ఐటీ అభివృద్ధికి ఊతం
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:41 AM
విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి.
విశాఖలో ఎస్‌టీపీఐ ఇంక్యుబేషన్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం
ఏయూలో స్థలం కేటాయింపు
రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు
తొక్కిపెట్టిన నాటి వైసీపీ ప్రభుత్వం
ప్రస్తుత ఐటీ మంత్రి లోకేశ్ చొరవతో ఫైల్‌కు మోక్షం
ఎగుమతులు పెంపునకు కృషిచేయనున్న సెంటర్
విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో ఐటీ రంగం అభివృద్ధికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత విశాఖను ఐటీ హబ్‌గా మార్చడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ చొరవతో ఆరు నెలల వ్యవధిలో రెండు అతి పెద్ద కంపెనీలు విశాఖపట్నం రావడానికి ఒప్పందాలు చేసుకున్నాయి. అందులో ఒకటి టీసీఎస్ కాగా మరొకటి గూగుల్. ఐటీ పార్కులోని డల్లాస్ టెక్నాలజీస్ భవనంలో కార్యకలాపాలు ప్రారంభించాలని టీసీఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా బుధవారం మరో విశేషం చోటుచేసుకుంది.
కేంద్ర ప్రభుత్వ సంస్థ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ)ఇంకుబేషన్ సెంటర్ నిర్మాణానికి ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ‘ఆ హబ్’ పక్కన ఎకరా స్థలంలో భూమి పూజ నిర్వహించింది. ఇక్కడ సుమారు రూ.30 కోట్ల వ్యయంతో ఐదు అంతస్థుల భవనం నిర్మిస్తారు. ఈ సెంటర్ విశాఖపట్నం నుంచి ఐటీ ఎగుమతులు పెంచడానికి కృషిచేస్తుంది. అదేవిధంగా చిన్న పరిశ్రమలను ప్రోత్సహిస్తుంది. సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలో విద్యార్థులకు శిక్షణ కూడా ఇస్తుంది. ఏయూ విద్యార్థులకు ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం జరిగింది.
రెండేళ్ల క్రితమే ప్రతిపాదనలు..తొక్కిపెట్టిన వైసీపీ పెద్దలు
ఎస్‌టీపీఐకి రాష్ట్రంలో విజయవాడ, కాకినాడ, తిరుపతి నగరాల్లో ఇంకుబేషన్ సెంటర్లు ఉన్నాయి. అత్యంత కీలకమైన విశాఖపట్నంలోనే సెంటర్ లేదు. గతంలో వీఎంఆర్‌డీఏతో రూ.40 కోట్లకు ఒప్పందం చేసుకున్నారు. నిర్మాణ పనుల పర్యవేక్షణ విషయంలో విభేదాలు రావడంతో అది ఆగిపోయింది. విశాఖ ఎస్‌టీపీఐ జాయింట్ డైరెక్టర్ ఎలాగైనా విశాఖలో ఇంకుబేషన్ సెంటర్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని నిర్ణయించి ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులను సంప్రతించారు. ఏయూలో ఎకరా స్థలం కేటాయిస్తే.. అందులో 100 సీట్ల సామర్థ్యంతో ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రతిపాదనలు ఇచ్చారు. అంతేకాకుండా దువ్వాడలోని ఎస్‌టీపీఐ ప్రధాన కార్యాలయాన్ని కూడా ఇక్కడికే తీసుకువచ్చేస్తామని చెప్పారు. ఇది విశాఖలో ఐటీ అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఏయూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి 2022 జూన్‌లో నివేదిక పంపారు. దీనిపై విద్యా శాఖ నిర్ణయం తీసుకోవలసి ఉందని చెప్పి ఫైల్ పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రిగా లోకేశ్ ఉండడం, విశాఖలో ఐటీ ప్రతినిధులు ఎస్‌టీపీఐ భూమి విషయం ఆయన దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ఫైల్ క్లియర్ చేశారు. ఎస్‌టీపీఐ కోరిన ఎకరా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దాంతో ఎస్‌టీపీఐ డైరెక్టర్ జనరల్ అరవింద్‌కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. వీలైనంత త్వరగా సెంటర్ నిర్మాణం పూర్తిచేయాలని ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ధనుంజయరావును కోరగా...తప్పకుండా చేస్తామని అరవింద్‌కుమార్ హామీ ఇచ్చారు.