Visakhapatnam : వాతావరణంపై భారత్‌కు సొంత మోడలింగ్ వ్యవస్థ ఉండాలి
ABN , Publish Date - Sep 20 , 2024 | 06:10 AM
దేశ ప్రజలకు వాతావరణంపై ఎప్పటికప్పుడు సమాచారం, విపత్తుల హెచ్చరికలు అందించేందుకు సొంత మోడలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అమెరికా వాతావరణ సంస్థ నోవా (నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) మోడలింగ్ డేటా విభాగాధిపతి డాక్టర్ తల్లాప్రగడ విజయ్ అభిప్రాయపడ్డారు.
‘మిషన్ మౌసం’ నిరంతరం కొనసాగాలి
వాతావరణ బులెటిన్ల ఆధారంగానే అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు
ఉత్తర హిందూ మహాసముద్రంలో పెరిగిన తుఫాన్ల తీవ్రత, దిశలో మార్పులు
హుద్‌హుద్‌పై భారత్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాం
36 తుఫాన్లకు మోడళ్లు రూపొందించి దేశానికి అందించాం
భారత్ ఫండింగ్‌తో రుతుపవనాలపై పరిశోధనలు
తల్లాప్రగడ విజయ్ స్వస్థలం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ద్రాక్షారామం. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వాతావరణ, సముద్ర అధ్యయన విభాగంలో పీజీ చేసి ఇక్కడే పీహెచ్‌డీ చేశారు. తరువాత అమెరికాలో నోవాకు వెళ్లి మరిన్ని పరిశోధనలు నిర్వహించారు. ఏయూ వాతావరణ, సముద్ర అధ్యయన విభాగంలో చదువుకుని నోవాకు సలహదారుగా ఉన్న కృష్ణమూర్తి సలహా మేరకు విజయ్ అనేక పరిశోధనలు చేశారు.
విశాఖపట్నం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): దేశ ప్రజలకు వాతావరణంపై ఎప్పటికప్పుడు సమాచారం, విపత్తుల హెచ్చరికలు అందించేందుకు సొంత మోడలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని అమెరికా వాతావరణ సంస్థ నోవా (నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్) మోడలింగ్ డేటా విభాగాధిపతి డాక్టర్ తల్లాప్రగడ విజయ్ అభిప్రాయపడ్డారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ, సముద్ర అధ్యయన విభాగం 75వ వ్యవస్థాపక దినోత్సవ సెమినార్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ప్రస్తుతం నోవా నుంచి పలు మోడళ్లను భారత్ తీసుకుని అభివృద్ధి చేసి అమలు చేస్తోంది. భారత్‌లో సమర్థులైన శాస్త్రవేత్తలకు కొదవలేదు.
సొంతంగా సాంకేతికతను అభివృద్ధి చేసుకుని మోడలింగ్ వ్యవస్థ రూపొందించాలి. భారత్‌లో వాతావరణంపై మిషన్ మౌసం ప్రాజెక్టు రూ.2,600 కోట్లతో చేపడుతుండడం మంచి పరిణామం. రెండేళ్లకే ఈ ప్రాజెక్టు పరిమితం కాకుండా నిరంతరం పరిశోధనలు చేసేలా భారీగా నిధులు మంజూరు చేయాలి. అమెరికాలో ఆర్థిక కార్యకలాపాలు వాతావరణ బులెటిన్‌పై ఆధారపడి నిర్వహిస్తారు. వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తే ముందురోజు ఉన్న పాల ధర కూడా మారుతోంది. విద్యుత్ వినియోగంలో ధరల వ్యత్యాసం, షేర్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు ఉంటాయి అని పేర్కొన్నారు.
తుఫాన్ల తీవ్రత ఆందోళనకరం
ఉత్తర హిందూ మహాసముద్రం (బంగాళాఖాతం, అరేబియా సముద్రం)లో తుఫాన్ల తీవ్రత పెరుగుతోంది. గతంతో పోల్చితే తుఫాన్ల సంఖ్య తగ్గినా వాటి తీవ్రత చాలా ఆందోళనకరంగా ఉంటోంది. కుంభవృష్టిగా వర్షాలు కురిసి తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు మునుగుతున్నాయి. ఒకప్పుడు బంగాళాఖాతంలో అండమాన్‌లో ఏర్పడిన తుఫాన్‌లు పశ్చిమం వైపు పయనించి చెన్నై, నెల్లూరు, ఉత్తరంగా పయనించి కోల్‌కతా వైపు వెళ్లేవి. ఇప్పుడు వాయువ్య దిశలో వెళ్లడంతోపాటు అనూహ్యంగా దిశ మార్పుకోవడంతో ఏదో ఒక ప్రాంతం తీవ్రంగా నష్టపోతుంది. నోవాలో తుఫాన్‌ల గమనంపై 2006లో హరికేన్ వెదర్ అండ్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్ రూపొందించాం. 2012లో భారత్‌కు అందించాం. దాని ప్రకారం 2013లో ఒడిశాను తాకిన ఫైలిన్ తుఫాన్ గమనాన్ని అంచనా వేశారు. ఆ మరుసటి ఏడాది 2014లో హుద్‌హుద్ తుఫాన్ విశాఖ వద్ద తీరం దాటుతుందని భారత ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశాం. 36 తుఫాన్‌లకు మోడలింగ్ చేసి ఆయా దేశాలకు బులెటిన్లు అందించాం. నైరుతి రుతుపవనాలపై మరింత పక్కా సమాచారం కోసం నోవాకు భారత ప్రభుత్వం ఐదు లక్షల డాలర్ల ఫండింగ్ ఇచ్చిందని డాక్టర్ విజయ్ పేర్కొన్నారు.