ప్రతి విద్యార్థికి అపార్ నంబరు
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:40 AM
జిల్లాలో ప్రతి విద్యార్థికి ఆటోమేటెడ్ పర్మినెంట్ ఎకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) నంబరు జారీ చేస్తున్నామని, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు.
- పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
- శత శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ప్రణాళిక
- జిల్లా విద్యాశాఖాధికారి జి.అప్పారావునాయుడు
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ప్రతి విద్యార్థికి ఆటోమేటెడ్ పర్మినెంట్ ఎకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ (అపార్) నంబరు జారీ చేస్తున్నామని, పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ప్రణాళిక అమలు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావునాయుడు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సాధారణ బదిలీల్లో భాగంగా ఆయన అనకాపల్లి డీఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా విద్యాశాఖ ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి వివరించారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగే వరకు ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 21,793 మంది బాలబాలికలు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నారని చెప్పారు. రోజూ పాఠశాల ప్రారంభ సమయానికి ముందు ఒక గంట, సాయంత్రం పాఠశాల సమయం ముగిశాక మరో గంట వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో మండల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో అపార్ రిజిస్ట్రేషన్లు జోరుగా సాగుతున్నాయన్నారు. హైస్కూల్ విద్య నుంచి ఆధార్ నంబరు మాదిరిగా ఇంటర్మీడియట్ వరకు ప్రతి విద్యార్థికి శాశ్వతంగా అపార్ నంబరు ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోందన్నారు. జిల్లాలో హైస్కూల్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మొత్తం 2,37,587 మంది విద్యార్థులు ఉండగా, ఇప్పటికే 1,62,825 మందికి నంబర్ల జారీ పూర్తయిందని చెప్పారు. వచ్చే ఏడాది జనవరి మాసాంతం వరకు ఈ నంబర్ల జారీ జరుగుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన నియామకాల్లో భాగంగా జిల్లాలో కేజీబీవీల్లో 19 మంది సీఆర్‌టీలకు ఇటీవల పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చామన్నారు. నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు ఉన్నత విద్య చదివిన అనేకమంది దరఖాస్తులు చేసుకున్నారన్నారు. నాన్ టీచింగ్ పోస్టులకు అభ్యర్థుల ఏడో తరగతి మార్కుల జాబితా, స్థానికత ధ్రువీకరణ పత్రాలు అందజేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 24 భవిత సెంటర్లలో విద్యార్థులకు మెరుగైన సేవలు అందుతున్నాయని ఆయన తెలిపారు.