సరియా జలపాతంలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం
ABN , Publish Date - Sep 16 , 2024 | 12:36 AM
సరియా జలపాతంలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శనివారం సాయంత్రం ఆ యువకులు గల్లంతుకాగా, ఆదివారం ఉదయం నుంచి జలపాతం వద్ద ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.
వెలికితీసిన ఏపీఎస్‌ఆర్‌డీఎఫ్, అగ్నిమాపక, నేవీ బృందాలు
శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
అనంతగిరి, సెప్టెంబరు 15: సరియా జలపాతంలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. శనివారం సాయంత్రం ఆ యువకులు గల్లంతుకాగా, ఆదివారం ఉదయం నుంచి జలపాతం వద్ద ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. దీనికి సంబంధించి అనంతగిరి ఎస్‌ఐ కరక రాము, డిప్యూటీ తహసీల్దార్ మాణిక్యం అందించిన వివరాలిలా ఉన్నాయి. అనంతగిరి మండలంలోని జీనబాడు పంచాయతీ పరిధిలో ఉన్న సరియా జలపాతాన్ని తిలకించేందుకు విజయనగరం జిల్లా కేంద్రంలోని బాబామెట్టకు చెందిన లంక సాయికుమార్ (33) మరో ముగ్గురు స్నేహితులతోను, బిహార్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం నేవీ ఉద్యోగి దిలీప్‌కుమార్ (31) తోటి ఉద్యోగులతోను కలిసి జలపాతం తిలకించేందుకు శనివారం వచ్చారు. లంక సాయికుమార్ బహుబలి జలపాతం వద్ద స్నానం చేస్తుండగా ఒక్కసారిగా లోతైన ప్రదేశం వద్ద ప్రమాదవశాత్తూ జారిపడ్డాడు. దీన్ని గమనించిన నేవీ ఉద్యోగి దిలీప్‌కుమార్ కాపాడేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో సాయికుమార్‌తో పాటు దిలీప్ కూడా గల్లంతయ్యాడు. శనివారం రాత్రి వరకు అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం ఉదయం ఎస్‌ఐ రాము, డీటీ మాణిక్యం పర్యవేక్షణలో ఏపీ ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ, అగ్నిమాపక సిబ్బంది ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో జలపాతం డేంజర్ పాయింట్ వద్ద దిలీప్‌కుమార్ మృతదేహం, 2.30 గంటల సమయంలో బాహుబలి జలపాతం వద్ద లంక సాయికుమార్ మృతదేహం లభ్యమయ్యాయి. అతి కష్టమ్మీద రెండు మృతదేహాలను బయటకు తీసి, తాడు సాయంతో గెడ్డను దాటించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శృంగవరపుకోట సీహెచ్‌సీకి తరలించినట్టు ఎస్‌ఐ రాము తెలిపారు.
కన్నీరుమున్నీరైన కుటుంబీకులు, బంధువులు
లంక సాయికుమార్, దిలీప్‌కుమార్ మృతి చెందారని తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు సరియా జలపాతం వద్దకు చేరుకున్నారు. సాయికుమార్ మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబానికి దిక్కు ఎవరంటూ రోదించడం చూసిన వారు కూడా కంట తడి పెట్టారు. అలాగే దిలీప్‌కుమార్ మృతదేహం వద్ద తోటి ఉద్యోగులు కన్నీరు పెట్టారు. సరదాగా గడిపేందుకు వచ్చి, మృత్యువాత పడడంతో శోకసంద్రంలో మునిగిపోయారు. ఆర్‌ఐలు శంకరరావు, లక్ష్మీకాంత్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.