Share News

ఐఐటీ, ఎన్‌ఐటీల స్థాయికి ఏయూ

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:47 AM

‘‘ఐఐటీ, ఎన్‌ఐటీల స్థాయిలో ఏయూను తీర్చిదిద్దుతాం. నేషనల్‌ యూనివర్సిటీల మాదిరిగా ఏయూకు బ్రాండ్‌ క్రియేట్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఐఐటీ, ఎన్‌ఐటీల స్థాయికి ఏయూ

  • నేషనల్‌ యూనివర్సిటీల మాదిరిగా బ్రాండ్‌ క్రియేట్‌ చేయడమే లక్ష్యం

  • అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ప్రణాళిక

  • వర్సిటీని రాజకీయాలకు దూరంగా ఉంచడమే ప్రథమ కర్తవ్యం

  • ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకును మెరుగుపరుచుకునేందుకు

  • ప్రత్యేక ప్రణాళిక రూపకల్పన

  • పరిశోధనలను ప్రోత్సహిస్తాం

  • ప్రిన్సిపాల్స్‌ కూడా తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌ బోధించాలని ఆదేశాలు జారీచేశాం

  • ఫ్యాకల్టీకి పెర్‌ఫార్మెన్స్‌ అప్రైజల్‌ ఫామ్‌

  • ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు

  • అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు అందరూ సమయపాలన పాటించాలి

  • శతాబ్ది ఉత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తాం

  • ప్రధానిని ఆహ్వానించే ఆలోచనలు ఉన్నాయి

  • ఆయనకు, నాకు మధ్య ఉన్నది...ఒక వీసీకి, ప్రిన్సిపాల్‌కు మధ్య ఉన్న బంధమే, అంతకుమించి ఏమీ లేదు

  • నన్ను నమ్మి ప్రభుత్వం బాధ్యతలను అప్పగించింది.

  • ఏయూను జాతీయ స్థాయిలో ముందువరుసలో నిలపడమే ధ్యేయం

  • విద్యార్థులు ఏ సమస్యా ఉన్నా నా దృష్టికి తీసుకురావచ్చు

  • ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌

  • ప్రొఫెసర్‌ జి.శశిభూషణరావు

    విశాఖపట్నం, జూలై 25 (ఆంధ్రజ్యోతి):

‘‘ఐఐటీ, ఎన్‌ఐటీల స్థాయిలో ఏయూను తీర్చిదిద్దుతాం. నేషనల్‌ యూనివర్సిటీల మాదిరిగా ఏయూకు బ్రాండ్‌ క్రియేట్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేశా. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో చదువుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు చూడగానే ఇంటర్వ్యూ, టెస్ట్‌ లేకుండా ఉద్యోగాలు ఇస్తున్నారు. అదేస్థాయికి వర్సిటీని తీసుకువెళతాం’ అని అంటున్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ జి.శశిభూషణరావు. ఇన్‌చార్జి వీసీగా కొద్దిరోజుల కిందట బాధ్యతలు స్వీకరించిన ఆయన గురువారం ‘ఆంధ్రజ్యోతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూనివర్సిటీలో నియామకాలు, కొత్త కోర్సుల ప్రారంభం, వందేళ్ల ఉత్సవాలు సహా అనేక అంశాలపై మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఏయూ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రణాళిక

