Share News

అనధికార లేఅవుట్లకు చెక్‌

ABN , Publish Date - Nov 16 , 2024 | 01:11 AM

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనధికార లేఅవుట్లు లెక్కకు మించి వెలుస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో వ్యాపారులు వ్యవసాయ భూములు కొని లేఅవుట్లుగా మారుస్తున్నారు.

అనధికార లేఅవుట్లకు చెక్‌

  • కట్టడి కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌

  • వీఎంఆర్‌డీఏ నిర్ణయం

  • ఒడిశా విధానం అమలు

  • అనుమతులు లేకుండా లేఅవుట్‌ వేస్తే వెంటనే చర్యలు

  • ఒక జేసీబీ, 24 బృందాలు సిద్ధం

  • ఇప్పటికే ఉన్న అనధికార లేఅవుట్ల వివరాలు వెబ్‌సైట్‌లో పెట్టిన అధికారులు

  • వాటిల్లో ప్లాట్లు కొనొద్దని సూచన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి విశాఖ జిల్లాలో అనధికార లేఅవుట్లు లెక్కకు మించి వెలుస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం లాభదాయకంగా ఉండడంతో వ్యాపారులు వ్యవసాయ భూములు కొని లేఅవుట్లుగా మారుస్తున్నారు. వీటిలో అత్యధికం అనుమతులు లేనివి ఉంటున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సంస్థలు ఆదాయం కోల్పోతున్నాయి. వీటిని కట్టడి చేయడానికి విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కొత్తగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఒడిశాలో అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వ పెద్దలకు వీఎంఆర్‌డీఏ ప్రతిపాదించింది. దీనికోసం ఒక జేసీబీ, 24 బృందాలను ఏర్పాటుచేయాల్సి ఉంటుందని భావిస్తోంది.

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ పరిధిలో ఇబ్బడిముబ్బడిగా అనధికార లేఅవుట్లు వస్తున్నాయి. ఇప్పటివరకూ అధికారులు గుర్తించిన అనధికార లేఅవుట్ల సంఖ్య 184. వీఎంఆర్‌డీఏ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా వందల ఎకరాల్లో ప్లాట్లు వేసి అమ్మేసుకుంటున్నారు. వీటిని కొన్నవారు అందులో ఏ నిర్మాణం చేపట్టినా స్థానిక సంస్థలు అనుమతులు ఇవ్వవు. లేఅవుట్‌ ప్లాన్‌ నంబరు లేకుంటే...అభివృద్ధి చార్జీలను జరిమానాతో సహా కట్టాల్సిందే. ఆ భారాన్ని కొనుగోలుదారులపై వేసి లేఅవుట్‌ డెవలపర్లు తప్పుకుంటున్నారు. అనుమతి లేనందునే తాము తక్కువ ధరకు ఇచ్చామని చెబుతున్నారు. వీరికి పంచాయతీల అధికారులు సహకరిస్తున్నారు. వాస్తవానికి అనధికార లేఅవుట్‌ వేయగానే స్థానిక సెక్రటరీ వీఎంఆర్‌డీఏకు సమాచారం ఇవ్వాలి. కానీ అలా చేయడం లేదు. కొనుక్కున్నవారు మోసపోయినప్పుడు వచ్చి ఫిర్యాదు చేస్తే తప్ప తెలియడం లేదు. వీటికి చెక్‌ పెట్టాలని వీఎంఆర్‌డీఏ నిర్ణయించింది. తన వెబ్‌సైట్‌లో అనధికార లేఅవుట్ల వివరాలను ఉంచింది. మండలం, గ్రామం, సర్వే నంబర్లు, లేఅవుట్‌ విస్తీర్ణం అన్నీ పెట్టింది. వాటిలో ప్లాట్లు కొనవద్దని కూడా సూచించింది.

చర్యల కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌

అనుమతులు లేకుండా ఎవరైనా లేఅవుట్‌ వేస్తే గతంలో ఫిర్యాదు వచ్చినప్పుడు రాళ్లు తొలగించడం, మార్గానికి అడ్డంగా తవ్వడం వంటి చర్యలు చేపట్టేవారు. అయితే అవి నామమాత్రంగానే ఉండేవి. ఆ చర్యలకు ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇకపై గుర్తించిన అనధికార లేఅవుట్లపై వెంటనే చర్యలు చేపట్టేందుకు అవసరమైనవన్నీ సమకూర్చుకోవాలని నిర్ణయించారు. ఒక జేసీబీని నిత్యం అందుబాటులోకి ఉంచుకుంటారు. అలాగే 24 బృందాలను ఏర్పాటు చేసుకొని, వారికి ప్రాంతాలను కేటాయిస్తారు. ఆయాచోట్ల అనధికార లేఅవుట్లు వేస్తే వారిదే బాధ్యత. వారే చర్యలు తీసుకోవాలి.

ఎక్కడెక్కడ ఎక్కువంటే?

ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తి, పరవాడ, సబ్బవరం, అనకాపల్లి, చోడవరం, నక్కపల్లి, పాయకరావుపేట, రాంబిల్లి, విజయనగరం, డెంకాడ, బొండపల్లి ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు అధికంగా ఉన్నాయి.

Updated Date - Nov 16 , 2024 | 01:11 AM