Share News

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు

ABN , Publish Date - Dec 25 , 2024 | 01:04 AM

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు దూరాభారం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు

జిల్లా ఆరు జోన్లుగా విభజన

ఏ జోన్‌లో విద్యార్థులకు ఆ జోన్‌లోనే పరీక్ష కేంద్రాల కేటాయింపు

ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఏర్పాటు

మద్దిలపాలెం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):

ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు దూరాభారం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాలుగైదు కిలోమీటర్ల పరిఽదిలోనే పరీక్షల కేంద్రాలు ఉండేలా చర్యలు చేపట్టారు. అందుకు అగనంపూడి నుంచి తగరపువలస వరకూ ఆరు జోన్లు (తగరపువలస, పెందుర్తి, గాజువాక, మధురవాడ, వెంకోజీపాలెం-అక్కయ్యపాలెం, అక్కయ్యపాలెం-ఎన్‌ఏడీ జంక్షన్‌)గా విభజించారు. ఏ జోన్‌ పరిధిలోని విద్యార్థులు ఆ జోన్‌లోనే పరీక్షలు రాసేవిధంగా చూడనున్నారు. గత ఏడాది వరకూ మధురవాడ విద్యార్థులకు సిటీలో, గాజువాక విద్యార్థులకు పెందుర్తిలో సెంటర్లు కేటాయించేవారు. ఈ ఏడాది అటువంటి సమస్య లేకుండా విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పరీక్షల నిర్వహణకు సన్నహాలు

ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఫర్నిచర్‌, విద్యుత్‌, పరిశుభ్రమైన గదులు, మరుగుదొడ్లు వంటి పూర్తిస్థాయి మౌలిక వసతులు కలిగిన జూనియర్‌ కళాశాలలను గుర్తించారు. 2023-24 ఏడాదిలో 93 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. ఈసారి ఒకటి, రెండు కేంద్రాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. జిల్లాలో 188 కళాశాలల నుంచి 82,899 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో ప్రథమ సంవత్సరం నుంచి 42,228, ద్వితీయ సంవత్సరం నుంచి 40,671 మంది ఉన్నారు. రవాణా సౌకర్యం లేని గాజువాకలోని విశాఖ డిఫెన్స్‌ అకాడమీ, మౌలిక వసతులు లేనందున అగనంపూడి, మధురవాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలను పరీక్షల కేంద్రాల నుంచి తప్పించారు.

పరీక్షా కేంద్రాలకు నో అంటున్న కార్పొరేట్‌ కళాశాలలు...

జిల్లాలోని కొన్ని కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలు తమ కళాశాలల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అంగీకరించడం లేదని తెలిసింది. సాధారణంగా కార్పొరేట్‌ కళాశాలలు ఇంటర్‌ విద్యతో పాటు, ఎంసెట్‌, ఐఐటీ, నీట్‌ వంటి పోటీ పరీక్షలకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుంటాయి. మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు ఉన్నందున ఆయా రోజుల్లో తమ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం కుదరదనే పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ససేమిరా అంటున్నట్టు సమాచారం.

జోన్‌ల వారీగా...: ఆర్‌ఐవో మురళీధర్‌

ఈ ఏడాది నుంచి జోన్‌ల వారీగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం. మౌలిక వసతులు కలిగిన కళాశాలలను ఎంపిక చేసి అన్నీ గదుల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం.

Updated Date - Dec 25 , 2024 | 01:04 AM