కలెక్టర్ విస్తృత పర్యటన
ABN , Publish Date - Nov 13 , 2024 | 11:26 PM
మండలంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా హుకుంపేట మండలం అండిబ పంచాయతీ పీవీటీజీ గ్రామం నక్కగొయ్యిని సందర్శించారు.
హుకుంపేట మండలంలో పలు గ్రామాల సందర్శన
మాష్టారి అవతారమెత్తి విద్యార్థులకు విద్యాబోధన
హుకుంపేట, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): మండలంలో కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ బుధవారం విస్తృతంగా పర్యటించారు. ముందుగా హుకుంపేట మండలం అండిబ పంచాయతీ పీవీటీజీ గ్రామం నక్కగొయ్యిని సందర్శించారు. ఈ సందర్భంగా పీఎం జన్‌మన్ పథకం కింద మంజూరైన గృహాలపై ఆరా తీశారు. ఇంకా పది మందికి గృహాలు అవసరమని గుర్తించారు. పిల్లలకు వివాహాలు జరిగినప్పటికీ జాబ్‌కార్డు విభజన జరగనందున వెంటనే జాబ్ కార్డులు పొందాలని సూచించారు. గృహ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని డీఈఈ రాజబాబును ఆదేశించారు. అండిబ నుంచి ఎగువ మోదపుట్టు గ్రామానికి ఆరు కిలో మీటర్ల రహదారి నిర్మాణానికి గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పలువురు తమకు పింఛన్లు అందడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకు వచ్చారు. అయితే కొంతమంది అధిక విద్యుత్ వినియోగం, భూముల మ్యుటేషన్ కాకపోవడం వంటి సమస్యలున్నందున మంజూరు కాలేదని అధికారులు వివరించారు. కలెక్టర్ స్పందిస్తూ ఆయా ఫిర్యాదులను పూర్తి స్థాయిలో విచారించి తదుపరి చర్యల నిమిత్తం నివేదిక అందజేయాలని ఆదేశించారు. అనంతరం భీమవరం పంచాయతీలో వీడీవీకే కేంద్రానికి చేరుకొని చీపుర్ల తయారీని పరిశీలించి వారి ఆదాయం గురించి ఆరా తీశారు. చీపుర్లకు ఒక బ్రాండ్ పెడితే మంచి ధర లభిస్తుందని, చేసే ప్రతి పనికి అదనపు విలువలు జోడించడం ద్వారా అధిక లబ్ధి పొందవచ్చని, అవసరమైతే మార్కెట్ సదుపాయం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అక్కడి నుంచి గుమ్మడిగుండువ పీవీటీజీ గ్రామం చేరుకోగా, గ్రామస్థులు రహదారి మంజూరుకు విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలో ఇలాంటి గ్రామాలను గుర్తించి నివేదిక అందజేయాలని డీఈఈ ధ్రువకుమార్‌ను ఆదేశించారు.
మాష్టారి అవతారమెత్తిన కలెక్టర్
పెదగరువు గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించి పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని పరీక్షించారు. కాసేపు మాష్టారి అవతారమెత్తిన కలెక్టర్ విద్యార్థులకు లెక్కలు నేర్పించి వారితో లెక్కలు చేయించారు. అనంతరం బూర్జ పంచాయతీ పరిధిలోని డోలీ గ్రామాలైన కొండయ్యపాడు, పటకదౌడ గ్రామాల్లో పర్యటించి గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీడీవో రమాదేవి, ఏఈఈలు ఈశ్వరి, సంజీవరావు, జగదీశ్‌బాబు, తహసీల్దార్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు.