Share News

ఏయూ దూర విద్య విద్యార్థుల అగచాట్లు

ABN , Publish Date - Aug 04 , 2024 | 01:10 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని దూరవిద్యా కేంద్రం ద్వారా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు అధికారులు సకాలంలో సర్టిఫికెట్లు అందించడం లేదు.

ఏయూ దూర విద్య విద్యార్థుల అగచాట్లు

  • డిగ్రీ, పీజీ విద్యార్థులకు గడిచిన రెండేళ్లుగా అందని ఓడీ, మార్కుల లిస్టులు

  • సుమారు పది వేల మంది నిరీక్షణ

  • టెంప్లేట్‌ డిజైన్‌లో జాప్యమే కారణం

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని దూరవిద్యా కేంద్రం ద్వారా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు అధికారులు సకాలంలో సర్టిఫికెట్లు అందించడం లేదు. దూర విద్యా కేంద్రం ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో పలు డిగ్రీ, పీజీ కోర్సులను నిర్వహిస్తున్నారు. 2020-23 మధ్య సుమారు పది వేల మంది ఆన్‌లైన్‌లో నిర్వహించే డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరారు. వీరంతా ఇప్పటికే తమ కోర్సులను పూర్తిచేశారు. వీరికి సాధారణంగా కోర్సు పూర్తయిన రెండు నెలల్లో ఒరిజినల్‌ డిగ్రీలను అందించాలి. అలాగే, మార్కుల లిస్టులను అందించాలి. అయితే కోర్సులు పూర్తయి, ఫలి తాలు విడుదలై నెలలు దాటుతున్నా విద్యార్థులకు అధికారులు సర్టిఫికెట్లను ఇవ్వడం లేదు. ఇది ఆయా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఇబ్బందిగా పరిణ మిస్తోంది. ఉద్యోగాలు, ఇతర అవసరాలకు ఆ సర్టిఫికెట్లను వినియోగించుకోలేకపోతున్నామని విద్యార్థులు వాపో తున్నారు.

సుదూర ప్రాంతాలు నుంచి రాక..

ఏయూ దూరవిద్యా కేంద్రం ద్వారా చదువుకునే వారిలో అనేక మంది ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. వీరంతా సర్టిఫికెట్ల కోసం దూర విద్యా కేంద్రానికి వస్తున్నారు. అధికారులు సమయం పడుతుందని చెబుతుండడంతో ఉసూరుమంటూ వెనుతిరుగుతున్నారు. పీజీ కోర్సు పూర్తి చేసి ఆరు నెలలు అవుతోందని, సర్టిఫికెట్లు కోసం వస్తే సమయం పడుతుందని చెబుతున్నారని గుంటూరు జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి వాపోయారు. కంపెనీలో ప్రమోషన్‌ లభిస్తుందని పీజీ చేస్తే...సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు ఎక్కువ సమయం తీసుకోవడం వల్ల ఇబ్బంది అవుతోందంటూ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి శనివారం ఏయూ వీసీ శశిభూషణరావు దృష్టికి తీసుకువెళ్లగా సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషిచేస్తామన్నారు. టెంప్లేట్‌ డిజైన్‌ చేయకపోవడం వల్ల ఇబ్బంది తలెత్తిందని వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అధికారులతో సమీక్షించానని, కొద్దిరోజుల్లోనే డిజైన్‌ పూర్తిచేసి విద్యార్థులకు ఒరిజినల్‌ డిగ్రీతోపాటు మార్కుల లిస్టులు అందించే ఏర్పాటు చేస్తామన్నారు.

3,800 కిలోల రేషన్‌ బియ్యం స్వాధీనం

విశాఖపట్నం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి):

మల్కాపురం ప్రాంతంలోని ప్రకాష్‌నగర్‌లో గల ఒక ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన 3,800 కిలోల రేషన్‌ బియ్యాన్ని శుక్రవారం రాత్రి పౌర సరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గాజువాక సర్కిల్‌ ఏఎస్‌వో టి.కృష్ణ, చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ పద్మ దాడి చేసి బియ్యం పట్టుకున్నట్టు జిల్లా పౌర సరఫరాల అధికారి గూన సూర్యప్రకాశరావు తెలిపారు. అదేవిధంగా నాతయ్యపాలెంలో ఒక ఇంట్లో 300 కిలోలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల బరిలో 20 మంది

వెంకోజీపాలెం, ఆగస్టు 3:

జీవీఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు ఉన్నట్టు అదనపు కమిషనర్‌ ఎస్‌.ఎస్‌.వర్మ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు శనివారం మధ్యాహ్నం మూడు గంటలతో గడువు ముగిసినందున...పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శించినట్టు పేర్కొన్నారు. ఈ నెల 7వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు, అదేరోజు ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Aug 04 , 2024 | 01:10 AM