యూనివర్సిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశాను. విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది సహకారంతో వర్సిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళతాను. ముఖ్యంగా రాజకీయాలకు వర్సిటీని దూరంగా ఉంచడమే లక్ష్యంగా పెట్టుకున్నా. పొలిటికల్‌ ప్రీ క్యాంపస్‌ చేయడమే నాముందున్న ప్రథమ కర్తవ్యం. అకడమిక్స్‌ క్వాలిటీని ఇంప్రూవ్‌ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాను. ఐఐటీ, ఎన్‌ఐటీ స్థాయికి వర్సిటీని తీసుకువెళతాను. గత కొన్నాళ్లుగా నేషనల్‌ ఇనిస్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌)లో వర్సిటీకి మెరుగైన ర్యాంకు రాలేదు. ఈ ర్యాంకు మెరుగుపర్చుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేశా. ప్రస్తుతం ఏయూకు ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకు 76. రానున్న ఏడాదిలో 30 నుంచి 40 మధ్యలో తెచ్చుకోవడంపై దృష్టిసారించా. ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంక్‌ క్వాలిటీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ను తెలియజేస్తుంది. 50లోపు ర్యాంకు ఉంటే కేంద్ర సంస్థలు, ఇతర ఆర్గనైజేషన్‌ నుంచి సుమారు రూ.100 కోట్లు వరకు ప్రాజెక్టులు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నిధులు వర్సిటీలో అభివృద్ధికి, పరిశోధనలు పెరగడానికి దోహదం చేస్తాయి.

పరిశోధనలు పెరగాలి..

యూనివర్సిటీలో పరిశోధనలు పెరగాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రోత్సహిస్తాం. ఈ మేరకు వర్సిటీలోని ప్రిన్సిపాళ్లు, డీన్లుకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చాం. ప్రిన్సిపాల్స్‌ కూడా తప్పనిసరిగా ఒక సబ్జెక్ట్‌ బోధించాలని ఆదేశాలు జారీచేశాం. టైమ్‌ టేబుల్‌, అకడమిక్‌ క్యాలెండర్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని స్పష్టంచేశాం. ముఖ్యంగా ప్రతి విభాగంలో పరిశోధన ప్రాజెక్టులు ప్రోగ్రెస్‌లో ఉండేలా చూడాలని ఆదేశించాం. కొన్నిచోట్ల పరిశోధనలు ఉన్నా..పబ్లికేషన్స్‌ లేవు. క్వాలిటీ జర్నల్స్‌లో పబ్లికేషన్స్‌ లేకపోవడం కూడా ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌ పడిపోవడానికి కారణం. రీసెర్చ్‌ ప్రాజెక్టులకు దరఖాస్తు చేయాల్సిందిగా సీనియర్‌ ప్రొఫెసర్లను, ఫ్యాకల్టీని ప్రోత్సహిస్తున్నాం. ఫండింగ్‌ చేసే సంస్థలకు దరఖాస్తు చేయాలని సూచించాం. దీనివల్ల వర్సిటీకి ఆదాయం లభించడంతోపాటు పీహెచ్‌డీలు అందించేందుకు అవకాశం ఏర్పడుతుంది.

తొలిసారి పెర్‌ఫార్మెన్స్‌ అప్రైజల్‌ ఫామ్‌..

అంతర్జాతీయంగా పేరుగాంచిన వర్సిటీల్లో పెర్‌ఫార్మెన్స్‌ అప్రైజల్‌ ఫామ్‌తో ఫ్యాకల్టీ ప్రతిభ, పరిశోధనలు, ఇతర అంశాలను అసెస్‌ చేస్తుంటారు. తొలిసారి ఈ విధానాన్ని వర్సిటీలో ఈ ఏడాది నుంచి ప్రవేశపెడుతున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు వివిధ అంశాలతో కూడిన ఫామ్‌ను ఫ్యాకల్టీకి అందిస్తాం. ఇయర్‌ ఎండింగ్‌లో వాటిని తీసుకుంటాం. వీటిని చూడగానే సదరు ఫ్యాకల్టీకి సంబంధించిన పరిశోధన ప్రాజెక్టులు, ఇతర అంశాలపై అంచనాకు రావచ్చు. వీటిని హై లెవెల్‌లో పరిశీలించే సిస్టమ్‌ను ఏర్పాటుచేస్తున్నాం. దీనివల్ల బోధనతోపాటు పరిశోధనలోనూ నాణ్యత పెరుగుతుంది. ఇది ఎడ్యుకేషన్‌లో క్వాలిటీని పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులో సదరు ఫ్యాకల్టీ నమోదుచేసే పరిశోధనకు సంబంధించిన అంశాలను గూగుల్‌ స్కాలర్‌ సైటేషన్‌ ఇండెక్స్‌, ఐ10 ఇండెక్స్‌, హెచ్‌ ఇండెక్స్‌లో ఆటోమేటిక్‌గా తెలుసుకునే వెసులుబాటు ఉంది. రీసెర్చ్‌, పబ్లికేషన్స్‌, ఫ్యాకల్టీ, అడ్మినిస్ర్టేషన్‌, ప్రాజెక్ట్‌, టీచింగ్‌పై ప్రధానంగా దృష్టిసారించి ముందుకువెళుతున్నాం.

ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు

ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త కోర్సులు ప్రారంభించబోతున్నాం. 500 సీట్లతో బీఈడీ ప్రారంభిస్తాం. ఇంకా ఎంబీఏలో హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌, బీకాం కంప్యూటర్‌ సైన్స్‌, బీబీఏ, ఎమ్మెస్సీ జియో ఇన్ఫర్మేటిక్స్‌ కోర్సులు ప్రారంభిస్తున్నాం. రానున్న రోజుల్లో అవసరాలకు అనుగుణంగా కోర్సులు ప్రారంభిస్తాం. వర్సిటీలో సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. వీసీలు వస్తుంటారు..వెళుతుంటారు. కానీ, వర్సిటీకి పేరుతెచ్చే విధానానికి మాత్రం అంతా బద్ధులై వ్యవహరించాలి. అప్పుడు వర్సిటీకి జాతీయస్థాయిలో పేరు వస్తుంది. విదేశీ విద్యార్థుల సంఖ్యను పెంచుకోవడంపై కూడా దృష్టిసారిస్తున్నాం.

వందేళ్ల వేడుకలు అదుర్స్‌ అనేలా నిర్వహణ

ఆంధ్ర యూనివర్సిటీ వచ్చే ఏడాది ఏప్రిల్‌ 26వ తేదీ వందో వసంతంలోకి అడుగుపెడుతోంది. 2026 ఏప్రిల్‌ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుంటుంది. ఏడాదిపాటు వందేళ్ల వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం, ఏయూ పూర్వ విద్యార్థుల అసోసియేషన్‌ సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. జాతీయ, అంతర్జాతీయ సెమినార్లు, కాన్ఫరెన్స్‌లు, కల్చరల్‌ ఈవెంట్స్‌ వంటివి నిర్వహిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆధ్వర్యంలో వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీని ఆహ్వానించే ప్రణాళికలు ఉన్నాయి.

వీసీకి, ప్రిన్సిపాల్‌కు మధ్య ఉన్న బంధమే..

మాజీ వీసీ ప్రసాదరెడ్డికి, నాకు ఉన్న బంధం...ఒక ప్రిన్సిపాల్‌కు, వీసీ మధ్య ఉన్న బంధమే. అంతకుమించి అనుబంధం ఏమీ లేదు. నేను రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తిని. యూనివర్సిటీ పాలనలోకి రాజకీయాలను రానివ్వను. నన్ను నమ్మి ప్రభుత్వం ఈ బాధ్యతలను అప్పగించింది. ఇందుకు గవర్నర్‌ నజీర్‌, సీఎం చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌కు కృతజ్ఞతలు. ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడం, యూనివర్సిటీని జాతీయ స్థాయిలో ముందంజలో నిలపడమే నా లక్ష్యం. గత వీసీ హయాంలో నిధులు దుర్వినియోగం, ఇతర అంశాలు నా దృష్టికి ఏమీ రాలేదు. కొన్నిచోట్ల అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వచ్చాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకువెళతాం. విచారణకు ఆదేశిస్తే ఆ మేరకు వర్సిటీ నుంచి అవసరమైన సమాచారాన్ని అందిస్తాం. వీసీ పేషీతోపాటు కొన్ని సెక్షన్లలో పనిచేసే సిబ్బందిని మార్చాం. మిగిలిన వారిని కూడా మారుస్తాం. డీన్లు, ప్రిన్సిపాల్స్‌ను మార్చబోతున్నాం.

