Share News

పోర్టుకు భారీ నౌకల రాక

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:08 AM

విశాఖపట్నం పోర్టుకు ఇటీవల కాలంలో భారీ నౌకల రాక పెరుగుతోంది. పోర్టు లోపలకు నౌకలు వచ్చే ఛానల్‌ లోతు(డ్రాఫ్ట్‌)ను డ్రెడ్జింగ్‌ ద్వారా పెంచడం, అలాగే బెర్తుల వద్ద ఎక్కువ లోతు చేయడంతో భారీ నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈక్యు 6 బెర్తు లోతును 11 మీటర్ల నుంచి 11.5 మీటర్లకు పెంచారు.

పోర్టుకు భారీ నౌకల రాక

విశాఖ విశాఖపట్నం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం పోర్టుకు ఇటీవల కాలంలో భారీ నౌకల రాక పెరుగుతోంది. పోర్టు లోపలకు నౌకలు వచ్చే ఛానల్‌ లోతు(డ్రాఫ్ట్‌)ను డ్రెడ్జింగ్‌ ద్వారా పెంచడం, అలాగే బెర్తుల వద్ద ఎక్కువ లోతు చేయడంతో భారీ నౌకల రాకపోకలకు మార్గం సుగమమైంది. ఈక్యు 6 బెర్తు లోతును 11 మీటర్ల నుంచి 11.5 మీటర్లకు పెంచారు. అలాగే డబ్ల్యుక్యు 4, 5 బెర్తుల లోతును కూడా 11.5 మీటర్లకు పెంచారు. డబ్ల్యుక్యు 1, 2, 3 బెర్తుల లోతును 13 మీటర్ల నుంచి 13.5 మీటర్లకు పెంచారు. కంటెయినర్‌ టెర్మినల్‌లో అయితే 15 మీటర్ల నుంచి 16 మీటర్లకు పెంచారు. నౌకల నిర్వహణ సామర్థ్యం కూడా పెరిగింది. ఇన్నర్‌ హార్బర్‌ వద్ద ఏడు బేబీ కేప్‌ నౌకలు, సింగిల్‌ పాయింట్‌ మూరింగ్‌ (ఆయిల్‌) బెర్త్‌ వద్ద 15 నౌకలు, ఓర్‌ బెర్త్‌ వద్ద 10 కేప్‌సైజ్‌ నౌకలు పెట్టుకునే వెసులుబాటు ఉంది. పైలట్ల కొరత ఉన్నప్పటికీ మెరైన్‌ విభాగం ఇబ్బందులను అధిగమించి భారీ నౌకలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ నెల 12వ తేదీన కంటెయినర్‌ టెర్మినల్‌కు 366 మీటర్ల పొడవైన కంటెయినర్‌ నౌక ఎంఎస్‌సీ టొపాజ్‌, నవంబరు 9న 185.6 మీటర్ల పొడవైన ఎంవీ టోండా నౌక వచ్చాయి. అలాగే భారత నౌకాదళం కోసం షిప్‌యార్డు నిర్మించిన అతి పెద్ద ఫ్లోటింగ్‌ డాక్‌ (179.9 మీటర్లు)ను విజయవంతంగా తరలించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న 262 మీటర్ల పొడవైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కంటెయినర్‌ టెర్మినల్‌కు వచ్చింది. ఏప్రిల్‌ 28న ప్రపంచంలోనే అత్యుత్తమ క్రూయిజ్‌ నౌక ‘ది వరల్డ్‌’ పోర్టు కొత్తగా నిర్మించిన క్రూయిజ్‌ టెర్మినల్‌కు వచ్చింది. ఇలా అనేక భారీ నౌకలు రావడం సంతోషంగా ఉందని పోర్టు వర్గాలు తెలిపాయి.

Updated Date - Nov 21 , 2024 | 01:08 AM