కమిటీలతో కాలయాపన
ABN , Publish Date - Nov 18 , 2024 | 12:37 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అనేక వ్యవహారాలపై ఉన్నతాధికారులు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏయూలో అడ్డగోలు వ్యవహారాలపై చర్యలకు వెనకడుగు
ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల పరిస్థితి
గత వీసీపై విచారణను పట్టించుకోని ప్రభుత్వం
విశాఖపట్నం, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని అనేక వ్యవహారాలపై ఉన్నతాధికారులు కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అనేక అంశాలపై కమిటీలు వేశారు. ఇవి ఏమి తేల్చాయన్న దానిపై ఇప్పటి వరకు వివరాలను వెల్లడించలేదు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వర్సిటీ అధికారులు ఏయూ సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్, సెంటర్ ఫర్ డిస్టెన్స్ స్టడీస్, రూసా ఫేజ్-2, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఏయూ టీడీఆర్ హబ్‌ల్లో జరిగిన వ్యవహారాలపై విచారణకు కమిటీలు వేశారు. కమిటీ సభ్యులుగా ఏయూ ప్రొఫెసర్లతోపాటు ఇతర విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు, నిపుణులను నియమించారు. ఇవి నియమించి రెండు నెలలు దాటుతు న్నా విచారణ నివేదికలోని అంశాలను వెల్లడించలేదు. గత నెలలో జర్నలిజం కాలేజీ విభాగాధిపతిగా పనిచేసిన డాక్టర్ సీఎం వినయ్‌కుమార్‌ను తొలగించడంతో పాటు విచారణకు ఆదేశించారు. వర్సిటీలో పనిచేస్తూనే కృష్ణా వర్సిటీలో గైడ్‌గా వ్యవహరించారంటూ గవర్నర్‌కు పలువురు ఫిర్యాదు చేయడంతో పూర్తిస్థాయి విచా రణ జరిపి నివేదిక ఇచ్చేలా కమిటీని నియమించారు. దీంతో పాటు వర్సిటీలోని అనేక ప్రాంతాల్లో ఇష్టానుసారంగా ఏర్పాటైన కంటైనర్ షాపులు తొలగించాలని భావించారు. ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు రావడంతో దానిపై మరో కమిటీని వేశారు. తాజాగా వర్సిటీలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ పైడి శ్రీనివాస్‌పై విచారణకు ఆదేశిస్తూ ఐదుగురితో కమిటీని ఏర్పాటుచేశారు. సెలవు పెట్టినా పరిగణనలోకి తీసుకోకుండా ఒక అధికారి ఒత్తిళ్లతో ఇబ్బందులకు గురిచేశారంటూ సదరు ఉద్యోగి చేసిన ఫిర్యాదులను పట్టించుకోలేదు. ఏడాదిన్నరపాటు విధుల్లోకి తీసుకోకపోయినా బాధ్యులపై చర్యలు తీసుకోలేని స్థితిలో ఉన్నారు.
మాజీ వీసీపై విచారణ లేనట్టేనా..?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తొలుత ఏయూ పై దృష్టి సారిస్తారని అంతా భావించారు. అయితే ఆరు నెలలు అవుతున్నా వర్సిటీ అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఏయూపై దృష్టి పెట్టలేదు. దీనిపై వర్సిటీలోని పలువురు ఉద్యోగులే రగిలిపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో వర్సిటీలో అడ్డగోలు వ్యవహారాలు సాగాయని, దీనిపై అప్పట్లోనే నారా లోకేశ్, పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పటివరకు గత వీసీతో సహా మరికొంతమంది అధికారుల ఆగడాలపై చర్యల్లేవని ఇదే ఇప్పుడు ఎంతో మంది ఆగ్రహానికి కారణమవుతోంది. గత ప్రభుత్వంపై పోరాటం చేసిన ఎంతో మంది ప్రస్తుతం ప్రభుత్వ మెతక వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.