Share News

చురుగ్గా ఈఎస్‌ఐ ఆస్పత్రి పనులు

ABN , Publish Date - Oct 02 , 2024 | 01:06 AM

ఉత్తరాంధ్రాలోని ఉద్యోగులు, కార్మికులకు ఉపయోగపడేలా షీలానగర్‌లో జాతీయ రహదారికి సమీపాన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఆస్పత్రి రూపుదిద్దుకుంటోంది.

చురుగ్గా ఈఎస్‌ఐ ఆస్పత్రి పనులు

8.58 ఎకరాల్లో రూ.384.26 కోట్లతో నిర్మాణం

350 పడకలు

మరో 50 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌

వచ్చే ఏడాది అక్టోబరు నాటికి పూర్తిచేయాలని లక్ష్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉత్తరాంధ్రాలోని ఉద్యోగులు, కార్మికులకు ఉపయోగపడేలా షీలానగర్‌లో జాతీయ రహదారికి సమీపాన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) ఆస్పత్రి రూపుదిద్దుకుంటోంది. దీనిని 8.58 ఎకరాల్లో, రూ.384.26 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఇది ఎప్పుడో పూర్తి కావలసిన ప్రాజెక్టు. భూ కేటాయింపులో సమస్యల వల్ల తీవ్ర జాప్యం జరిగింది.

బీజేపీ నాయకులు ఎం.వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన కాలంలో ఈఎస్‌ఐ ఆస్పత్రిని మంజూరుచేసి 2016 ఏప్రిల్‌ 11న మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో కలిసి శంకుస్థాపన చేశారు. అయితే భూ సమస్య వల్ల పనులు ప్రారంభం కాలేదు. బీజేపీ నాయకులు ఢిల్లీ స్థాయిలో మాట్లాడి 2023 ఏప్రిల్‌ 10న పనులు ప్రారంభమయ్యేలా చేశారు. అంటే శంకుస్థాపన జరిగిన ఏడేళ్లకుగానీ పునాదులు తవ్వలేదు. ఈ ఆస్పత్రి నిర్మాణానికి పూర్తి నిధులు కేంద్రం మంజూరుచేసింది. నిర్మాణ బాధ్యతలను సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌ విభాగానికి అప్పగించింది. ఇక్కడ 350 పడకల ఆస్పత్రి, మరో 50 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ నిర్మిస్తారు. దీనిని 2025 అక్టోబరు నాటికి పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు.

30 శాతం పనులు పూర్తి

ఈ ఏడాదిన్నర కాలంలో భూమిని చదును చేసి, పునాదులు తీసి, బ్లాకులుగా విడదీసి మార్చురీ బ్లాక్‌ను శ్లాబ్‌ లెవెల్‌ వరకు పూర్తిచేశారు. ఆస్పత్రి ప్రధాన భవన నిర్మాణం 30 శాతం వరకు పూర్తయ్యింది. సర్వీస్‌ టన్నెల్‌, ఆస్పత్రి లోపలకు రావడానికి, బయటకు వెళ్లడానికి అవసరమైన టన్నెల్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌ శ్లాబ్‌ పూర్తయింది.

అన్ని వసతులు ఇక్కడే

విశాఖ ప్రాంత ఉద్యోగులు, కార్మికుల కోసం మల్కాపురంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రిని సుమారు రూ.28 కోట్లతో ఆధునికీకరించారు. అయితే షీలానగర్‌ ఆస్పత్రికి ఎవరైనా ఏదైనా ఆరోగ్య సమస్యపై వస్తే పరీక్షలకు గానీ, ఆపరేషన్లకు గానీ బయటకు వెళ్లకుండా అన్ని సేవలు అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎవరికైనా ఎంఆర్‌ఐ స్కాన్‌, పెద్ద పెద్ద ఆపరేషన్లు అవసరమైతే మల్కాపురంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రి నుంచి కార్పొరేట్‌ ఆస్పత్రులకు పంపుతున్నారు. షీలానగర్‌ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఎంఆర్‌ఐ స్కానింగ్‌ అక్కడే చేస్తారు. అన్నిరకాల ఆపరేషన్లు నిర్వహిస్తారు.

త్వరలోనే తొలి బ్లాక్‌ ప్రారంభం

పీవీఎన్‌ మాధవ్‌, మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ

షీలానగర్‌ ఆస్పత్రి నిర్మాణం శరవేగంతో నిర్మాణం జరుగుతోంది. ఆస్పత్రి మొత్తం పూర్తయ్యేంత వరకు ఆగకుండా అందుబాటులోకి వచ్చిన భవనాలను వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. ఏ బ్లాక్‌ ముందుగా పూర్తవుతుందో దానిని ప్రారంభించి సేవలు ప్రారంభించే యోచన ఉంది.

Updated Date - Oct 02 , 2024 | 01:07 AM