Share News

హాస్టల్‌ విద్యార్థిపై కుక్‌ దాష్టీకం

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:18 AM

అనకాపల్లి పట్టణం గాంధీనగరంలోగల అనుసూచిత బాలుర వసతిగృహం (డీ-నోటిఫైడ్‌ ట్రైబ్స్‌-డీఎన్‌టీ హాస్టల్‌)లో ఆరో తరగతి విద్యార్థిపై హాస్టల్‌ కుక్‌ కర్రతో చితకబాదాడు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరగ్గా.. మంగళవారం కుటుంబ సభ్యుల ఆందోళనతో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

హాస్టల్‌ విద్యార్థిపై కుక్‌ దాష్టీకం
విద్యార్థి హేమంత్‌ చేతిపై గాయం

భోజనం త్వరగా పెట్టాలని అడిగినందుకు కర్రతో విచక్షణారహితంగా దాడి

మద్యం మత్తులో బాలుడిని తీవ్రంగా కొట్టిన వైనం

భయంతో వణికిపోయిన ఇతర విద్యార్థులు

అనకాపల్లి గాంధీనగరం డీఎన్‌టీ హాస్టల్‌లో ఘటన

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

వసతిగృహంలో సిబ్బంది పర్యవేక్షణ లేదని ఆరోపణ

తుమ్మపాల, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి) : అనకాపల్లి పట్టణం గాంధీనగరంలోగల అనుసూచిత బాలుర వసతిగృహం (డీ-నోటిఫైడ్‌ ట్రైబ్స్‌-డీఎన్‌టీ హాస్టల్‌)లో ఆరో తరగతి విద్యార్థిపై హాస్టల్‌ కుక్‌ కర్రతో చితకబాదాడు. రెండు రోజుల క్రితం ఈ సంఘటన జరగ్గా.. మంగళవారం కుటుంబ సభ్యుల ఆందోళనతో వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

మండల కేంద్రమైన బుచ్చెయ్యపేటకు చెందిన శనివాడ హేమంత్‌ అనకాపల్లి పట్టణం గాంధీనగరంలోని డీఎన్‌టీ హాస్టల్‌లో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 20వ తేదీ ఆదివారం రాత్రి భోజనం సమయానికి కన్నా కొంచెం ముందుగా వచ్చిన హేమంత్‌ .. తనకు భోజనం వడ్డించాలని హాస్టల్‌ కుక్‌ ముదుపాక కుమార్‌ను అడిగాడు. అప్పటికే పూటుగా మద్యం సేవించిన కుమార్‌.. కర్ర తీసుకుని హేమంత్‌ను విచక్షణా రహితంగా కొట్టడం ప్రారంభించాడు. దీంతో ఇతర విద్యార్థులు బెంబేలెత్తిపోయి రూమ్‌లలోకి పరుగులు తీశారు. ఆ సమయంలో హాస్టల్‌ వార్డెన్‌, పర్యవేక్షకులు లేకపోవడంతో కుక్‌ కుమార్‌ ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. తీవ్ర గాయలైన హేమంత్‌ను సోమవారం తోటి విద్యార్థులు అనకాపల్లిలోని ఎన్టీఆర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మంగళవారం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో వారు హాస్టల్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. కుక్‌ తీరుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కుక్‌ ముదపాక కుమార్‌ను సస్పెండ్‌ చేసి విద్యార్థులకు రక్షణ కల్పించాలని, పర్యవేక్షణ లోపించిన హాస్టల్‌ వార్డెన్‌, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హాస్టల్‌ కుక్‌పై చర్యలు

కె.రాజేశ్వరి, డిప్యూటీ డైరెక్టర్‌, బీసీ వెల్ఫేర్‌

అనకాపల్లి గాంధీనగరంలోని డీఎన్‌టీ హాస్టల్‌లో ఒక విద్యార్థిపై కుక్‌ దాడి చేసినఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాం. కుక్‌ కుమార్‌ మద్యం మత్తులో విద్యార్థిపై దాడికి పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. అతడిని సస్పెండ్‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. హాస్టల్‌లో పర్యవేక్షణ లోపానికి బాఽధ్యులైన సిబ్బందిపైనా చర్యలు తీసుకుంటాం.

Updated Date - Oct 23 , 2024 | 12:18 AM