మళ్లీ ఊయల
ABN , Publish Date - Dec 20 , 2024 | 01:17 AM
అవాంఛిత గర్భం దాల్చినవారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు పుట్టిన పిల్లలను ముళ్ల పొదల్లో, కాలువల్లో పడేస్తుంటారు.
ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్, తదితర ఇరవైచోట్ల ఏర్పాటు
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు
విశాఖపట్నం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి):
అవాంఛిత గర్భం దాల్చినవారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యేవారు పుట్టిన పిల్లలను ముళ్ల పొదల్లో, కాలువల్లో పడేస్తుంటారు. ఈ తరహా చర్యల వల్ల నవజాత శిశువులు మృతిచెందుతున్నారు. అటువంటి మరణాలను నివారించేందుకు ‘ఊయల’ పేరుతో ప్రభుత్వం గతంలో ఒక కార్యక్రమాన్ని అమలు చేసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో నిధులు విడుదల చేయకపోవడంతో ‘ఊయల’ ఊసే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం ఊయల కార్యక్రమాన్ని పునఃప్రారంభించాలంటూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేసింది.
ఎక్కడెక్కడ ఏర్పాటుచేస్తారంటే...
పిల్లలను వద్దనుకునే తల్లిదండ్రులు ఎవరైనా నవజాత శిశువులను ఊయలలో వదిలి వెళ్లిపోవచ్చు. ఈ ఊయలలను ప్రభుత్వ ఆస్పత్రులు, జనాలు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. కేజీహెచ్, ఘోషా ఆస్పత్రులు, ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, హెల్త్ సిటీ, ప్రైవేటు ఆస్పత్రులు ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేయాలని భావిస్తున్నారు. జిల్లాలో సుమారు ఇరవైచోట్ల ఊయలలు ఏర్పాటుచేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ ఊయల పర్యవేక్షణ బాధ్యతను స్థానిక ఏఎన్‌ఎంకు అప్పగిస్తారు. ఊయల వద్ద బెల్ ఏర్పాటుచేస్తారు. ఎవరైనా బిడ్డను వదిలి వెళుతుంటే బెల్ కొట్టాల్సి ఉంటుంది. అయితే, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని అధికారులు చెబుతున్నారు. బిడ్డను వద్దనుకుని వెళ్లివాళ్లు బెల్ ఎందుకు కొడతారని ప్రశ్నిస్తున్నారు.
శిశువులు దత్తత
ఊయలలో వేసే చిన్నారులకు సంబంధించిన వివరాలతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఒక ప్రకటన ఇస్తారు. అందులో పేర్కొన్న వ్యవధిలోగా ఎవరైనా రాకపోతే శిశువులను బాల సదనాల్లో అప్పగిస్తారు. అనంతరం పిల్లలు కావాలనుకునే వారికి అధికారికంగా దత్తత ఇస్తారు.