పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య దూరం
ABN , Publish Date - Mar 31 , 2024 | 01:25 AM
నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలన్న ఉద్దేశంతో గతంలో పాలకులు ప్రవేశపెట్టిన ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్’ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది.
దాదాపు దశాబ్దన్నర కిందట ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్’ ప్రారంభం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్, ప్రైవేటు స్కూల్స్‌లో ఉచితంగా చదువుకునే అవకాశం
విద్యార్థుల తరపున పాఠశాలలకు ఫీజును చెల్లిస్తూ వస్తున్న పాలకులు
పుస్తకాలు, ఇతర సామగ్రి
సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా సమకూరేలా చర్యలు
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో
ఉమ్మడి జిల్లాలో 1,632 మందికి ఛాన్స్
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పథకం రద్దు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలన్న ఉద్దేశంతో గతంలో పాలకులు ప్రవేశపెట్టిన ‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్’ను వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. ‘అమ్మఒడి’ పథకం కింద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తున్నందున...ఇక ఆ పథకం అవసరం లేదంటూ రద్దు చేసింది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో వందలాది మంది ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు కార్పొరేట్ స్కూల్స్‌లో చదువుకునే అవకాశాన్ని కోల్పోయారు.
‘బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్’లో భాగంగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఒకటి నుంచి పదో తరగతి వరకూ తమకు దగ్గరలోని ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌లో ఉచితంగా చదువుకునే అవకాశాన్ని గత ప్రభుత్వాలు కల్పిస్తూ వచ్చాయి. ఒకటో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఎక్కువ వచ్చినట్టయితే...ఉన్న సీట్లను బట్టి లాటరీ ద్వారా అవకాశం కల్పించేవారు. అలాగే ఐదు, ఎనిమిది తరగతుల్లో ప్రవేశాలకు విద్యార్థులను రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసేవారు. ఈ స్కీమ్‌కు ఎంపికైన విద్యార్థులకు ఏడాదికి రెసిడెన్సియల్ అయితే రూ.30 వేలు, నాన్ రెసిడెన్సియల్ అయితే రూ.20 వేలు చొప్పున ఫీజులను ప్రభుత్వమే చెల్లించేది. అలాగే, సాంఘిక సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో సదరు విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, షూ, యూనిఫామ్, ఇతర అవసరాలను సమకూర్చేది. ప్రభుత్వం చెల్లించే మొత్తాలకు అనుగుణంగా స్కూల్స్‌ను ఎంపిక చేసేవారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 1,632 మంది విద్యార్థులు ఈ పథకంలో భాగంగా ప్రవేశాలు పొందారు. ఈ స్కీమ్‌ను వైసీపీ వచ్చిన తరువాత రద్దు చేయడంతో పలువురు విద్యార్థులు తల్లిదండ్రులు, దళిత హక్కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ పథకాన్ని ప్రస్తుతమున్న విద్యార్థులకు కొనసాగించాలంటూ తీర్పు ఇచ్చింది. దీంతో గత ప్రభుత్వ హయాంలో ప్రవేశాలు పొందిన వారికి మాత్రమే ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు.
నాణ్యమైన విద్య అందించాలని..
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ఉద్దేశంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకు ప్రవేశాలు కల్పించేందుకు ముందుకువచ్చే స్కూల్స్‌లో పిల్లలను చేర్పిస్తారు. ఒక్కో క్లాస్‌లో కనీసం పది మందికి అవకాశం ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ పథకాన్ని అమలు చేసేందుకు 30కిపైగా స్కూల్స్‌కు ముందుకు రావడంతో వందలాది మంది విద్యార్థులు చదువుకునే అవకాశం ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం ఈ స్కీమ్‌ను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో కొత్తగా అడ్మిషన్లు పొందలేని దుస్థితి ఏర్పడింది. హైకోర్టు ఆదేశాలతో గతంలో చేరిన విద్యార్థులకు మాత్రమే ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తోంది. 2008లో ఈ పథకాన్ని ప్రారంభించగా, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించాయి. ఈ స్కీమ్‌ను కొనసాగించడంతోపాటు ఫీజులను మరింత పెంచి ఉంటే జిల్లాలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులకు ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్‌లో చదువుకునే అవకాశం లభించి ఉండేదని విద్యార్థులు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
పథకాన్ని పునరుద్ధరించాలి
- చింతాడ జోగారావు, దళిత హక్కుల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్
నిరుపేదలైన ఎస్సీ విద్యార్థుల కోసం బెస్ట్ అవైలబుల్ పథకాన్ని తీసుకువచ్చారు. ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసింది. పోరాటం చేసినా పునరుద్ధరించ లేదు. ఉన్న వారికి కూడా ఆపేస్తామంటే కోర్టుకు వెళ్లాం. గతంలో చేరిన విద్యార్థులకు మాత్రమే ఈ పథకాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మఒడి పేరుతో ఇచ్చే మొత్తానికి మరింత చేర్చి ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో నిరుపేదలైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఉచితంగా చదువుకునే అవకాశాన్ని కల్పించాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అమ్మఒడి పథకంలో భాగంగా ఇచ్చే మొత్తంతో కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే అవకాశం దక్కుతుందా?...ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలే ఆలోచించాలి. ఈ పథకాన్ని పునరుద్ధరించిన వారిని గుర్తుంచుకుంటాం.