రక్షిత్ ఫార్మాలో ప్రమాదం
ABN , Publish Date - Dec 24 , 2024 | 01:46 AM
పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్ డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్’ పరిశ్రమలో సోమవారం విష వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.
విష వాయువుల లీక్ కావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్ర అస్వస్థత
ఒకరి పరిస్థితి ఆందోళనకరం
పరవాడ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):
పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్ డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్’ పరిశ్రమలో సోమవారం విష వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఇందుకు సంబంధించి పరవాడ సీఐ జి.మల్లికార్జునరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరిశ్రమలోని ప్రొడక్షన్ బ్లాక్ -1లో ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు ఉగ్రెసర్ గౌడ (26), దేవ్‌బాగ్ (38) సోమవారం తెల్లవారుజామున ఐదున్నర గంటలకు స్పృహ కోల్పోయి ఉన్నారు. వారిని బ్లాక్-2 నుంచి కిందకు వస్తూ కెమిస్టు నాగేశ్వరరావు గమనించారు. అప్పటికే దేవ్‌బాగ్ అపస్మారక స్థితిలోకి జారుకోగా, ఉగ్రెసర్ గౌడ ఫిట్స్ వచ్చినట్టు కాళ్లు, చేతులు కొట్టుకుంటున్నారు. వెంటనే ఇద్దరికీ పరిశ్రమలోనే ఆక్సిజన్ ఏర్పాటుచేసి అనంతరం గాజువాక సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వీరిలో దేవ్‌బాగ్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
ప్రొడక్షన్ బ్లాక్-1లో మొత్తం తొమ్మిది మంది కార్మికులు పనిచేస్తున్నారు. తెల్లవారుజామున ఐదున్నర గంటల సమయంలో మిగతా ఏడుగురు షిఫ్ట్ ఛేజింగ్ కోసమని సెక్యూరిటీ వద్దకు వెళ్లి పంచింగ్ చేయడంలో నిమగ్నమయ్యారు. అదే సమయంలో బ్లాక్-1లో రియాక్టర్ నుంచి హైడ్రోజన్ సల్ఫేడ్ వాయువు రియాక్టర్‌కు చెందిన స్క్రబ్బర్ నుంచి లీకై ఉండవచ్చునని, వాటిని పీల్చడం వల్ల అక్కడ ఉన్న ఇద్దరూ అస్వస్థతకు గురై ఉంటారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఉగ్రెసర్, దేవ్‌బాగ్‌లు షిఫ్ట్ ముగిసిన తరువాత కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అక్కడ కూర్చుని ఉంటారని తోటి కార్మికులు చెబుతున్నారు. వాయువులు ప్రొడక్షన్ బ్లాక్‌లో ఎక్కడ నుంచి లీకయ్యాయో గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
సంఘటనా స్థలిని పరిశీలించిన అధికారులు
ప్రమాదం చోటుచేసుకున్న రక్షిత్ డ్రగ్స్‌లోని ప్రొడక్షన్ బ్లాక్‌ను పరిశ్రమల తనిఖీ అధికారులు జె.శివశంకర్‌రెడ్డి, జేవీఎస్ నారాయణరావు, తహసీల్దార్ ఎస్‌వీ అంబేద్కర్, సీఐ మల్లికార్జునరావుతో పాటు పీసీబీ, అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలించారు. ప్రమాదం ఎలా జరిగిందో యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. వాయువులు ఎక్కడ లీకయ్యాయో తెలుసుకునే పనిలో ఉన్నారు.
ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలతో ఆందోళన
అనకాపల్లి, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటుండం ఆందోళన కలిగిస్తున్నది. నవంబరు 26వ తేదీన ఠాగూర్ ఫార్మా లేబొరేటరీస్‌లో విషవాయులు లీకైన సంఘటనలో పలువురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒడిశాకు చెందిన ఒక కార్మికుడు మృతిచెందాడు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబునాయుడు స్పందించి, బాధితులకు అందుతున్న చికిత్స గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా ఈ నెల ఆరో తేదీన ఇదే ఫార్మాసిటీలో శ్రీఆర్గానిక్స్ ఫార్మా కంపెనీలో ప్రమాదం సంభవించింది. ప్రొడక్షన్ బ్లాక్‌లోని డ్రయ్యర్ యంత్రం నుంచి ఉత్పిత్తిని బయటకు తీసే క్రమంలో కార్మికులు మ్యాన్ హోల్ ఓపెన్ చేస్తుండగా ఇద్దరు కార్మికులపై రసాయనాలు పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితులకు సత్వరమే మెరుగైన చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపడుతున్నామని అధికార యంత్రాంగం చెబుతుండగా మరోవైపు వరుస సంఘటనలు కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
రక్షిత్ సంఘటనపై విచారణకు ఆదేశం
పరవాడ ఫార్మా సిటీలోని రక్షిత్ డ్రగ్స్ ఫార్మా కంపెనీలో సోమవారం ఉదయం విషవాయువు విడుదలై తీవ్ర అస్వస్థతకు గురైన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ఈ సంఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులను కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు.