డిప్యూటీ సీఎం పర్యటనపై గందరగోళం
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:31 PM
ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జిల్లా పర్యటనపై గందరగోళం నెలకొంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం షెడ్యూల్ మొదలుకుని, ఆయన పర్యటనకు హాజరయ్యే వరకు అన్ని విషయాల్లోనూ జిల్లా అధికార యంత్రాంగం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నది.
మీడియాకు సమాచారం వెల్లడించని అధికారులు
సమాచార శాఖకే వాహనం లేని దుస్థితి
మీడియాను సమన్వయం చేయని వైనం
పాడేరు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ జిల్లా పర్యటనపై గందరగోళం నెలకొంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం షెడ్యూల్ మొదలుకుని, ఆయన పర్యటనకు హాజరయ్యే వరకు అన్ని విషయాల్లోనూ జిల్లా అధికార యంత్రాంగం పట్టనట్టుగానే వ్యవహరిస్తున్నది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉండే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో శనివారం డిప్యూటీ సీఎం పర్యటించనున్నారు. ఈ తరుణంలో జిల్లా యంత్రాంగంతోపాటు సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ లేదా డిప్యూటీ డైరెక్టర్ స్థాయి అధికారులు మీడియాను సమన్వయం చేయాల్సి ఉన్నా.. పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే డిప్యూటీ సీఎం పర్యటించే ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో ఉన్నప్పటికీ అది అనకాపల్లి జిల్లాకు చేరువగా ఉంది. దీంతో అల్లూరి జిల్లా కేంద్రం నుంచి అక్కడికి వెళ్లేందుకు మీడియా ప్రతినిధులకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఆ దిశగా అధికారులు కనీసం ఆలోచించలేదు. పైగా స్థానిక సమాచార శాఖకు సైతం ఎటువంటి వాహనం లేకపోవడంతో ఇన్‌చార్జి డీపీఆర్‌వో, సిబ్బంది సైతం ఇతర ప్రభుత్వ శాఖల అధికారుల వాహనాల్లో డిప్యూటీ సీఎం కార్యక్రమానికి తరలివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా శుక్రవారం రాత్రి తొమ్మిది గంటల వరకు డిప్యూటీ సీఎం కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర వివరాలను అధికారులు వెల్లడించలేదు. దీంతో పవన్‌కల్యాణ్ పర్యటన కవరేజీపై అధికార యంత్రాంగం శ్రద్ధ పెట్టడడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారులు స్పందించి డిప్యూటీ సీఎం పర్యటనపై మీడియాను సమన్వయం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు.