Share News

అమ్మ.. ఆవేదన!

ABN , Publish Date - Oct 30 , 2024 | 05:40 AM

‘తల్లిదండ్రులకు పిల్లలంతా సమానమే! కానీ... ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం.

అమ్మ.. ఆవేదన!

అవన్నీ కుటుంబ ఆస్తులే.. షర్మిలకూ ఇవ్వాలి

గిఫ్టుగా కాదు.. అది జగన్‌ బాధ్యత.. విజయలక్ష్మి బహిరంగ లేఖ

బిడ్డల మధ్య వివాదంపై స్పందన.. షర్మిలకు జగన్‌ అన్యాయంపై ఆక్రోశం

వైవీ, సాయిరెడ్డి అబద్ధాలు చెబుతున్నారు

షర్మిలకు ఇప్పటిదాకా ఆస్తులు పంచివ్వలేదు

వైఎస్‌ ఉండగా కొన్ని ఆస్తులు ఇద్దరి పేరిట పెట్టాం

ఇది షర్మిలకు ఆస్తులు పంచి ఇచ్చినట్లు కాదు

విడిపోదామని 2019లో జగనే చెప్పారు

ఎంవోయూ కూడా రాసిచ్చారు

తక్షణం ఇస్తామన్నవీ ఇప్పటికీ ఇవ్వలేదు

వ్యాపారాల్లోకి షర్మిలను రానివ్వలేదు

అయినా నిస్వార్థంగా జగన్‌ కోసం కష్టపడింది

ఇకనైనా అసత్య ప్రచారం ఆపండి

బహిరంగ లేఖలో విజయలక్ష్మి వినతి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘తల్లిదండ్రులకు పిల్లలంతా సమానమే! కానీ... ఒక బిడ్డ మరో బిడ్డకు అన్యాయం చేస్తుంటే చూసి తట్టుకోవడం చాలా కష్టం. అన్యాయం జరిగిన బిడ్డ పక్షాన ఉండి మాట్లాడటం తల్లిగా నా విధి. నా ధర్మం’... అని వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, షర్మిల తల్లి విజయలక్ష్మి పేర్కొన్నారు. అన్నా చెల్లెలి మధ్య కొన్నేళ్లుగా అంతర్గతంగా, కొన్నాళ్లుగా బహిరంగంగా సాగుతున్న వివాదంపై తల్లి విజయలక్ష్మి తొలిసారిగా తన భావాలను అందరితో పంచుకున్నారు. ‘వైఎస్‌ రాజశేఖర రెడ్డిని అభిమానించే వారికి...’ అంటూ మంగళవారం 3 పేజీల బహిరంగ లేఖ రాశారు. తమ కుటుంబ ఆస్తులకు సంబంధించి వైఎస్‌ అంతరంగం, ఆదేశాలతోపాటు తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. షర్మిలకు జగన్‌ అన్యాయం చేస్తున్నారని స్పష్టం చేశారు. జగన్‌ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్న వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆడిటర్‌గా విజయసాయి రెడ్డి, ఇంటి బంధువుగా వైవీ సుబ్బారెడ్డికి అన్నీ తెలిసీ ఇలా మాట్లాడటం బాధాకరమన్నారు. ‘ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు’ అని హెచ్చరించారు. ఇప్పటికీ తాను స్పందించకపోతే ఈ వివాదం, అసత్యాల పరంపర కొనసాగుతుందని... అందుకే ఈ లేఖ రాయాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

తల్లి మనసు...

