Share News

72 చోరీ కేసుల్లో 102 మంది అరెస్టు

ABN , Publish Date - Nov 20 , 2024 | 12:52 AM

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి 72 కేసుల్లో 102 మందిని అరెస్టు చేసినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు.

72 చోరీ కేసుల్లో 102 మంది అరెస్టు

  • రూ.88.52 లక్షలు విలువైన సొత్తు స్వాధీనం

  • సీపీ శంఖబ్రతబాగ్చి

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి 72 కేసుల్లో 102 మందిని అరెస్టు చేసినట్టు సీపీ శంఖబ్రతబాగ్చి తెలిపారు. కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్టోబరులో నగర పరిధిలో 116 సొత్తు అపహరణ కేసులు నమోదయ్యాయన్నారు. అందులో 72 కేసులను తమ క్రైమ్‌ విభాగం అధికారులు, సిబ్బంది ఛేదించారన్నారు. చోరీలకు పాల్పడిన 102 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.88.52 లక్షలు విలువైన సొత్తును రికవరీ చేశారన్నారు. రికవరీ చేసిన వాటిలో 742.97 గ్రాముల బంగారం, 326.48 గ్రాముల వెండి, రూ.2.88 లక్షలు నగదు, 20 మోటారు సైకిళ్లు, మూడు ఆటోలు, ఒక లారీ, 298 సెల్‌ఫోన్‌లు, ఒక ల్యాప్‌టాప్‌ ఉన్నాయన్నారు. ఆ సొత్తును బాధితులకు సీపీ అందజేశారు. ప్రతి నెలా రికవరీ మేళా పేరుతో స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును కోర్టు అనుమతితో బాధితులకు నేరుగా అందజేస్తున్నామన్నారు. అదేవిధంగా నగరంలో నేరాలు నియంత్రించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. గత నెల 154 చోట్ల అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. అలాగే ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేలా, చీకటి ప్రాంతాల్లో లైటింగ్‌ పెంచేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో క్రైమ్‌ డీసీపీ లతామాధురితోపాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

పాసింజర్‌ రైళ్ల నంబర్లు మార్పు

విశాఖపట్నం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

విశాఖ నుంచి నడిచే పలు ఒరిజినేటింగ్‌ పాసింజర్‌ రైళ్ల నంబర్లను మార్పు చేశామని సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. విశాఖ-కిరండోల్‌ (58501), కిరండోల్‌-విశాఖ (58502), విశాఖ-రాయపూర్‌ (58528), రాయపూర్‌-విశాఖ (58527), విశాఖ-కోరాపుట్‌ (58538), కోరాపుట్‌-విశాఖ (58537), విశాఖ-బ్రహ్మపూర్‌ (58532), బ్రహ్మపూర్‌-విశాఖ (58531), విశాఖ-గుణుపూర్‌ (58506), గుణుపూర్‌-విశాఖ (58505), విశాఖ-భవానీపాట్నా (58504), భవానీపాట్నా-విశాఖ (58503) వంటి రైళ్లు కొత్త నంబర్ల (బ్రాకెట్లలో సూచించినవి)తో నడుస్తాయని పేర్కొన్నారు. అలాగే కటక్‌-గుణుపూర్‌ (68433), గుణుపూర్‌-కటక్‌ (68434) రైలు కొత్త నంబర్లతో రాకపోకలు సాగిస్తాయన్నారు.

అప్పన్న భూముల వ్యవహారంపై 22న విచారణ

రీజనల్‌ కార్యాలయానికి హాజరుకావాలని విచారణ కమిటీకి ఆదేశం

సింహాచలం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):

వరాహ లక్ష్మీనృసింహస్వామి దేవస్థానానికి చెందిన భూముల వివరాలను రికార్డుల నుంచి తొలగించినట్టు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కమిటీ సభ్యులు చంద్రకుమార్‌, భ్రమరాంబ, పుష్పవర్దన్‌లు ఈనెల 22న విశాఖలోని రీజనల్‌ విజిలెన్స్‌ కార్యాలయానికి రావాలని దేవదాయ శాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు ఈఓగా పనిచేసిన కోడూరి రామచంద్రమోహన్‌ అవినీతికి పాల్పడ్డారని, చట్ట వ్యతిరేకంగా వందలాది ఎకరాల భూముల వివరాలను రికార్డుల నుంచి తొలగించారని ఆరోపణలు అందడంతో 2019లో వైసీపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీ విచారణ జరిపి నివేదికను సమర్పించింది. కాగా దీనిపై విచారణకు హాజరుకావాలని కమిషనర్‌ ఆదేశించారు. విచారణలో పరిశీలించిన అంశాలు, వాస్తవాలు, నిజంగానే భూముల గోల్‌మాల్‌ జరిగిందా, అందుకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించారా అనే అంశాలపై ఆరా తీస్తారని సమాచారం.

Updated Date - Nov 20 , 2024 | 12:52 AM