మండిన నగరం
ABN , Publish Date - Jun 21 , 2024 | 12:53 AM
పడమర గాలులతో గురువారం నగరం వేడెక్కింది. ఉదయం నుంచే మాడుపగిలే ఎండతో మండిపోయింది.
ఉదయం నుంచే వేడి వాతావరణం
ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఎయిర్‌పోర్టులో 39.4 డిగ్రీలు నమోదు
విశాఖపట్నం, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):
పడమర గాలులతో గురువారం నగరం వేడెక్కింది. ఉదయం నుంచే మాడుపగిలే ఎండతో మండిపోయింది. దీనికితోడు ఉక్కపోత ఎక్కువ కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం ఎనిమిది గంటలకే ఎండ చుర్రుమనిపించింది. పది గంటల తరువాత వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటల వరకు ఎండ తీవ్రతకు నగరం ఉడికిపోయింది. ప్రజలు బయటకు రావడానికి వెనుకంజ వేశారు. మండు వేసవిలో మాదిరి వేడిగాలులు కొనసాగడంతో రాత్రి పది గంటలైనా వేడి తగ్గలేదు.
గడచిన కొద్దిరోజులుగా నగరం, పరిసరాల్లో ఎండలు, వేడిగాలులు కొనసాగుతున్నాయి. రుతుపవనాలు వచ్చి పదిరోజులైనా చల్లని గాలులు జాడలేదు. పడమర గాలులు కొనసాగడంతో సముద్ర తీర ప్రాంతంలో కూడా వేడి వాతావరణం నెలకొంటోంది. గురువారం ఎయిర్‌పోర్టులో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే ఐదు డిగ్రీలు ఎక్కువ. గరిష్ఠ ఉష్ణోగ్రతలే కాకుండా కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి. పగలే కాకుండా రాత్రిపూట వాతావరణం కూడా వేడిగా ఉంటుంది. రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం ప్రజల ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రాత్రింబవళ్లు ఏసీలు వినియోగం, నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం, కాలుష్యం పెరుగుదల వల్ల జూన్‌లో వర్షాలు బదులు ఎండలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రస్తుతం వాతావరణ అనిశ్చితితో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి తప్ప రుతుపవనాల ప్రభావంతో కాదని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడి వర్షాలు పెరిగేంత వరకు ఎండలు కొనసాగుతాయన్నారు. ఈలోగా ఏమైనా రుతుపవనాలు బలపడితే వాతావరణం చల్లబడుతుందని వివరించారు..