Share News

గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా 8వ వార్డు

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:02 AM

జీవీఎంసీ 8వ వార్డులో గంజాయి సేవించే వారు అధికమవుతున్నారు. గంజాయ్‌ బ్యాచ్‌లకు ఈ వార్డు కేరాఫ్‌గా మారుతోంది. ఈ ప్రాంతంలోని యువకులు పూటుగా గంజాయి సేవించి విచక్షణ రహితంగా ఘర్షణలకు పాల్పడుతున్నారు.

గంజాయి, డ్రగ్స్‌కు అడ్డాగా 8వ వార్డు

ఎండాడ, జూలై 26 : జీవీఎంసీ 8వ వార్డులో గంజాయి సేవించే వారు అధికమవుతున్నారు. గంజాయ్‌ బ్యాచ్‌లకు ఈ వార్డు కేరాఫ్‌గా మారుతోంది. ఈ ప్రాంతంలోని యువకులు పూటుగా గంజాయి సేవించి విచక్షణ రహితంగా ఘర్షణలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఎండాడ, గొల్లల ఎండాడ ప్రాంతాల్లోని లేఅవుట్‌ల్లో ఖాళీ స్థలాలు అధికంగా ఉండడంతో పాటు కొన్ని స్థలాల్లో ఖాళీ షెడ్లు ఉన్నాయి. జన సంచారం లేకపోవడంతో గంజాయి సేవించే వారికి ఇవి ఆవాసాలుగా మారుతున్నాయి. సంబంధిత షెడ్ల యజమానులు లేకపోవడం, వాచ్‌మెన్‌లు కూడా ఉండకపోవడంతో గంజాయి వినియోగించే వారికి అవకాశంగా మారింది. ఎండాడ ఎయిమ్స్‌ కళాశాల వెనుక భాగం, ఎండాడ - రుషికొండ డబుల్‌ రోడ్డు నుంచి శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌కి వెళ్లే ప్రాంతం,గొల్లల ఎండాడలోని వైఎల్‌పీ లేఅవుట్‌, గొల్లల ఎండాడకి ఆనుకుని ఉన్న డిఫెన్స్‌ ఫైరింగ్‌ స్టేషన్‌ ఏరియా, తిరుమల తిరుపతి దేవస్థానం వెనుక ఉన్న కొండ ప్రాంతం, ప్రభుత్వం ఇటీవల వేసిన లేఅవుట్‌ కొండ, ఐటీ రోడ్డు ప్రాంతాలు, ఎండాడ యూపీహెచ్‌సీ ప్రాంతం, అంధ బాలికల ఆశ్రమ పాఠశాల వెనుక భాగం, వైబ్స్‌ రెస్ట్రో వెనుక భాగంలో గంజాయి ఎక్కువగా సేవిస్తున్నారు.

పులి సంచారం అంటూ పుకార్లు

ఇటీవల ఎండాడ యూపీహెచ్‌సీ ప్రాంతంలో పులి సంచారమంటూ పుకార్లు సృష్టించారు. అటవీ శాఖాధికారులు ఆ ప్రాంతంలో పర్యటించి, పరిశీలించిన అనంతరం పులి సంచారం బూటకమని తేల్చారు. ఇటువంటి పుకార్లు మద్యం సేవించే వారు, గంజాయి వినియోగించే వారి పనేనని గ్రామస్థులు అంటున్నారు. పులి సంచారమంటూ భయందోళన కలిగిస్తే అటుగా జన సంచారం ఉండదని వారి భావన. ఈ ప్రాంతం లో ఖాళీ స్థలాలు అధికంగా ఎక్కువగా ఉండడంతో స్థానిక యువతతో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గంజాయి సేవిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

కొరవడిన పోలీసుల నిఘా..

ఎనిమిదో వార్డు సగం ఆరిలోవ పోలీసు స్టేషన్‌ పరిధి కాగా సగ భాగం పీఎం పాలెం పోలీసు స్టేషన్‌ పరిధిలో ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో బీచ్‌ పెట్రోలింగ్‌ పేరుతో రెండు స్టేషన్ల పోలీసులు గ్రామాల్లో పెట్రోలింగ్‌ చేసేవారు. వైసీపీ ప్రభుత్వంలో బీచ్‌ పెట్రోలింగ్‌ వాహనాలను బీచ్‌ రోడ్డుకే పరిమితం చేశారు. ప్రస్తుతం (బూ ్లకాట్స్‌) ఇద్దరు, ముగ్గురు పోలీసులు ద్విచక్ర వాహనాల మీద తిరుగుతున్నా.. వారు పూర్తిస్థాయిలో పర్యవేక్షించ లేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. వార్డులో డ్రగ్స్‌, గంజాయి, బహిరంగంగా మద్యం సేవించే వారిని నియంత్రించాలంటే ప్రత్యేకంగా నిఘా పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jul 27 , 2024 | 12:02 AM