సంతానలేమితో సతమతం
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:59 AM
నగరంలోని ఎం.వి.పి.కాలనీకి చెందిన మహిళ (34) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది.
గతంలో ఐదు శాతం మందిలోనే...
ఇప్పుడు 15 శాతానికి పెరిగినట్టు గణాంకాల వెల్లడి
ఇరువురిలో ఎవరైనా లేదా ఇరువురూ కారణం కావొచ్చు
వృత్తిపరమైన ఒత్తిడి, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వంటి వాటితో సమస్య రెట్టింపు
ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులతో కొంత వరకూ సమస్య పరిష్కారం
స్మోకింగ్, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి
పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి
30 ఏళ్లలోపు వివాహాలు చేసుకోవాలి
సంవత్సరాల తరబడి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం మానుకోవాలి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరంలోని ఎం.వి.పి.కాలనీకి చెందిన మహిళ (34) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. సహచర ఉద్యోగితో ఏడేళ్ల కిందట వివాహం జరిగింది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. మొదట్లో రెండేళ్లపాటు పిల్లలను వద్దనుకున్నారు. ఐదేళ్ల నుంచి పిల్లల కోసం యత్నిస్తున్నా ఫలితం దక్కలేదు. దీంతో వైద్యులను సంప్రతించారు. ఇద్దరిలో కొన్నిరకాల ఇబ్బందులు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు మందులు వినియోగించాల్సిందిగా సూచించారు. అప్పటికీ ఫలితం లేకపోతే మరో పద్ధతిలో యత్నించేందుకు సిద్ధం కావాలని సూచించారు.
సీతమ్మధారకు చెందిన యువకుడి (32)కి నాలుగేళ్ల కిందట వివాహం అయింది. ప్రముఖ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. వివాహం జరిగిన ఏళ్లు గడుస్తున్నా పిల్లలు లేకపోవడంతో తల్లిదండ్రుల ఒత్తిడి మేరకు దంపతులు వైద్యుల వద్దకు వెళ్లారు. ఇద్దరికీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అబ్బాయిలో సమస్య ఉన్నట్టు నిర్ధారించారు. స్పెర్మ్ కౌంట్ (వీర్యకణాల సంఖ్య) తక్కువగా ఉండడంతోపాటు నాణ్యత లేదని నిర్ధారించారు. కౌంట్ పెరిగేందుకు ప్రస్తుతం మందులు వాడుతున్నారు.
గడిచిన కొన్నాళ్లుగా సంతాన లేమితో బాధపడుతున్న దంపతుల సంఖ్య పెరిగింది. పదేళ్ల కిందటి వరకు సంతాన లేమితో బాధపడేవారు ఐదు శాతం కంటే తక్కువ ఉండేవారని, ఇప్పుడు 15 శాతానికి పెరిగినట్టు వైద్యులు చెబుతున్నారు. ఇందుకు అనేక అంశాలు కారణమవుతున్నాయంటున్నారు. అవేమిటో తెలుసుకుంటే సమస్యను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ టి.రాధ తెలిపారు.
సంతానలేమి సమస్య అంటే.?
కుటుంబ నియంత్రణ పద్ధతులేవీ పాటించకుండా దంపతులు ఇద్దరూ ఏడాదిపాటు కలిసి ఉంటున్నా సంతానం కలగకపోతే సంతానలేమి సమస్యగా పేర్కొంటారు. ఏడాది దాటితే వైద్యులను సంప్రతించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 15 శాతం మంది జంటలు ఈ తరహా సమస్యతో బాధపడుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి వారంతా వైద్యులను సంప్రతించి సమస్యను తెలుసుకోవడం చాలా కీలకంగా డాక్టర్ రాధ పేర్కొన్నారు. సంతాన లేమి సమస్యకు ఏ ఒక్కరో కారణం కాదన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. పిల్లలు పుట్టకపోవడానికి మహిళలు 30 శాతం, పురుషులు 30 శాతం, మరో 30 శాతం ఇద్దరూ కారణం కావచ్చునని, పది శాతం కారణాలు తెలియవని వైద్యులు చెబుతున్నారు. అయితే, సంతానలేమి సమస్య అనగానే మహిళలను చాలామంది బాధ్యులు చేస్తుంటారని, ఇది తప్పు అని కేజీహెచ్ గైనాకాలజీ విభాగ సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ సంధ్యాదేవి పేర్కొన్నారు.
మహిళల్లో సమస్యలు ఇవే
మహిళల్లో సంతానలేమి సమస్యకు కారణాలుగా వైద్యులు పలు అంశాలను పేర్కొంటున్నారు. ట్యూబల్ బ్లాకేజీ, ఫెలోషియన్ ట్యూబులు పూడుకుపోవడం, హార్మోన్ల అసమతుల్యత కారణంగా అండం విడుదల కాకపోవడం, పూర్తిస్థాయిలో ఎగ్ ఫార్మ్ కాకపోవడం, అండాశయంలో కొన్నిరకాల సమస్యలు వంటివి సంతానలేమి సమస్యకు కారణమవుతున్నాయి.
పురుషుల్లో ఇబ్బందులు..
స్పెర్మ్ కౌంట్ (వీర్య కణాల సంఖ్య) తగ్గడం, నాణ్యత లోపించడం, కణాల కదలిక క్షీణించడం (సాధారణంగా 100 ఎంఎల్ వీర్యంలో 15 మిలియన్ల కణాలు ఉండాలి) వంటి కారణాలుగా చెబుతున్నారు.