తమ తండ్రి వైఎస్‌ జీవించి ఉండగా ఉన్న కుటుంబ ఆస్తులన్నింటినీ సమానంగా పంచాలన్నది ఆయన ఆదేశమని షర్మిల పేర్కొంటుండగా... ‘ఆ ఆస్తుల్లో నీకు హక్కులేదు. కేవలం ప్రేమాభిమానాలతో కొంత వాటా ఇద్దామనుకున్నా. ఇప్పుడు అది కూడా ఇవ్వను’ అని జగన్‌ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. పైగా... ఆస్తుల పంపిణీపై గతంలో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అమలు చేసేది లేదంటూ ఏకంగా తల్లీ చెల్లిపై నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్టీ)లో కేసు కూడా వేశారు. జగన్‌ లేఖ... దానికి ప్రతిగా షర్మిల లేఖాస్త్రం... కేసులతో కుటుంబ వివాదం రచ్చకెక్కింది. ఇదే నేపథ్యంలో మంగళవారం విజయలక్ష్మి ఆవేదన, ఆక్రోశంతో బహిరంగ లేఖ రాశారు. ‘ఇదీ నిజం’ అంటూ జగన్‌ వైఖరిని ఎండగట్టారు.


ఆస్తులు పంచలేదు... ఇస్తామన్నదీ ఇవ్వలేదు

‘2019 వరకూ కలిసే ఉన్నాం. కుటుంబ ఆస్తుల్లో షర్మిలకూ సమాన వాటా ఉంది’ అని విజయలక్ష్మి స్పష్టం చేశారు. షర్మిలను కుటుంబ వ్యాపారాల్లోకి రానివ్వలేదని... అయినప్పటికీ జగన్‌ కోసం నిస్వార్థంగా కష్టపడిందని, ఆయన అధికారంలోకి రావడంలో షర్మిల కృషి ఎంతో ఉందన్నారు. అదే సమయంలో... ఆస్తులను పెంచడంలో జగన్‌ కష్టం ఉందన్నదీ నిజమేనన్నారు. ‘అవన్నీ కుటుంబ ఆస్తులు అన్నది నిజం. బాధ్యతగల కుమారుడిగా కుటుంబ ఆస్తులను సంరక్షించాలన్నది కూడా నిజం’’ అని తెలిపారు. వైఎస్‌ జీవించి ఉండగానే షర్మిలకు ఇప్పటికే ఆస్తులు పంచేశారంటూ వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ‘‘పిల్లలు పెరుగుతున్న రోజుల్లో కొన్ని ఆస్తులు షర్మిల పేరిట, కొన్ని జగన్‌ పేరిట పెట్టారు. అది... ఆస్తుల పంపకం కానేకాదు’’ అని స్పష్టం చేశారు. ఆ ఆస్తులను పంచుకుందామనుకుంటున్న సమయంలో వైఎస్‌ దుర్మరణం పాలయ్యారని తెలిపారు. 2019లో సీఎం అయిన రెండు నెలలకు ఆస్తులు పంచేసుకుందామని జగనే ప్రతిపాదించారని చెప్పారు. ‘‘విజయవాడలో నా సమక్షంలోనే ఎవరికి ఏ ఆస్తులు అని ఎంవోయూ రాసుకున్నారు. షర్మిలకు హక్కు ఉంది కాబట్టే రూ.200 కోట్లు డివిడెండ్‌ ఇచ్చాడు. హక్కు ఉంది కాబట్టే అధికారికంగా ఎంవోయూ రాశారు. ఇవేవీ షర్మిలకు జగన్‌ గిఫ్టుగా ఇస్తున్నవి కావు. బాధ్యతగా ఇవ్వాల్సినవి’’ అని స్పష్టం చేశారు. కేసులు, ఈడీ కేసులు, జప్తుతో సంబంధం లేని సరస్వతి పవర్‌ వాటాలు 100 శాతం, ఎంవోయూలో లేని ఎలహంక ప్రాపర్టీ వందశాతం షర్మిలకు ఇస్తానని జగన్‌ అప్పుడే మాట ఇచ్చి, సంతకం చేశారన్నారు. అవి కూడా ఇప్పటికీ ఇవ్వలేదని ఆక్రోశించారు.

Updated Date - Oct 30 , 2024 | 05:40 AM