Share News

సీలేరులో నిలిచిన భద్రాచలం బస్సు

ABN , Publish Date - Nov 30 , 2024 | 10:50 PM

విశాఖపట్నం-భద్రాచలం నైట్‌ సర్వీస్‌ బస్సు శనివారం సీలేరులో నిలిచిపోయింది.

సీలేరులో నిలిచిన భద్రాచలం బస్సు
సీలేరులో నిలిచిపోయిన విశాఖపట్నం-భద్రాచలం బస్సు

విరిగిన ఫ్రంట్‌ వీల్‌ బ్రేక్‌ పైపు

ప్రయాణికులను వేరే బస్సులో భద్రాచలం తరలింపు

సీలేరు నుంచి విశాఖకు బస్సు లేక ప్రయాణికుల ఇక్కట్లు

సీలేరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం-భద్రాచలం నైట్‌ సర్వీస్‌ బస్సు శనివారం సీలేరులో నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు విశాఖపట్నంలో బయలుదేరిన నైట్‌ సర్వీస్‌ బస్సు సీలేరుకు 5 కిలోమీటర్ల సమీపంలో ఫ్రంట్‌ వీల్‌ బ్రేక్‌ పైప్‌ కట్‌ అయి బ్రేక్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో డ్రైవర్‌ బస్సును ఆపి పరిశీలించగా.. బ్రేక్‌పైప్‌ విరిగిపోయినట్టు గుర్తించాడు. బస్సును నెమ్మదిగా గేర్‌లో సీలేరు వరకు తీసుకు వచ్చి పీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. బస్సులో డొంకరాయి, మోతుగూడెం, భద్రాచలం వెళ్లే ప్రయాణికులు 15 మందికి పైగా ఉండడంతో సీలేరులో ఉన్న విశాఖపట్నం-సీలేరు నైట్‌ హాల్టు బస్సులో వారిని తరలించారు. దీంతో శనివారం ఉదయం ఆరు గంటలకు సీలేరు నుంచి విశాఖపట్నం వెళ్లే బస్సు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం ఆరు గంటలకు వెళ్లాల్సిన ప్రయాణికులు 10 గంటలకు భద్రాచలం నుంచి వచ్చిన విశాఖపట్నం బస్సుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా పీటీడీ అధికారులు స్పందించి సీలేరు, భద్రాచలం వంటి దూరప్రాంతాలకు కండీషన్‌లో ఉండే బస్సులను నడపాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు.

డొక్కు బస్సులనే నడుపుతున్న పీటీడీ అధికారులు

సీలేరు, భద్రాచలం వంటి సుదూర ప్రాంతాలకు కాలం చెల్లిన డొక్కు బస్సులనే పీటీడీ అధికారులు నడుపుతున్నారు. ఈ ప్రాంత ప్రయాణికులు పీటీడీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా ఇలానే నడుపుతున్నారని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. నిత్యం విశాఖపట్నం డిపో నుంచి భద్రాచలం, సీలేరు బస్సులు నడుపుతున్నారు. అవి ఎక్కడ పడితే అక్కడ సాంకేతిక లోపాలు తలెత్తి ఆగిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక్కొక సమయంలో కారడివిలో అన్నపానీయాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా పీటీడీ అధికారులు మాత్రం కాలం చెల్లిన డొక్కు బస్సులనే నడుపుతున్నారు. భద్రాచలం, సీలేరులకు కొత్త బస్సులను నడపాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Nov 30 , 2024 | 10:50 PM