ప్రకృతి ఒడిలో అనంత వెంకన్న
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:49 PM
సహజసిద్ధ అందాల నడుమ కొండపై వెలిసిన అనంత వేంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కొండను ఆనుకుని తాటిపూడి జలాశయం, చుట్టూ ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులను సైతం ఆకట్టుకుంటున్నాయి.
సహజసిద్ధ అందాల నడుమ ఆలయం
సముద్ర మట్టానికి 3,333 అడుగుల ఎత్తులో నిర్మాణం
భక్తులతో నిత్యం కోలాహలం
అనంతగిరి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సహజసిద్ధ అందాల నడుమ కొండపై వెలిసిన అనంత వేంకటేశ్వరస్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కొండను ఆనుకుని తాటిపూడి జలాశయం, చుట్టూ ప్రకృతి రమణీయ దృశ్యాలు పర్యాటకులను సైతం ఆకట్టుకుంటున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనంతో పాటు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు.
అనంతగిరి, గంట్యాడ మండలాల సరిహద్దు ప్రాంతమైన ఎగువకొండపర్తి గ్రామంలో కొండపై అనంత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభించారు. ఈ ఆలయం సముద్రమట్టానికి 3,333 అడుగుల ఎత్తులో ఉంది. తొమ్మిదిన్నర అడుగుల ఎత్తులో గల అనంత వేంకటేశ్వరస్వామి విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని కర్రీ సముద్రరెడ్డి సుమారు రూ.10 కోట్లతో నిర్మించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పురోహితుల సారథ్యంలో అనంత వేంకటేశ్వరస్వామి విగ్రహంతో పాటు గోదాదేవి, పద్మావతిదేవి, వరాహస్వామి, సంకల్పసిద్ధ మహాగణపతి, అలివేలు మంగమ్మ, అంజనేయస్వామి విగ్రహాలకు ప్రాణపతిష్ఠ చేశారు.
ఆలయానికి చేరుకోవడం ఇలా..
విజయనగరం జిల్లా ఎస్.కోట నుంచి కాశీపట్నం వద్దకు 12 కిలో మీటర్లు ప్రయాణించి, అక్కడ నుంచి కుడివైపుగా ఎన్‌ఆర్‌పురం రోడ్డులో 18 కిలో మీటర్లు ప్రయాణిస్తే ఈ ఆలయం వద్దకు చేరుకోవచ్చు. 18 కిలో మీటర్ల ఘాట్ రోడ్డులో 36 మలుపులు ఉన్నాయి. ఈ ఘాట్ రోడ్డుపై అవగాహన లేకపోతే వాహనచోదకులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే సురక్షితంగా ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయాన్ని దర్శిస్తే తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుందని భక్తులు చెబుతున్నారు.