గంగవరం పోర్టులో సమ్మె విరమణ
ABN , Publish Date - May 18 , 2024 | 12:57 AM
అదానీ గంగవరం పోర్టులో 34 రోజులుగా జరుగుతున్న సమ్మె గురువారం అర్ధరాత్రితో ముగిసింది.
నిర్వాసిత కార్మికులతో యాజమాన్యం ‘సెటిల్‌మెంట్’
ఉద్యోగం వదిలేస్తే రూ.27 లక్షలు
400 మంది అంగీకారం...వంద మంది ప్రతికూలం
రెగ్యులర్ ఉద్యోగులకు వేతనాల పెంపు
కుటుంబానికి వైద్య సదుపాయం
పోలీస్ కమిషనరేట్‌లో చర్చలు
అదానీ ప్రతినిధుల హాజరు
అధికారికంగా ఒప్పంద వివరాలు
వెల్లడించని యంత్రాంగం
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):
అదానీ గంగవరం పోర్టులో 34 రోజులుగా జరుగుతున్న సమ్మె గురువారం అర్ధరాత్రితో ముగిసింది. నిర్వాసిత కార్మికులతో పోలీస్ కమిషనరేట్‌లో జిల్లా అధికారులు, అదానీ పోర్టు యాజమాన్య ప్రతినిధులు చర్చలు జరిపారు. గతంలో నిర్వాసిత కార్మికులు సమ్మె విరమించడానికి, ఉద్యోగాలు వదిలేసి వెళ్లిపోవడానికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు చొప్పున డిమాండ్ చేశారు. నాటి చర్చల్లో రూ.25 లక్షలు చొప్పున ఇప్పిస్తామని పోలీస్ కమిషనర్ హామీ ఇచ్చారు. తాజాగా గురువారం జరిగిన ఒప్పందంలో ఉద్యోగం వదిలేసి వెళ్లిపోతే సింగిల్ సెటిల్‌మెంట్ కింద ఒక్కొక్కరికి రూ.27 లక్షలు ఇవ్వడానికి ఇరు వర్గాల మధ్య ఒప్పందం జరిగింది. పోర్టులో నిర్వాసిత కార్మికులు మొత్తం 514 మంది ఉన్నారు. ఈ ఒప్పందానికి వారిలో 400 మంది ఒప్పుకున్నారు. మిగిలినవారు తాము ఉద్యోగాలు చేసుకుంటామని, సెటిల్‌మెంట్ అవసరం లేదని చెప్పారు. అయితే దానికి పోర్టు యాజమాన్య ప్రతినిధులు ఒప్పుకోలేదు. ఇదిలావుండగా ఇస్తామని చెప్పిన మొత్తం 45 రోజుల్లో అందిస్తామని పోర్టు ప్రతినిధులు చెప్పగా, తమకు నెల రోజులుగా జీతాలు లేవని, తక్షణమే కొంత ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేయగా రెండు, మూడు రోజుల్లో మనిషికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు. దాంతో కార్మికులు సమ్మె విరమించారు. పోర్టు నుంచి శుక్రవారం తెల్లవారుజామున కోకింగ్ కోల్, లైమ్ స్టోన్ సరఫరా ప్రారంభించారు. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించిన కార్మికులు శుక్రవారం విధుల్లోకి వెళ్లగా...వారిని లోపలకు రానివ్వలేదని తెలిసింది. వారితోను చర్చలు జరుపుతున్నారు.
వారి కుటుంబానికి వైద్య సదుపాయం
పోర్టులో నిర్వాసిత కార్మికులు కాకుండా రెగ్యులర్ కార్మికులు వెయ్యి మందికి పైగా ఉన్నారు. వారు కూడా వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు సహకరించారు. పోలీస్ కమిషనరేట్‌లో వారితోనూ వేరే గదిలో చర్చలు జరిపారు. త్వరలో వేతనాలు కొద్దిగా పెంచడానికి, వారి కుటుంబాలకు వైద్య సదుపాయం కల్పించడానికి యాజమాన్యం అంగీకరించినట్టు సమాచారం. దాంతో వారంతా శుక్రవారం విధులకు హాజరయ్యారు.
