Share News

వదలని ముసురు

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:34 PM

ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో మన్యంలో గత నాలుగు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. అయితే జల్లులతో కూడిన వర్షం మినహా భారీ వాన పడకపోవడంతో రైతులు, ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు.

వదలని ముసురు
పాడేరులో సోమవారం ముసురు వాతావరణం

ఏజెన్సీలో జల్లులతో కూడిన వర్షం

వాతావరణం మార్పుతో తగ్గిన చలి

పాడేరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఫెంగల్‌ తుఫాన్‌ ప్రభావంతో మన్యంలో గత నాలుగు రోజులుగా ముసురు వాతావరణం కొనసాగుతున్నది. అయితే జల్లులతో కూడిన వర్షం మినహా భారీ వాన పడకపోవడంతో రైతులు, ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఎడతెరిపి లేకుండా జల్లులతో కూడిన వర్షంతో జనజీవనానికి మాత్రం అంతరాయం ఏర్పడుతున్నది. తుఫాన్‌పై ముందు నుంచి రాష్ట్ర విపత్తుల సంస్థ ప్రచారం చేయడంతో వరి పంట పాడవకుండా గిరిజన రైతులు రక్షించుకోగలిగారు. తాజా వర్షంతో మట్టి, కచ్చా రోడ్లు బురదగా మారడంతో మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండు రోజుల్లో తుఫాన్‌ ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టనుందని వాతావరణ శాఖ పేర్కొంది.

తగ్గిన చలి తీవ్రత

తుఫాన్‌ ప్రభావంతో వాతావరణం మారిపోయి మన్యంలో గత నాలుగు రోజులుగా చలి తీవ్రత తగ్గింది. ఆకాశం మేఘావృతం కావడం, మంచు కురవకపోవడంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగాయి. అనంతగిరిలో 18.8 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అరకులోయలో 19.1, జి.మాడుగులలో 19.2, డుంబ్రిగుడలో 19.3, జీకేవీధి, చింతపల్లిలో 20.1, పాడేరు, హుకుంపేట, పెదబయలులో 20.2 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం ఏజెన్సీలో చలి ప్రభావం అంతగా లేదు.

Updated Date - Dec 02 , 2024 | 11:34 PM