రైల్వే జోన్‌పై తాత్సారం
ABN , Publish Date - Dec 24 , 2024 | 01:37 AM
విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు అందని ద్రాక్షలా మారింది.
ప్రధాన కార్యాలయం నిర్మాణానికి డిసెంబరులో శంకుస్థాపన చేయనున్నట్టు పలుమార్లు కేంద్ర మంత్రి, ఎంపీల ప్రకటన
మరో వారంలో ముగియనున్న నెల
ఇప్పటివరకూ అతీగతీ లేదు
కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ
ఇంతకీ వాల్తేరు డివిజన్ ఉన్నట్టా?, లేనట్టా?
నాయకులకూ స్పష్టత కరువు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటు అందని ద్రాక్షలా మారింది. అదిగో...ఇదిగో...అంటూ ఊరింపు మాటలే వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక భూమి సమస్య పరిష్కరించినా కేంద్రం మాత్రం పనుల ప్రారంభానికి ఎందుకనో ఇంకా ఆలోచన చేస్తోంది. విశాఖలో రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి డిసెంబరులో శంకుస్థాపన జరుగుతుందని కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, ఉత్తరాంధ్ర ఎంపీలు గతంలో ప్రకటించారు. ఇంకో వారం రోజుల్లో డిసెంబరు ముగుస్తుంది. కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇప్పటివరకూ శంకుస్థాపన తేదీ మాత్రం ఖరారు కాలేదు.
విశాఖపట్నంలో ‘దక్షిణ కోస్తా’ రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నిర్మాణానికి రూ.154.82 కోట్లు వ్యయం అవుతుందని రెండేళ్ల క్రితం అంచనా వేశారు. అయితే అందుకోసం రైల్వే అడిగిన ముడసర్లోవలోని 52 ఎకరాలను అప్పగించడంలో జిల్లా అధికారులు కాలయాపన చేశారు. దాంతో డీఆర్‌ఎం కార్యాలయం వెనుకనున్న వైర్‌లెస్ కాలనీలో అందుబాటులో ఉన్న భూమిలో జోనల్ కార్యాలయం నిర్మాణం కోసం డిజైన్లు రూపొందించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక భూ సమస్యను పరిష్కరించింది. ముడసర్లోవలో భూమిని అప్పగించడమే కాకుండా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ కూడా చేయించింది. ఈ ప్రక్రియ అంతా ఆగస్టు నెలాఖరులోనే పూర్తయింది. అయితే భూమి ఇచ్చిన వారం రోజుల్లో శంకుస్థాపన చేస్తామని రైల్వే మంత్రి తన మాట నిలుపుకోలేదు.
నెల రోజుల క్రితం టెండర్లు
ముడసర్లోవలో రైల్వే జోన్ కార్యాలయం నిర్మాణానికి నెల రోజుల క్రితం టెండర్లు పిలిచారు. వాటిని ఇంకా ఖరారు చేయలేదు. భవన నిర్మాణం రెండేళ్ల క్రితం రూపొందించిన నమూనాలోనే ఉంటుందా?, ఇంకేమైనా మార్పులు చేస్తారా?...అనేది కూడా వెల్లడించలేదు. జోనల్ కార్యాలయం నిర్మాణంతో నిమిత్తం లేకుండా అందుబాటులో ఉన్న రైల్వే భవనాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్ ఇటీవల రైల్వే మంత్రిని కోరారు. అయితే ఆ దిశగా ఎటువంటి అడుగులు పడడం లేదు. దక్షిణ కోస్తా జోన్‌పై పొడి పొడి మాటలు తప్పితే ఢిల్లీ నాయకులు స్పష్టంగా ఏమీ చెప్పడం లేదు.
వాల్తేరు డివిజన్ ఉంటుందా? రద్దు చేస్తారా?
కొత్త రైల్వే జోన్‌ను ప్రకటించినప్పుడు వాల్తేరు డివిజన్‌ను రద్దు చేస్తామని కేంద్రం ప్రకటించింది. విశాఖ కేంద్రంగా ఉన్న వాల్తేరు డివిజన్‌లో ప్రస్తుతం ఉన్న ప్రాంతాలను ఇతర డివిజన్లలో విలీనం చేస్తామని వెల్లడించింది. ఉత్తరాంధ్ర ప్రాంతాలను విజయవాడ డివిజన్‌లో కలపాలని, శ్రీకాకుళం జిల్లాలో ఒడిశాకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను తూర్పు కోస్తా జోన్‌లోని ఖుర్దా డివిజన్‌లో కలుపుతామని పేర్కొంది. విజయనగరం జిల్లాలో కొత్తవలస నుంచి మొదలయ్యే కేకే లైన్‌ను కిరండోల్ వరకూ కొత్తగా ఏర్పాటు చేసే రాయగడ డివిజన్‌లో కలుపుతామని ప్రకటించారు. విచిత్రం ఏమిటంటే...విశాఖలో కొత్త జోన్ ఏర్పాటు చేయకుండా, వాల్తేరు డివిజన్ రద్దు కాకుండానే రాయగడలో కొత్త డివిజన్ కార్యాలయం నిర్మాణం ప్రారంభించారు. అక్కడ చూపించిన చొరవ ఇక్కడ కనిపించకపోవడం గమనార్హం. ఆదాయ సముపార్జనలో వాల్తేరు డివిజన్ టాప్-5లో ఒకటిగా ఉంది. ఇది రద్దయితే సరకు రవాణా ఆదాయం దక్షిణ కోస్తా జోన్‌కు కాకుండా తూర్పు కోస్తా జోన్‌కు పోతుంది. ఒత్తిళ్లకు లొంగి జోన్ ఇవ్వడమే తప్ప విశాఖను ఉన్నత స్థానంలో నిలపాలనే ఉద్దేశంతో కేంద్ర రైల్వే పెద్దలు ఏ పనీ చేయడం లేదు.