వివరాలు వెల్లడించని యంత్రాంగం
అదానీ గంగవరం పోర్టులో ఎప్పుడు చర్చలు జరిగినా వాటి వివరాలు బయట పెట్టే సంప్రదాయం లేదు. వాటిని అమలు చేయాల్సిందిగా కార్మికులు ఒత్తిడి తెస్తారని ఇంతవరకూ ఎప్పుడూ అలా చేయలేదు. తాజాగా జరిగిన చర్చల్లోను అదే విధానం అనుసరించారు. ప్రభుత్వ కార్యాలయంలో అధికారుల సమక్షంలో చర్చలు జరిగినా వాటిని పత్రికలకు విడుదల చేయలేదు. ఇటు అధికారులు ముందుకురాలేదు. అటు పోర్టు యాజమాన్యం చొరవ తీసుకోలేదు. దీంతో ఈ ఒప్పందాన్ని అదానీ యాజమాన్యం పూర్తిగా అమలు చేస్తుందా?, లేదా?...అనే అనుమానాలు ఉన్నాయి. చర్చల్లో పాల్గొన్న కార్మిక సంఘ నాయకులు కూడా పొడిపొడిగా చర్చలు వివరాలు వెల్లడించారే తప్ప అన్నీ చెప్పలేదు. వారైనా విలేకరుల సమావేశం నిర్వహించి, చర్చల సారాంశం చెప్పి ఉంటే బాగుండేది.
ఉక్కుకు ఊరట
విధుల్లోకి గంగవరం పోర్టు కార్మికులు
స్టీల్‌ప్లాంటుకు కన్వెయర్ బెల్ట్ ద్వారా కోకింగ్ కోల్, లైమ్ స్టోన్ సరఫరా
అన్ని వర్గాల్లో సంతోషం
విశాఖపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నం స్టీల్‌ప్లాంటుకు ఎట్టకేలకు ముడి పదార్థాల కొరత తీరింది. అదానీ గంగవరం పోర్టులో కార్మికుల సమ్మె వల్ల నెల రోజుల నుంచి ఉక్కు కర్మాగారానికి కోకింగ్ కోల్, లైమ్ స్టోన్ సరఫరా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్లాంటులో ఏ ప్రక్రియ ముందుకు సాగాలన్నా కోకింగ్ కోల్ చాలా అవసరం. కోక్ ఓవెన్ బ్యాటరీల నిర్వహణకు, విద్యుత్ ఉత్పత్తికి, వృథా వాయువులు అందించే అనేక విభాగాలకు కోకింగ్ కోల్ అవసరం. అయితే కోకింగ్ కోల్ సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో ఉక్కు ఉత్పత్తి 80 శాతానికిపైగా పడిపోయింది. రోజుకు 20 వేల టన్నులు ఉత్పత్తి చేయాల్సి ఉండగా మూడు, నాలుగు వేల టన్నులకు పరిమితమైంది. మరోవైపు అతి తక్కువ బొగ్గుతో కోక్ ఓవెన్ల నిర్వహణ కష్టం కావడంతో వాటిలో కొన్నింటిని తగ్గించి, తక్కువ స్థాయిలో నడపాల్సి వచ్చింది. బ్లాస్ట్ ఫర్నేస్‌లు రెండింటిలో ఒకదాని నుంచి ఉత్పత్తి తీశారు. ఈ ఇబ్బందుల వల్ల యాజమాన్యం, అధికారులు, కార్మికులు చాలా ఒత్తిడికి గురయ్యారు. సుమారు రూ.600 కోట్ల విలువైన సరకు పోర్టులో ఉండిపోయింది. మరోవైపుసరైన ఉత్పత్తి లేక మూడు వేల కోట్ల రూపాయల వరకు నష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. స్టీల్ అధికారుల సంఘం చొరవ తీసుకొని హైకోర్టును ఆశ్రయించడంతో కొంత ఊరట లభించింది. జాతీయ సంపద అయిన విశాఖ ఉక్కును సంరక్షించుకోవాలని, ఇబ్బంది పెట్టకూడదని, అంతా సహకరించాలని న్యాయస్థానం సూచించడంతో పోర్టు యాజమాన్యం దిగి వచ్చి చర్చలు ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కన్వేయర్ బెల్ట్ ద్వారా స్టీల్‌ప్లాంటుకు కోకింగ్ కోల్, లైమ్ స్టోన్ సరఫరాను పోర్టు ప్రారంభించింది. ఎట్టకేలకు 34 రోజుల తరువాత బొగ్గు, లైమ్‌స్టోన్ అందడంతో స్టీల్ ప్లాంటు వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఐరన్ ఓర్ కూడా తగినంత సమకూర్చుకొని పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయడానికి యత్నిస్తామని యాజమాన్యం ప్రకటించింది.
ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన సీఎండీ
ఉక్కుటౌన్‌షిప్ : పోర్టు నుంచి బొగ్గు సరఫరా కావడానికి సహకరించినందుకు ఉక్కు మంత్రిత్వ శాఖకు జిల్లా యంత్రాంగానికి, కార్మిక నాయకులకు, పోర్టు కార్మికులకు ఉక్కు కర్మాగారం సీఎండీ అతుల్ భట్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఉక్కు ఉత్పత్తిపై దృష్టిసారిస్తామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.