Share News

పర్యాటక స్థలాలను సందర్శించిన కలెక్టర్‌

ABN , Publish Date - Sep 05 , 2024 | 12:02 AM

పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న చారిత్రక ప్రదేశాలను కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ బుధవారం సందర్శించారు. తొలుత కీటిన్‌పేటలో వున్న పురాతన సెయింట్‌ పీటర్స్‌ చర్చిని దర్శించారు.

పర్యాటక స్థలాలను సందర్శించిన కలెక్టర్‌

భీమునిపట్నం, సెప్టెంబరు 4 : పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉన్న చారిత్రక ప్రదేశాలను కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ బుధవారం సందర్శించారు. తొలుత కీటిన్‌పేటలో వున్న పురాతన సెయింట్‌ పీటర్స్‌ చర్చిని దర్శించారు. చర్చి ప్రాముఖ్యతను పాస్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుమ్మరిపాలెంలో వున్న డచ్‌ సిమెట్రీని, బీచ్‌రోడ్‌లో వున్న ప్లాగ్‌స్టాప్‌ సిమెట్రీని సందర్శించారు. ప్లాగ్‌ స్టాఫ్‌ సిమెట్రీలో 1768 నాటి సమాధి డూమ్‌కు అతికించిన నేమ్‌ ప్లేట్‌ను ఫొటో తీసుకున్నారు. సమాధుల విశిష్టతను పురావస్తు శాఖ టెక్నికల్‌ ఆఫీసర్‌ శ్రీనివాసరావు ఆయనకు వివరించారు. అలాగే తీరంలో వున్న లైట్‌హౌస్‌ను సందర్శించారు. అక్కడి నుంచి మంగమారిపేటలో వున్న తొట్లకొండను, తిమ్మాపురం బావికొండను దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో క్రూయిజ్‌ టూరిజం అభివృద్ధిలో భాగంగా విదేశీ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, కనీస వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పొదలతో నిండిన డచ్‌ సమాధుల్లో ల్యాండ్‌ స్కేపింగ్‌ చేస్తే భాగుంటుందని చెప్పారు. పట్టణంలోని చిన్నబజారులో వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా సందర్శించారు. రోగులతో మాట్లాడి, వైద్య సేవల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రామారావు, జడ్సీ కనకమహాలక్ష్మి, పురావస్తు శాఖాధికారులు, డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు పాల్గొన్నారు.

విద్యార్థులకు పాఠాల బోధన

తగరపువలస : చిట్టివలస బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదో తరగతి విద్యార్థులకు అర్ధగంట పాటు రెసెక్షన్‌ పాఠాన్ని బోధించారు. సీబీఎస్‌సీ అమలవుతున్న పాఠశాలగా మరింత ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం బాలికల ఉన్నత పాఠశాలను కూడా సందర్శించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, సౌకర్యాలు, సరకుల పంపిణీ గురించి బాలింతలు, గరిణులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గర్భిణులకు పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. నెలల చిన్నారికి ఐసీడీఎస్‌ అధికారులతో కలిసి అన్నప్రాసన చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ చంద్రకళ, ఎంఈఓ శివరాణి, ఐసీడీఎస్‌ అధికారి జయదేవి పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:02 AM