Share News

కమిషనరేట్‌ ప్రక్షాళన?

ABN , Publish Date - Jul 27 , 2024 | 12:46 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ ప్రక్షాళనపై సీపీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు.

కమిషనరేట్‌ ప్రక్షాళన?

  • ఆధారాలతో జాబితా సిద్ధం చేసిన నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి

  • తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై వేటు

  • మరో 25 మందికిపైగా ఎస్‌ఐ, సీఐలను రేంజ్‌కు సరండర్‌ చేసే యోచన

  • రేంజ్‌ నుంచి నగరానికి వచ్చేందుకు 28 మంది సీఐల ఆసక్తి

  • వారి సర్వీసు వివరాలపై ఆరా

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనరేట్‌ ప్రక్షాళనపై సీపీ శంఖబ్రతబాగ్చి దృష్టిసారించారు. ఇప్పటికే అవినీతిపరుల జాబితాను సిద్ధం చేసుకున్న ఆయన...అందులో తీవ్రమైన ఆరోపణలు ఉన్న వారిపై సస్పెన్షన్‌ వేటు వేయాలని, మిగిలిన వారిని రేంజ్‌కు సరండర్‌ చేయాలని నిర్ణయించుకున్నట్టు పోలీస్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉందని సమాచారం.

పోలీస్‌ అధికారులు/సిబ్బంది విశాఖ నగరంలో పోస్టింగ్‌ వచ్చిందంటే వేరొకచోటకు వెళ్లడానికి ఇష్టపడరు. అన్నిరకాల సదుపాయాలు ఉండడంతోపాటు మంచి ఆదాయం లభించడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటీవల సాధారణ ఎన్నికల సమయంలో మూడేళ్లు దాటి ఒకేచోట పనిచేసిన వారిని బదిలీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో నగరంలో ఏళ్ల తరబడి తిష్ఠ వేసినవారంతా తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర జిల్లాలకు వెళ్లాల్సి వచ్చింది. అటువంటి వారంతా ఎన్నికల కోడ్‌ ముగియగానే తిరిగి నగరానికి వచ్చేయాలనుకున్నారు. ఇంతలో సీపీగా శంఖబ్రతబాగ్చిని ప్రభుత్వం నియమించడంతో ఆశావహుల్లో కొందరు కంగుతిన్నారు. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలకు గురికావాల్సి ఉంటుందనే భయంతో వెనకడుగు వేశారు. అందరూ ఊహించినట్టుగానే సీపీగా బాధ్యతలు చేపట్టిన శంఖబ్రతబాగ్చి అవినీతిపరుల పట్ల కొరడా ఝులిపించడం మొదలెట్టారు. ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల సమస్యలతోపాటు పోలీస్‌ శాఖలో అవినీతి, అలసత్వంపై ఫిర్యాదు చేయవచ్చునని ప్రకటించారు. లారీ డ్రైవర్‌ నుంచి డబ్బులు తీసుకున్నట్టు గుర్తుతెలియని వ్యక్తి హెల్ప్‌లైన్‌ నంబర్‌కు వీడియో తీసి పంపించడంతో హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు. పద్మనాభం పోలీస్‌ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌పై కూడా ఇలాంటి ఫిర్యాదులు అందడంతో ఆయన్ను వీఆర్‌కు సరండర్‌ చేశారు. మరికొందరు పోలీసుల అవినీతిపైనా సీపీకి ఆధారాలతో ఫిర్యాదులు అందడంతో వారిపై కూడా చర్యలకు సిద్ధం అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే శాసనసభ సమావేశాలు జరుగుతుండడంతో ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎందుర్కొంటున్న వారి జాబితాలో కానిస్టేబుల్‌ నుంచి సీఐ స్థాయి వరకు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నట్టయితే సస్పెన్షన్‌ వేటు వేయాలని సీపీ నిర్ణయించినట్టు తెలిసింది. ఆ జాబితాలో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఇప్పుడు పోలీస్‌ శాఖలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. అలాగే ఒక మాదిరి ఆరోపణలు ఉన్నవారిని, సమర్థంగా పనిచేయలేకపోతున్న వారిని రేంజ్‌కు సరండర్‌ చేయనున్నట్టు సమాచారం. ఈ జాబితాలో ఎస్‌ఐలు, సీఐలు కలిపి 25 మంది వరకూ తెలిసింది. ఇదిలావుండగా సస్పెన్షన్‌, రేంజ్‌కు సరండర్‌ కారణంగా ఖాళీ అయ్యే పోస్టుల్లో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన ఇతర జిల్లాల్లోని ఎస్‌ఐ, సీఐల నుంచి సీపీ విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. రేంజ్‌ పరిధిలో పనిచేస్తున్న సీఐల్లో 28 మంది నగరానికి వచ్చేందుకు సంసిద్ధత తెలియజేస్తూ సీపీకి ప్రత్యక్షంగా, వాట్సాప్‌లోనూ దరఖాస్తులు అందజేసినట్టు సమాచారం. నగరానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నవారి సర్వీసు వివరాలతోపాటు గతంలో సస్పెన్షన్లు, చార్జిమెమోలు అందుకోవడం, వారి సమర్థతను తెలుసుకుని తనకు నివేదిక అందజేయాలంటూ సీపీ ఇప్పటికే కిందిస్థాయి అధికారులను ఆదేశించారు. సమర్థులు, నిజాయితీగా పనిచేస్తారనే గుర్తింపు కలిగిన వారిని మాత్రమే నగరానికి తీసుకోవాలని సీపీ భావిస్తున్నట్టు సమాచారం. వీరితోపాటు నగరానికి రావడానికి ఆసక్తి చూపని వారిలో సమర్థులుగా గుర్తింపు కలిగిన వారితో సీపీ మరో జాబితా తయారుచేసుకున్నట్టు పోలీస్‌ వర్గాలు చెబుతున్నాయి. శాసనసభ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. కాబట్టి తర్వాత ఏ క్షణంలోనైనా అవినీతిపరులపై సీపీ చర్యలకు దిగే అవకాశం ఉందని పోలీస్‌ కమిషనరేట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Updated Date - Jul 27 , 2024 | 12:46 AM