Share News

169.39 కిలోల గంజాయి పట్టివేత

ABN , Publish Date - Dec 03 , 2024 | 01:18 AM

అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మండలం మీదుగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తుల్లో ముగ్గురిని గొటివాడ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు.

169.39 కిలోల గంజాయి పట్టివేత

ముగ్గురి అరెస్టు, రెండు వాహనాలు సీజ్‌

సబ్బవరం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి):

అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మండలం మీదుగా గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తుల్లో ముగ్గురిని గొటివాడ సమీపంలో పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 169.39 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఆరు, బైక్‌, మూడు సెల్‌ ఫోన్లు సీజ్‌ చేశారు. ఇందుకు సంబంధించి పరవాడ డీఎస్పీ కేవీ సత్యనారాయణ సోమవారం మీడియాకు తెలిపిన వివరాలిలా వున్నాయి.

జిల్లా ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాల మేరకు ఆదివారం సాయంత్రం నల్సార్‌ (న్యాయ విశ్వవిద్యాలయం) జంక్షన్‌ వద్ద ఎస్‌ఐ పి.సింహాచలం, పోలీసు సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో చోడవరం వైపు నుంచి బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ఆపి విచారిస్తున్నారు. ఇదే సమయంలో బైక్‌ వెనుక వస్తున్న కారు ఆపకుండా పారిపోవడానికి యత్నింగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి కారు నుంచి ఒక్క ఉదుటన దిగి పరారయ్యాడు. కారులో తనిఖీలు చేపట్టగా గంజాయి ప్యాకెట్లు లభించాయి. అనంతరం గంజాయితోపాటు వాహనాలను, నిందితులను పోలీసు స్టేషన్‌కు తరలించి విచారించారు. గంజాయిని తూకం వేయగా 169.39 కిలోలు వుంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం తోటపర్తి చెక్‌పోస్టు సమీపంలో గంజాయి ప్యాకెట్లను కారులో ఎక్కించారు. వాహనాన్ని హుకుంపేట మండలం మూలగుడ గ్రామానికి చెందిన కొమ్మ సతీశ్‌ నడుపుతుండగా, పాడేరు మండలం గొందూరు గ్రామానికి చెందిన డిప్పల మహేశ్‌, వంజంగి గ్రామానికి చెందిన మోతే గిరి బైక్‌పై కారు ముందు ఎస్కార్ట్‌గా వెళుతున్నారు. గంజాయిని గాజువాక ప్రాంతంలోని ఆటోనగర్‌లో ఒక వ్యక్తికి అందించేందుకు తీసుకెళుతున్నట్టు నిందితులు చెప్పారు. గంజాయితోపాటు కారు, బైక్‌, మూడు సెల్‌ ఫోన్లు పోలీసులు సీజ్‌చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. గంజాయిని పట్టుకున్న ఎస్‌ఐ సింహాచలం, సిబ్బంది సీహెచ్‌ శ్రీనివాసరావు, వెంకటేశ్‌, నర్శింగ్‌, రాము, రవికుమార్‌లను డీఎస్పీ అభినందించారు. మీడియా సమావేశంలో వీరితోపాటు సీఐ పిన్నింటి రమణ, ఎస్‌ఐ దివ్య పాల్గొన్నారు.

Updated Date - Dec 03 , 2024 | 01:18 AM