పల్లెలకు పండుగొచ్చింది
ABN , Publish Date - Nov 14 , 2024 | 11:59 PM
గ్రామాల్లోని రహదారులకు మహర్దశ పట్టింది. గత వైసీపీ పాలనలో ఐదేళ్లు ఎటువంటి అభివృద్ధికి నోచుకోని రోడ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్లుగా దర్శనమిస్తున్నాయి.
గత ఐదేళ్లుగా అభివృద్ధికి నోచుకోని రహదారులకు మహర్దశ
కూటమి ప్రభుత్వం రావడంతో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు
జోరుగా పనులు
తీరనున్న గిరిజనుల కష్టాలు
అరకులోయ, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లోని రహదారులకు మహర్దశ పట్టింది. గత వైసీపీ పాలనలో ఐదేళ్లు ఎటువంటి అభివృద్ధికి నోచుకోని రోడ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక సీసీ రోడ్లుగా దర్శనమిస్తున్నాయి.
గ్రామాల్లో ఐదేళ్ల కిందట అసంపూర్తిగా నిలిచిన సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పల్లె పండుగ పేరుతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతోంది. సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించడంతో గ్రామాల్లో ఈ పనులు ఊపందుకున్నాయి. 2019కు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గ్రామాల్లో చాలా మేరకు సీసీ రోడ్లు మంజూరయ్యాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ పనులను పట్టించుకోలేదు. దీంతో గిరిజనులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మండలంలో రహదారుల అభివృద్ధి పనులకు సుమారు రూ.7 కోట్లు మంజూరు చేసింది. దీంతో బొండాం పంచాయతీ కొల్యాగుడ గ్రామంలో రూ.15 లక్షలతో 235 మీటర్ల అప్రోచ్ సీసీ రోడ్డు పనులు చేపడుతున్నారు. ఇప్పటికే చాలా మేరకు పనులు పూర్తిచేశారు. ఆర్‌కే నగర్ నుంచి బొండాం వరకు తారురోడ్డు పనులను సుమారు రూ.65 లక్షలతో పూర్తిచేశారు. రేగ నుంచి బోయగుడ వరకు 800 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.90 లక్షలు మంజూరయ్యాయి. లింబగుడ, దండబాడు, కరకవలసనుంచి కటికి జలపాతం వరకు సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్టు పనులు పర్యవేక్షిస్తున్న టీడబ్ల్యూ ఇంజనీరింగ్ విభాగం అరకు మండలం ఏఈఈ అభిషేక్, బొండాం సర్పంచ్ భాస్కరరావు తెలిపారు.