Rain Update: విశాఖ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన.. ఆరెంజ్ అలర్ట్ జారీ
ABN , Publish Date - Sep 03 , 2024 | 03:11 PM
ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం అవుతున్న తరుణంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య , వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది.
విశాఖపట్నం: ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం అవుతున్న తరుణంలో విశాఖపట్నం వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 5న పశ్చిమ మధ్య , వాయువ్య బంగాళాఖాతంను ఆనుకొని మరో అల్పపీడనం ఏర్పడనుందని ప్రకటించింది.
ఋతుపవన ద్రోణి ప్రభావంతో ఉపరితల ఆవర్తనం కోస్తా మీదుగా కొనసాగుతోందని, రాష్ట్రంలో చెదురు మదురుగా వర్షాలు పడతాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. కృష్ణా, గుంటూరులో ఓ మోస్తారు వర్షాలు పడతాయని తెలిపింది ఈ రెండు జిల్లాలకు ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నట్టు వివరించింది.
బుడమేరులో గండి పడిన ప్రాంతం పరిశీలన..
బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని ఇరిగేషన్ అధికారులు పరిశీలించారు. అధికారులు యుద్ధ ప్రతిపాదికన పనులు చేపట్టారు. బుడమేరులో గండి పడిన ప్రాంతాన్ని అధికారులు పూడ్చుతున్నారు. మూడు రోజులపాటు పనులు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. బుడమేరుకు వరద ప్రవాహం తగ్గిపోవడంతో పనులను మరింత ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు.
సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు సీఎం సమీక్షలు..
వరద సహాయక చర్యలపై కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతోంది. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇవాళ (మంగళవారం) ఉదయం నుంచి ఆహారం పంపిణీపై సమీక్ష నిర్వహించారు. ఆహార పంపిణీకి సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా విధుల్లో ఉన్న అధికారులు, ఉన్నతాధికారుతో ఆయన మాట్లాడారు. 5 హెలీకాఫ్టర్ల ద్వారా ఆహార పంపిణీ జరుగుతోందని అధికారులు తెలిపారు. కాగా మంగళవారం ఉదయం నుంచి హెలికాఫ్టర్, పడవులు, ట్రాక్టర్ల ద్వారా ఆహారం, నీళ్లు పంపిణీ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి.