కదంతొక్కిన అంగన్‌వాడీలు
ABN , Publish Date - Nov 17 , 2024 | 01:06 AM
కదంతొక్కిన అంగన్‌వాడీలుకదంతొక్కిన అంగన్‌వాడీలు
- మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్
- ఐటీడీఏ, కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా
పాడేరురూరల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ అంగన్‌వాడీలుగా మార్పు చేస్తూ జీవోను విడుదల చేయాలనే డిమాండ్‌తో సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలు శనివారం ఐటీడీఏ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఐటీడీఏ కార్యాలయ ప్రధాన గేటు వద్ద ఆందోళన చేపట్టిన అంగన్‌వాడీలు అక్కడ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టి అక్కడ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి.నాగమ్మ, వి.భాగ్యలక్ష్మి, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎల్.సుందరరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారన్నారు. సెంటర్ నిర్వహణలో వర్కర్, హెల్పర్ చేసే పనిని మినీ అంగన్‌వాడీ కార్యకర్త ఒక్కరే చేయడం వల్ల పనిభారం పెరుగుతుందన్నారు. మినీ వర్కర్లకు పదోన్నతులు కల్పించాలనే జీవోను సక్రమంగా అమలుచేయడం లేదన్నారు. అత్యవసర సమయాల్లో, వేసవిలో మినీ వర్కర్లకు సెలవులు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ ఏఎస్ దినేశ్ కుమార్‌కు సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో 11 మండలాల నాయకులు ఇందిర, పెంటమ్మ, అప్పలకొండ, రాములమ్మ, అప్పలనర్స, కొండమ్మ, నిర్మల, సుజాత, అంగన్‌వాడీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.