సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం
ABN , Publish Date - Dec 06 , 2024 | 01:26 AM
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ తెలిపారు.
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు
విక్రయించినా, వినియోగించినా జరిమానా
‘ప్లాస్టిక్ రహిత విశాఖ’ కోసం బీచ్‌రోడ్డులో ప్రతిజ్ఞ రేపు
జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్
విశాఖపట్నం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధిస్తున్నట్టు జీవీఎంసీ కమిషనర్ పి.సంపత్‌కుమార్ తెలిపారు. నగరంలో ప్రతిరోజూ 300 టన్నుల వరకూ ప్లాసిక్ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయన్నారు. వాటిని శాస్త్రీయంగా పునర్వినియోగించుకునే అవకాశం లేకపోవడం సమస్యగా మారుతోందన్నారు. ప్లాసిక్ వ్యర్థాలు భూమిలో కలవడానికి కనీసం 500 సంవత్సరాలు పడుతుందని, వర్షాలు పడితే నీటితో కలిసి గెడ్డలు, కాలువల ద్వారా సముద్రంలో చేరుతున్నాయన్నారు. దీనివల్ల పర్యావరణం, సముద్ర జలాలు కలుషితమవుతున్నందున సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలని నిర్ణయించామన్నారు. వచ్చే నెల ఒకటి నుంచి 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్‌ను నగరంలో విక్రయించడం, వినియోగించడం నిషేధమని, ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలతోపాటు ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఈలోగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఈనెల ఏడో తేదీ ఉదయం 6.30 గంటలకు బీచ్‌రోడ్డులో ‘ప్లాస్టిక్ రహిత విశాఖ’ పేరుతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించబోమని ప్రతిజ్ఞ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛ విశాఖ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ముఖ్య అతిథిగా హాజరవుతారన్నారు. గతంలో పలుమార్లు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం విధించినప్పటికీ అనివార్య కారణాల వల్ల పూర్తిస్థాయిలో సాధ్యపడలేదన్నారు. కానీ ఇప్పుడు మాత్రం శతశాతం నిషేధాన్ని అమలు చేస్తామన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువుల ఉత్పత్తిని పెంచేందుకు వ్యాపారులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయ వస్తువుల మార్కెట్‌కు కూడా అవకాశాలు కల్పిస్తామన్నారు. గతంలో వీటి ధరలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కంటే చాలా ఎక్కువ ఉండడంతో కొనుగోలుదారులు వాటి జోలికి వెళ్లేవారు కాదన్నారు. కానీ ఇప్పుడు వాటి ఉత్పత్తి భారీగా పెరగడంతో ధరలు కూడా గణనీయంగా తగ్గి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు దాదాపు సమానంగా ఉంటాయన్నారు. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను అందరూ విడనాడాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.