ఈ కారణాలతోనే సమస్య..
మహిళలు, పురుషుల్లో ఈ సమస్య రావడానికి జీవన విధానంలో వచ్చిన మార్పులు, అలవాట్లు కారణంగా వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో థైరాయిడ్, హార్మోన్ల అసమతుల్యత, పీసీఓడీ, అధిక బరువు వంటి ఇబ్బందులు అధికం అవుతున్నాయి. ఇవి అండం విడుదల కాకపోవడానికి కారణమవుతున్నాయి. అందుకు శారీరక శ్రమ లేకపోవడం, పోషకాలు లేని ఆహారాన్ని తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, సరైన నిద్ర లేకపోవడం వంటి అంశాలు దోహదం చేస్తున్నాయి. పురుషుల్లో ధూమపానం, మద్యపానం, ఒబెసిటీ, ఆహారపు అలవాట్లు, ఇతర వ్యసనాలు కారణమవు తున్నాయి. ఇద్దరిలోనూ వృత్తిపరమైన టెన్షన్, ఒత్తిడి, ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం వంటి అంశాలు ఈ సమస్యను మరింత రెట్టింపు చేస్తున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు.
పరీక్షలో నిర్ధారణ
సంతానలేమి సమస్యకు అసలు కారణం ఏమిటో నిర్ధారించిన తరువాత వైద్యులు ఏం చేయాలో వివరిస్తారు. ఇందుకోసం పరీక్షలు చేయిస్తారు. దీన్నే ఇవాల్యూయేషన్ ప్రాసెస్‌గా చెబుతారు. పరీక్షల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల పిల్లలు పుట్టడం లేదా? లేక ఎగ్ రిలీజ్‌లో ఉన్న ఇబ్బందులు ఉన్నాయా?...అనేది నిర్ధారిస్తారు. మందుల వల్ల ప్రయోజనం లేనట్టయితే ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్)కు రిఫర్ చేస్తారు. ఇందులో వివిధ రకాల పద్ధతులు ఉంటాయి. సాధారణంగా భార్య, భర్త కలిసినప్పుడు జరిగే ప్రక్రియను సాంకేతిక పద్ధతులను అనుసరించి పిండం ఏర్పడేలా చేసి పిల్లలు పుట్టేలా చేస్తారు.
తగిన జాగ్రత్తలతో చెక్..
కొన్నిరకాల జాగ్రత్తలను తీసుకోవడం వల్ల సంతానలేమి సమస్య ఉత్పన్నం కాకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి లేని జీవన విధానాన్ని కొనసాగించడం, శారీరక శ్రమ చేయడం, బరువును నియంత్రణలో ఉంచుకోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటి దురలవాట్లకు దూరంగా ఉండడం, పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవడం, 30 ఏళ్లలోపు వివాహాలు చేసుకోవడం, కెరియర్, ఇతర అవకాశాలు అంటూ పెళ్లైన తరువాత సంవత్సరాల తరబడి కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం వంటి వాటికి దూరంగా ఉండడం ద్వారా సంతానాన్ని పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగుతున్న కేసులు
సంతానలేమితో బాధపడే వారికి వైద్య సేవలు అందించేందుకు నగరంలో 30 వరకు ఫెర్టిలిటీ సెంటర్లు ఏర్పాటయ్యాయి. ఒక్కో ఆస్పత్రిలో నిత్యం కనీసం పది నుంచి 20 మంది సేవలను పొందుతున్నారు. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. వైద్య రంగంలో ప్రస్తుతం ఇదే అతిపెద్ద వ్యాపారంగా కొనసాగుతోంది.
యువ జంటల్లో కూడా పెరుగుతున్న సమస్య
- డాక్టర్ ఐ.వాణి, గైనకాలజీ వైద్యులు, కేజీహెచ్
గతంతో పోలిస్తే సంతానలేమితో బాధపడుతున్న జంటల సంఖ్య గణనీయంగా పెరిగింది. కేజీహెచ్‌కు దాదాపు 15 నుంచి 20 శాతం ఇటువంటి కేసులు వస్తున్నాయి. ఇరవై ఐదేళ్లలోపు వయసున్న అమ్మాయిల్లో కూడా ఎగ్ రిలీజ్ సమస్య, అబ్బాయిల్లో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వంటివి చూస్తున్నాం. జీవన విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఈ తరహా సమస్యలు పెరుగుతున్నాయి. కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఇటువంటి ఇబ్బందులు నుంచి బయటపడవచ్చు. కొందరు కావాలనే కొన్నాళ్లపాటు పిల్లలను వద్దనుకుంటారు. వృత్తిపరమైన ఒత్తిళ్లు, ఇతర ఇబ్బందులతో తరువాత కావాలనుకున్నా ఫలితం దక్కడం లేదు. కాబట్టి, 30 ఏళ్లలోపు పిల్లలు వద్దు అనుకునే ఆలోచన నుంచి యువ జంటలు రావాలి. పిల్లలు పుట్టిన తరువాత కూడా జీవితంలో ఉన్నత స్థానాలకు వెళ్లినవారు ఎంతోమంది ఉన్నారు. పిల్లలు పుడితే జీవితాల్లో పైకి ఎదగలేమన్న ఆలోచన వద్దు. పిల్లలు పుట్టలేదని మానసిక వేదనకు గురికావాల్సిన అవసరం లేదు. అధునాతన వైద్య పద్ధతులను అనుసరించి పిల్లలను పొందేందుకు అనువైన మార్గాలు ఉన్నాయి.