యూజీసీ నిబంధనలు మేరకే నియామకాలు..

గౌరవ ప్రొఫెసర్లకు వేతనాలు చెల్లించరు. వారు కొన్ని డిపార్టుమెంట్స్‌లో మాత్రమే ఉన్నారు. యూనివర్సిటీ నుంచి రూపాయి కూడా చెల్లించే పరిస్థితి లేదు. యూజీసీ గైడ్‌లైన్స్‌ ప్రకారం ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీసెస్‌, అడ్జెంక్ట్‌ ప్రొఫెసర్లు వర్సిటీలోని మొత్తం ప్రొఫెసర్లలో పది శాతం మంది ఉండాలి. ఈ మేరకు యూజీసీ నిబందనలు ఉన్నాయి. ప్రొఫెసర్‌ ఆఫ్‌ ప్రాక్టీస్‌ అంతా పరిశ్రమల నుంచి వచ్చిన వాళ్లే ఉండాలి. ఈ రెండు కేటగిరీలకు చెందిన వారికి రూ.80 వేలు మాత్రమే చెల్లిస్తాం. ఈ మేరకు యూజీసీ నిబంధనలు చెబుతున్నాయి. ఎన్‌ఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లో వీటికి సంబంధించి కొన్ని పాయింట్లు కూడా పెట్టింది. కాబట్టి, వారిని తప్పనిసరిగా నియమించుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అనేక విభాగాల్లో ప్రొఫెసర్ల కొరత ఉంది. దాంతో బోధనపై ప్రభావం పడకుండా గౌరవ ప్రొఫెసర్‌లతోపాటు గెస్ట్‌ ఫ్యాకల్టీ సహాయంతో విభాగాలను నిర్వహిస్తున్నాం. కొంతమంది గెస్ట్‌ ఫ్యాకల్టీని గతంలో తొలగించారు. వారిపై నిర్ణయం తీసుకుంటాం. అవసరమున్న విభాగాల్లో ఈ ఏడాదే తీసుకుంటాం. వచ్చే ఏడాది కొన్ని కోర్సులు ప్రారంభిస్తే...మిగిలిన వారిని తీసుకుంటాం. గెస్ట్‌ ఫ్యాకల్టీని తీసుకున్నప్పుడు కమిటీ వేసి..పారదర్శకంగా వ్యవహరిస్తాం. ఎయిడెడ్‌ కాలేజీల నుంచి వచ్చిన వారిపై ప్రస్తుతానికి ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేను. వారికి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తోంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతాం. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటాం. ఎయిడెడ్‌ ఫ్యాకల్టీలో కొందరికి హెచ్‌వోడీలుగా, డీన్లుగా అవకాశాలు ఇచ్చారు. అటువంటి వారిని తొలగించాం.

విద్యార్థుల ఇబ్బందులపై..

విద్యార్థులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందిస్తున్నాం. హాస్టళ్లలో మెనూ అమలు చేస్తున్నారా?, లేదా..? అన్న దానిపై విద్యార్థులు ఫిర్యాదు చేయవచ్చు. క్వాలిటీ ఎలా ఉంటుందో పరిశీలించేందుకు రెండుసార్లు భోజనం చేశాను.

మూడు వేల ఎకో ఫ్రెండ్లీ మొక్కలు నాటే కార్యక్రమం..

విద్యార్థులు వర్సిటీలో క్రమశిక్షణతో మెలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి, మత్తుమందులకు దూరంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. వర్సిటీలో 3000 ఎకో ఫ్రెండ్లీ మొక్కలను నాటబోతున్నాం. క్యాంపస్‌ మొత్తం గ్రీన్‌ బెల్ట్‌ అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం పోర్టు కొన్ని మొక్కలను అందించింది. మేము కొన్ని కొనుగోలు చేశాం. కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌, పోలీస్‌ కమిషనర్‌, అటవీ శాఖ అధికారులు అనుమతి, సహకారంతో క్యాంపస్‌లో నాటబోతున్నాం.

Updated Date - Jul 26 , 2024 | 12:47 AM