అధ్వాన దారులు అందంగా..
ABN , Publish Date - Nov 17 , 2024 | 12:47 AM
Bad roads are beautiful..
- ఆర్ అండ్ బీ పరిధిలో 346 కిలో మీటర్ల మేర రహదారులపై గోతులు
- పనులకు రూ.5.29 కోట్లు మంజూరు చేసిన కూటమి ప్రభుత్వం
- సంక్రాంతి నాటికి పూర్తి కావాలని ఆదేశం
- అధికారుల పర్యవేక్షణలో పనులు వేగవంతం
- గత వైసీపీ పాలనలో నరకం చూసిన వాహనచోదకులకు ఊరట
(అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)
జిల్లాలోని అధ్వాన రోడ్లకు మహర్దశ పట్టనుంది. గత వైసీపీ పాలనలో రహదారుల నిర్వహణను గాలికి వదిలేయడంతో ఎక్కడికక్కడ పెద్ద గోతులతో దర్శనమిచ్చేవి. వాహన చోదకులు నిత్యం నరకం చూసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారుల అభివృద్ధిపై దృష్టి పెట్టడంతో రోడ్లు అద్దంలా మెరిసిపోతున్నాయి.
జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా నిర్వహణ పనులకు కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఆర్ అండ్ బీ పరిధిలోని 346 కిలో మీటర్ల రోడ్లపై పడిన గుంతలు పూడ్చేందుకు 68 ప్యాచ్ వర్కులను అధికారులు గుర్తించారు. ఈ పనులకు ప్రభుత్వం రూ.5.29 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ఈ-పొక్యూర్‌మెంట్ టెండర్లు పిలవగా కేవలం నర్సీపట్నం, సబ్బవరం మండలాల్లో సుమారు రూ.19 లక్షలు విలువ చేసే రెండు వేర్వేరు రోడ్డు పనులకు మాత్రమే టెండర్లు దాఖలు కాలేదు. మిగిలిన 66 రోడ్డు పనులకు ఆర్ అండ్ బీ ఇంజనీర్లు టెండర్లు ఖరారు చేశారు. ఇప్పటికే టెండర్లు ద్వారా పనులు పొందిన కాంట్రాక్టర్లు 22 రోడ్డు పనులను ప్రారంభించారు. సీఎం చంద్రబాబు పరవాడలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన రోడ్డు పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన రోడ్డు ప్యాచ్ పనులు ప్రారంభించనున్నారు. సంక్రాంతి నాటికి గుంతలు లేని రోడ్లు ఉండాలని సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ విజయకృష్ణన్ జిల్లాలో గుంతలు లేని రోడ్ల నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ ఇంజనీర్లకు సమీక్షల ద్వారా దిశా నిర్దేశం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో ఆర్ అండ్ బీ రోడ్ల నిర్వహణకు ఒక్క పైసా విదల్చకుండా ఇతరత్రా పనులకు ఆర్ అండ్ బీ నిధులను దారి మళ్లించింది. దీంతో జిల్లాలో 11 వందల కిలో మీటర్ల ఆర్ అండ్ బీ రోడ్లలో దాదాపు సగానికి పైగా రోడ్లు ధ్వంసమయ్యాయి. ఆయా రోడ్లపై ఏర్పడిన పెద్ద, చిన్న గుంతలను పూడ్చడం ద్వారా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చేసే ఉద్దేశంతో జిల్లాలో రోడ్లకు మరమ్మతు పనులు వేగవంతం చేస్తున్నారు.
నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి
సంక్రాంతి పండుగ నాటికి మంజూరైన అన్ని రోడ్డు ప్యాచ్ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నామని ఆర్ అండ్ బీ జిల్లా అధికారి రమేశ్ తెలిపారు. ఇప్పటికే టెండర్లు ఖరారు చేసి, గడువులోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించామన్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. నర్సీపట్నం, సబ్బవరంలో రెండు వేర్వేరు రోడ్డు పనులకు టెండర్లు దాఖలు కాలేదని, ఆ రోడ్డు పనులను పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.