Visakhapatnam : కిక్కిరిసిన సెంట్రల్ జైల్
ABN , Publish Date - Nov 26 , 2024 | 04:28 AM
విశాఖ కేంద్ర కారాగారం ఖైదీలతో కిక్కిరిసిపోతోంది. ఇక్కడ జైలు సామర్థ్యానికి రెండింతలకుపైగా ఖైదీలు ఉంచడం గమనార్హం. ఈ జైల్లో మొత్తం 14 బ్యారక్‌లు ఉన్నాయి. వీటి మొత్తం సామర్థ్యం 914 మంది కాగా, ప్రస్తుతం 2,036 మందిని ఉంచారు.
సామర్థ్యం 914 మంది.. ప్రస్తుతం ఉన్నది 2,036 మంది.. వీరిలో 1,609 మంది రిమాండ్ ఖైదీలే
వారిలోనూ గంజాయి కేసుల్లో పట్టుబడిన 1,400 మంది
రోజూ 20 మంది లోపలికి.. 15 మంది బయటికి
పర్యవేక్షణ, వసతుల కల్పన సిబ్బందికి సవాలే
విశాఖలో ఇదీ పరిస్థితి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖ కేంద్ర కారాగారం ఖైదీలతో కిక్కిరిసిపోతోంది. ఇక్కడ జైలు సామర్థ్యానికి రెండింతలకుపైగా ఖైదీలు ఉంచడం గమనార్హం. ఈ జైల్లో మొత్తం 14 బ్యారక్‌లు ఉన్నాయి. వీటి మొత్తం సామర్థ్యం 914 మంది కాగా, ప్రస్తుతం 2,036 మందిని ఉంచారు. వీరిలో వివిధ కేసుల్లో నేరారోపణలు రుజువవడంతో కోర్టులు శిక్ష విధించినవారు 427 మంది మాత్రమే. మిగిలిన 1,609 మంది రిమాండ్ ఖైదీలు. వీరిలో 1,400 మంది గంజాయి కేసుల్లో నిందితులు. ఇటీవల గంజాయి కేసులు పెరుగుతున్నాయి. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్ నిమిత్తం వారిని కేంద్ర కారాగారానికి తరలిస్తున్నారు. రోజుకు సగటున 20 మంది వరకూ రిమాండ్ ఖైదీలు వస్తుండగా.. సుమారు 15 మంది బయటకు వెళుతున్నారు. బయటకు వెళ్లేవారి కంటే లోపలకు వచ్చేవారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో జైలు కిక్కిరిసిపోతోంది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సైతం ఇటీవల జైలును సందర్శించి.. ఇక్కడ పరిమితికి మించి, అందులోనూ గంజాయి కేసుల్లో పట్టుబడినవారే 90 శాతం ఉండడం చూసి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సామర్థ్యానికి మించి ఖైదీల సంఖ్య బాగా ఎక్కువగా ఉండడంతో పర్యవేక్షణ, వసతుల కల్పన సిబ్బందికి తలనొప్పిగా మారుతోంది.
దీనిపై జైలు సూపరింటెండెంట్ ఎన్.కిషోర్‌కుమార్‌ను ప్రశ్నించగా, సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలోని జైళ్లలో సదుపాయాల కల్పనకు కేంద్ర హోంశాఖ నిధులు కేటాయించిందన్నారు. 500 మంది ఖైదీలకు సరిపోయేలా జీ+1 భవన నిర్మాణం కోసం రూ.26 కోట్లు, 200 మంది ఓపెన్ ఎయిర్ జైలు ఖైదీల కోసం ప్రత్యేకంగా భవన నిర్మాణం కోసం రూ.15 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే జైలులో భద్రత మరింత పటిష్ఠం అవ్వడంతోపాటు ఖైదీలకు కూడా సౌకర్యంగా ఉంటుందన్నారు. అలాగే, విశాఖ కేంద్ర కారాగారంలో భద్రతను పటిష్ఠం చేసేందుకు సీసీ కెమేరాలు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు, వాకీటాకీలు, బాడీవార్న్ కెమెరాల కొనుగోలుకు రూ.73 లక్షలు కేటాయించిందని తెలిపారు.