Share News

రక్త సేకరణకు అవాంతరాలు

ABN , Publish Date - Nov 17 , 2024 | 12:36 AM

రక్త సేకరణ (బీసీటీవీ) రవాణా వాహనాన్ని నిధులు లేమి సమస్య పట్టి పీడిస్తున్నది. దీంతో రక్తదానంపై అవగాహన కల్పించడానికి, రక్త సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రక్త సేకరణకు అవాంతరాలు
నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో రక్త సేకరణ వాహనం

- నిధుల లేమితో తిరగని వాహనం

- రక్తదాన శిబిరాలు అంతంత మాత్రమే

- ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు విడుదలకాక ఇబ్బందులు

నర్సీపట్నం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రక్త సేకరణ (బీసీటీవీ) రవాణా వాహనాన్ని నిధులు లేమి సమస్య పట్టి పీడిస్తున్నది. దీంతో రక్తదానంపై అవగాహన కల్పించడానికి, రక్త సేకరణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రక్త సేకరణ రవాణా వాహనం నిర్వహణకు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిధుల కేటాయింపు జరగకపోవడంతో పెట్రోల్‌ అవసరాలకుఅవస్థలు తప్పడం లేదు. గత టీడీపీ ప్రభుత్వంలో ఉమ్మడి విశాఖ జిల్లాకి రక్త సేకరణ వాహనం మంజూరైంది. ఇందులో ల్యాబ్‌ టెక్నిషియన్‌లు ఇద్దరు, ఒక డ్రైవర్‌ విధులు నిర్వహిస్తారు. అప్పట్లో మంత్రిగా ఉన్న అయ్యన్నపాత్రుడు చొరవ ఫలితంగా నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి రక్త నిధి కేంద్రానికి ఈ వాహనాన్ని అనుసంధానం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎక్కడ రక్తదాన శిబిరం జరిగినా అక్కడకు వాహనం వెళ్లి దాతల నుంచి రక్త సేకరణ చేయాల్సి ఉంటుంది. నెలలో 20 రక్తదాన శిబిరాలు నిర్వహించాలని లక్ష్యం ఉంది. సినియా థియేటర్లు, ప్రధాన కూడళ్లు, ఆర్టీసీ కాంప్లెక్స్‌, కళాశాలలు వద్దకు ఈ వాహనం వెళ్లి రక్తదానంపై అవగాహన కల్పించి దాతలను ప్రోత్సహించాలి. నెలలో 15 రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. వాహనం తిరిగిన కిలోమీటర్లు బట్టి ప్రతీ రోజు పెట్రోల్‌ అవసరం పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ ద్వారా ప్రతీ సంవత్సరం రూ.1.6 లక్షలు వరకు నిధులు కేటాయిస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్వహణకు నిధులు కేటాయింపులు జరగ లేదు. దీంతో వాహనం నిర్వహణకు ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో మే నెలలో ఏపీ శాక్స్‌ రూ.50 వేలు నిధులు విడుదల చేసింది. ఈ నిధులు పెట్రోల్‌ నిర్వహణకు ఖర్చు అయిపోవడంతో ఇప్పుడు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. రక్తదాన శిబిరాలకు దూర ప్రాంతాలకు వెళ్లాలంటే బంకులో పెట్రోల్‌ అరువు పోయించుకుంటున్నారు. బాగా దూర ప్రాంతాలకు వెళ్లాలంటే పెట్రోల్‌ ఖర్చును దృష్టి పెట్టుకొని వాహనం వెళ్లడం లేదు. దీని ప్రభావం రక్తదాన శిబిరాలపై పడుతోంది. రక్తదాన శిబిరాలు తగ్గిపోవడం వల్ల ఏరియా ఆస్పత్రికి సమకూరే యూనిట్లు కూడా తగ్గిపోతున్నాయి. ఉన్నతాధికారులు రక్త సేకరణ వాహనం నిర్వహణకు నిధులు మంజూరు చేయాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:36 AM