Share News

రహదారుల కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Nov 19 , 2024 | 11:41 PM

అధిక వర్షాలకు ధ్వంసమైన సీలేరు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి, లంబసింగి ఘాట్‌కి మహర్దశ పట్టనుంది. రహదారుల పునర్నిర్మాణానికి రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధులు(ఎస్‌డీఎంఎఫ్‌) రూ.23.65 కోట్లు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

రహదారుల కష్టాలకు చెక్‌
అధ్వానంగా తయారైన ఆర్‌వీనగర్‌- పాలగెడ్డ(సీలేరు) రహదారి

సీలేరు, లంబసింగి రోడ్లకు మహర్దశ

నిర్మాణానికి రూ.23.65 కోట్లు మంజూరు

హామీ ఇచ్చిన రెండు నెలల్లోనే నిధులు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం

జనవరిలో పనులు ప్రారంభం

ఐదు నెలల్లో నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యం

చింతపల్లి, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): అధిక వర్షాలకు ధ్వంసమైన సీలేరు అంతర్రాష్ట్ర ప్రధాన రహదారి, లంబసింగి ఘాట్‌కి మహర్దశ పట్టనుంది. రహదారుల పునర్నిర్మాణానికి రాష్ట్ర విపత్తుల ఉపశమన నిధులు(ఎస్‌డీఎంఎఫ్‌) రూ.23.65 కోట్లు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ మేరకు డిసెంబరు నాటికి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి జనవరి నుంచి రహదారుల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు ప్రారంభించారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హామీ ఇచ్చిన రెండు నెలల్లోనే ప్రభుత్వం నిధులు విడుదల చేయడంపై ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సీలేరు- చింతపల్లి ప్రధాన రహదారి నాలుగు రాష్ట్రాలను కలుపుతుంది. ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాల ప్రజలు ఈ రహదారి మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ రహదారి ఎనిమిదేళ్ల క్రితం ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు దెబ్బతిన్నది. దీంతో నాటి తెలుగుదేశం ప్రభుత్వం 2016-17లో ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు 78 కిలోమీటర్లు రహదారి విస్తరణ, పునర్నిర్మాణం కోసం రూ.84 కోట్ల నిధులను విడుదల చేసింది. దీంతో రహదారి నిర్మాణానికి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసి, అటవీశాఖ అనుమతుల కోసం టీడీపీ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక పంపించింది. అటవీశాఖ అనుమతులు జాప్యంకావడం వల్ల పనులు ప్రారంభంకాలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక రహదారి నిర్మాణానికి విడుదల చేసిన నిధులను రద్దు చేసింది. దీని వల్ల గత ఐదేళ్లగా ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు రహదారి నిర్మాణం కలగా మిగిలిపోయింది. రహదారి నిర్వహణను గాలికి వదిలేయడంతో పలు చోట్ల భారీ గోతులు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో ప్రయాణమంటే వాహనచోదకులు భయపడే పరిస్థితి ఏర్పడింది.

సెప్టెంబరు 8న విలయానికి రహదారి అస్తవ్యస్తం

ఈ ఏడాది సెప్టెంబరు 8వ తేదీన కురిసిన వర్షానికి సీలేరు-ఆర్‌వీనగర్‌ రహదారి అస్తవ్యస్తమైంది. వరద ప్రవాహానికి రహదారిపైకి కొండచరియలు, వృక్షశకలాలు కొట్టుకువచ్చాయి. పలు చోట్ల రహదారి పూర్తిగా కోతకు గురైంది. కల్వర్టులు కొట్టుకుపోయాయి. సంపంగిగొంది నుంచి సీలేరు వరకు పలు చోట్ల రహదారి శిథిలమైపోవడం వల్ల పది రోజుల పాటు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్‌అండ్‌బీ అధికారులు అతికష్టంపై పది రోజులు శ్రమించి నాలుగు చక్రాల వాహనాలు ప్రయాణించేందుకు అనువుగా రహదారిని సిద్ధం చేశారు. దీంతో ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు తిరుగుతున్నాయి.

హామీ ఇచ్చిన రెండు నెలల్లో నిధులు విడుదల

సెప్టెంబరు 8వ తేదీన కురిసిన వర్షానికి సీలేరు రహదారి ధ్వంసం కావడంతో పాటు చట్రాపల్లి గ్రామంలో కొండచరియలు విరిగిపడి ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. ఆరు ఇళ్లు కొట్టుకుపోయాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు గిరిజన సంక్షేమశాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సెప్టెంబరు 10న ఈ ప్రాంతంలో పర్యటించారు. చట్రాపల్లి వెళ్లేందుకు మంత్రి ప్రయత్నించినప్పటికి సీలేరు రహదారి పూర్తిగా ధ్వంసంకావడంతో సంపంగిగొంది వరకు వచ్చి వెనుదిరిగారు. సీలేరు-ఆర్‌వీనగర్‌ రహదారి పరిస్థితిని స్వయంగా పరిశీలించి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ క్రమంలో సీలేరు రహదారి నిర్మాణానికి తక్షణమే నిధులు విడుదల చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన రెండు నెలల్లోనే ఆర్‌వీనగర్‌ నుంచి పాలగెడ్డ వరకు 49 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి రూ.18.95 కోట్ల నిధులు విడుదల చేస్తూ జీవో నంబరు 350ను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

లంబసింగి ఘాట్‌ నిర్మాణానికి రూ.4.7 కోట్లు

నర్సీపట్నం-చింతపల్లి ప్రధాన రహదారిలో లంబసింగి ఘాట్‌ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం రూ.4.7 కోట్ల నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం నర్సీపట్నం-చింతపల్లి మార్గంలో లంబసింగి వరకు ఎన్‌హెచ్‌ 516-ఈలో రహదారి నిర్మాణం జరుగుతున్నది. నర్సీపట్నం నుంచి డౌనూరు వరకు గతంలో రహదారి నిర్మించారు. ప్రస్తుతం డౌనూరు నుంచి లంబసింగి వరకు ఘాట్‌ రోడ్డు 13.5 కిలోమీటర్ల మేర దెబ్బతిన్నది. దీంతో లంబసింగి ఘాట్‌ నిర్మాణానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.

Updated Date - Nov 19 , 2024 | 11:41 PM