Share News

సీపీ గన్‌ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌

ABN , Publish Date - Dec 29 , 2024 | 01:11 AM

ఏటా నిర్వహించే గన్‌ ఫైరింగ్‌ వార్షిక ప్రాక్టీస్‌లో సీపీ శంఖబ్రతబాగ్చి శనివారం పాల్గొన్నారు.

సీపీ గన్‌ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌

విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి:

ఏటా నిర్వహించే గన్‌ ఫైరింగ్‌ వార్షిక ప్రాక్టీస్‌లో సీపీ శంఖబ్రతబాగ్చి శనివారం పాల్గొన్నారు. కాపులుప్పాడలోని గ్రేహౌండ్స్‌ మైదానంలో గ్రేహౌండ్స్‌, నగర పోలీస్‌ అధికారులతో కలిసి ఆయన ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. ఏటా రెండు విడతలుగా గన్‌ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్‌ నుంచి సీపీ వరకు అందరూ ఈ ప్రాక్టీస్‌లో పాల్గొని ఫైరింగ్‌లో నైపుణ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో డీసీపీలు అజితా వేజెండ్ల, మేరీప్రశాంతితో పాటు గ్రేహౌండ్స్‌, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

-----------------------------------------------------------------------------------

సంక్రాంతికి 1000 బస్సులు

దూర ప్రాంతాలకు 200 సర్వీసులు

జోనల్‌ పరిధిలో 800...

ఆర్టీసీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు

ద్వారకా బస్‌స్టేషన్‌, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

సంక్రాంతి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వెయ్యి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్టు ఆర్టీసీ విశాఖ రీజనల్‌ మేనేజర్‌ బి.అప్పలనాయుడు పేర్కొన్నారు. ద్వారకా బస్‌ స్టేషన్‌లోని తన కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా డిపో మేనేజర్లు, అసిస్టెంట్‌ మేనేజర్లు, చెకింగ్‌ ఇన్‌స్పెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్‌, విజయవాడ, భీమవరం, ఖమ్మం, రాజోలు, తిరుపతి, చెన్నై వంటి దూర ప్రాంతాలకు 200 స్పెషల్స్‌, విజయనగరం జోనల్‌ పరిధిలోని రాజమండ్రి, కాకినాడ, ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం, శ్రీకాకుళం, బొబ్బిలి, సాలూరు, రాజాం, విజయనగరం ప్రాంతాలకు 800 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఏ డిపో నుంచి ఎన్ని బస్సులను ఇందుకు వినియోగించాలో డిపో మేనేజర్లు గుర్తించాలని సూచించారు. గరుడ, గరుడ ప్లస్‌, అమరావతి, నైట్‌ రైడర్‌, క్రూయిజ్‌, ఆలా్ట్ర డీలక్స్‌ వంటి సర్వీసులను దూర ప్రాంతాలకు, ఆలా్ట్ర డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, సూపర్‌ డీలక్స్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, ఎక్స్‌ప్రెస్‌ వంటి సర్వీసులను జోనల్‌ పరిధిలోని వివిధ ప్రాంతాలకు నడిపేందుకు ఏర్పాట్లు చేయాలని డిపో మేనేజర్లకు ఆయన ఆదేశించారు. సమావేశంలో డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ జి.సత్యనారాయణ, డిపో మేనేజర్లు గంగాధర్‌ (విశాఖపట్నం), అరుణకుమారి (మద్దిలపాలెం), ప్రవీణ (గాజువాక), రాజశేఖర్‌ (సింహాచలం), అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్లు పాల్గొన్నారు.

-----------------------------------------------------------------------------------

నైట్‌ ఫుడ్‌కోర్టుపై అల్టిమేటమ్‌

తొలగించకుంటే ఆందోళనకు దిగుతామంటున్న కూటమి కార్పొరేటర్లు

విశాఖపట్నం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి):

పాత జైలురోడ్డులో గల నైట్‌ ఫుడ్‌ కోర్టు తొలగింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. జీవీఎంసీ అనుమతి లేకుండా నడుస్తున్న ఫుడ్‌ కోర్డును అక్కడ నుంచి తొలగించాలంటూ గత ఏడాది జూన్‌లో కౌన్సిల్‌ సమావేశంలో తీర్మానం చేశారు. ఇప్పటికీ తీర్మానం అమలుకాకపోవడంతో కూటమి కార్పొరేటర్లు ఆందోళనకు సిద్ధ మవుతున్నారు. ఆదివారం ఫుడ్‌ కోర్ట్‌ను మూసివేయకపోతే ధర్నాకు దిగుతామంటూ కమిషనర్‌ సంపత్‌కుమార్‌కు శనివారం కూటమి కార్పొరేటర్లు పీతల మూర్తియాదవ్‌, గంధం శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, తదితరులు నోటీస్‌ అందజేశారు.

Updated Date - Dec 29 , 2024 | 01:11 AM