Share News

ఎన్నో ఏళ్లనాటి కల నెరవేరుతున్న వేళ

ABN , Publish Date - Dec 19 , 2024 | 11:57 PM

మండలంలోని పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని గిరిజనుల ఏళ్ల నాటి కల ఫలించనుంది. రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఆ గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి.

ఎన్నో ఏళ్లనాటి కల నెరవేరుతున్న వేళ
శ్రమదానంతో రాచకీలం గ్రామానికి మట్టిరోడ్డు నిర్మించుకుంటున్న గిరిజనులు(ఫైల్‌ ఫొటో)

కూటమి ప్రభుత్వంలో తీరనున్న గిరిజనుల కష్టాలు

మారుమూల గిరిజన గ్రామాలకు రహదారులు

గుమ్మంతి, రాచకీలం, రెడ్డిపాడు, చింతపాక రోడ్లకు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం

ఉప ముఖ్యమంత్రి రాక రేపు

అనంతగిరి, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): మండలంలోని పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని గిరిజనుల ఏళ్ల నాటి కల ఫలించనుంది. రహదారి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఆ గ్రామాల ప్రజల కష్టాలు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక గిరిజన గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం, డోలీ మోతలు ఆగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సంకల్పించడంతో ఆయా గ్రామాలకు రహదారుల నిర్మాణం జరగనుంది.

స్వాతంత్య్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా ఆయా గ్రామాల గిరిజనులు కాలినడకనే రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారడం లేదని వాపోయేవారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగులు, గర్భిణులను ఆస్పత్రికి తరలించాలంటే డోలీ మోతలే దిక్కు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక వీరిలో ఆశలు చిగురించాయి. వారి కలను నిజం చేస్తూ పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీల పరిధిలోని గుమ్మంతి, రాచకీలం, రెడ్డిపాడు, చింతపాక నుంచి సమిధ, తట్టబూడి, తదితర గ్రామాలకు తారు రోడ్డు నిర్మాణ పనులకు ఈ నెల 21వ తేదీన ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ శంకుస్థాపన చేయనున్నారు.

గుర్రాలే రవాణా సాధనాలు

పినకోట, పెదకోట, జీనబాడు పంచాయతీలోని కరకవలస, గుమ్మంతి, దాయర్తి, మడ్రేబ్‌, తదితర గ్రామాల గిరిజనులు ఇప్పటికీ తమ రవాణా సాధనాలుగా గుర్రాలనే వినియోగిస్తున్నారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో కొండల పైనుంచి గిరిజనులు అటవీ ఉత్పత్తులను గుర్రాలపై తీసుకువచ్చి సంతల్లో విక్రయాలు చేపడతారు. తమ ఇళ్ల నిర్మాణానికి ఇసుక, సిమెంట్‌, తదితర వాటికి గుర్రాలనే ఉపయోగిస్తారు. గుర్రాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గిరిజనులకు మరికొద్ది రోజుల్లో వాహనాలను ఉపయోగించుకునే పరిస్థితి రానుంది.

ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న రోడ్లు

- పంచాయతీరాజ్‌ నిధులతో గుమ్మంతి నుంచి రాచకీలం మీదుగా రెడ్డిపాడు వరకు 5.49 కిలో మీటర్లకు గాను రూ.5.86 కోట్లతో తారురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

- పంచాయతీరాజ్‌ నిధులతో చింతపాక నుంచి పెదబూరగ మీదుగా చిందులపాడు, తట్టబూడిని కలుపుకుంటూ సమిధ వరకు 16.56 కిలో మీటర్ల గాను రూ.16.65 కోట్లతో తారురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 09:05 AM