Share News

ఏయూ ఈసీ సమావేశం వాయిదా

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:48 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలక మండలి (ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌) సమావేశం వాయిదా పడింది.

ఏయూ ఈసీ సమావేశం వాయిదా

విశాఖపట్నం, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పాలక మండలి (ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌) సమావేశం వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం బుధవారం ఉదయం సమావేశం జరగాల్సి ఉంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని భావించారు. ఈసీ సభ్యునిగా ఉన్నత విద్యా శాఖకు చెందిన ఉన్నతాధికారి కూడా వస్తారని అధికారులు భావించారు. అయితే, ఈసీ సమావేశాన్ని వాయిదా వేయాల్సిందిగా మంగళవారం ఉన్నత విద్యాశాఖ అధికారుల నుంచి వర్సిటీ అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు సభ్యులకు సమాచారం అందించారు. ఈసీ సమావేశం వాయిదా పడడంతో వీసీ ఎంపిక మరింత జాప్యం జరిగే అవకాశం ఉందంటున్నారు.

విశాఖ డిస్టిలరీలో సీఐడీ సోదాలు

అనకాపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

అనకాపల్లి జిల్లా కశింకోట మండలం సుందరయ్యపేటలో గల విశాఖ డిస్టిలరీలో సీఐడీ అధికారుల బృందం మంగళవారం సోదాలు నిర్వహించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మద్యం అమ్మకాలపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా డిస్టిలరీల్లో సీఐడీ తనిఖీలు చేపట్టింది. ఇందులో భాగంగా సీఐడీ విశాఖ అదనపు ఎస్పీ ప్రేమ్‌ కాజల్‌ నేతృత్వంలో 15 మంది అధికారుల బృందం ఉదయం 9.30 గంటలకు విశాఖ డిస్టిలరీ కంపెనీకి చేరుకుని సోదాలు ప్రారంభించింది. విశాఖ డిస్టిలరీకి గత వైసీపీ ప్రభుత్వం జారీచేసిన మద్యం తయారీ అనుమతులను, ఇతరత్రా లావాదేవీల రికార్డులను సీఐడీ అధికారుల బృందం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఏ సంవత్సరంలో ఎంత మొత్తం మద్యం తయారుచేశారు, ఏఏ తేదీల్లో ఎన్ని కోట్ల రూపాయిల లావాదేవీలు సాగాయి, మద్యం దుకాణాలకు ఎంత మొత్తం సరఫరా చేశారు అనే వివరాలను సేకరించినట్టు సమాచారం. తనిఖీలు రాత్రి ఎనిమిది గంటల సమయానికి కూడా కొనసాగుతున్నాయి.

Updated Date - Oct 23 , 2024 | 12:48 AM