయితే... క్యాట్‌ తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్రం తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ విషయంలో స్పష్టమైన తేడా వచ్చింది. ఏపీ కేడర్‌కు కేటాయించిన ఆయన తెలంగాణలో విధులు నిర్వహించడానికి వీల్లేదని, వెంటనే రిలీవ్‌ కావాలని టీ-హైకోర్టు గత ఏడాది స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.


Untitled-2 copy.jpg

ఇతర అధికారులకు సంబంధించిన వినతులను మరోసారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశం ప్రకారం, అభ్యంతరాల పరిశీలన బాధ్యతను కేంద్రం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి దీపక్‌కు అప్పగించింది. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం, అధికారుల అభ్యర్థనలు తోసిపుచ్చుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో... ఐఏఎ్‌సలు ఆమ్రపాలి, రోనాల్డ్‌ రాస్‌, మల్లెల ప్రశాంతి, వాణీ ప్రసాద్‌, వాకాటి కరుణ... ఐపీఎ్‌సలు అంజనీ కుమార్‌, అభిలాష బిస్త్‌ ఏపీకి రానున్నారు.

ఇక... ఏపీలో పనిచేస్తున్న ఐఏఎ్‌సలు సృజన, సీహెచ్‌ హరికిరణ్‌, శివశంకర్‌ లోతేటి తెలంగాణకు వెళ్లనున్నారు. వీరంతా ఇప్పుడు తాము పని చేస్తున్న రాష్ట్రాల్లో రిలీవ్‌ అయ్యి... 16వ తేదీలోగా తమ సొంత కేడర్‌ రాష్ట్రాల్లో రిపోర్ట్‌ చేయాలని డీవోపీటీ ఆదేశించింది. అదే సమయంలో తమను తెలంగాణకు కేటాయించాలన్న ఏపీ కేడర్‌ ఐఏఎ్‌సలు ఎస్‌ఎస్‌ రావత్‌, అనంతరాము విజ్ఞాపనను డీవోపీటీ తిరస్కరించింది.

Updated Date - Oct 11 , 2024 | 03:09 AM