కాఫీకి గిరాకీ
ABN , Publish Date - Dec 20 , 2024 | 11:24 PM
గిరిజన ప్రాంతంలో కాఫీ పండ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్ ప్రారంభంలోనే మ్యాక్స్, పలు ఎఫ్‌పీవోలు కిలో పండ్లను రూ.44 నుంచి రూ.50 ధరకు కొనుగోలు చేస్తున్నాయి.
మ్యాక్స్, ఎఫ్‌పీవోల పోటాపోటీగా కొనుగోళ్లు
పలు ఎఫ్‌పీవోలు కిలో రూ.50లకు కొనుగోలు
మ్యాక్స్ మాత్రం కిలో రూ.44లకే సేకరణ
కొచ్చిన్ మార్కెట్‌లో క్లిన్ కాఫీకి గరిష్ఠ ధర
ప్రతికూల పరిస్థితులతో ఆలస్యమైన దిగుబడులు
చింతపల్లి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): గిరిజన ప్రాంతంలో కాఫీ పండ్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. మార్కెట్ ప్రారంభంలోనే మ్యాక్స్, పలు ఎఫ్‌పీవోలు కిలో పండ్లను రూ.44 నుంచి రూ.50 ధరకు కొనుగోలు చేస్తున్నాయి. కాఫీ పండ్లను రైతుల వద్ద నుంచి నేరుగా కొనేందుకు మ్యాక్స్, ఎఫ్‌పీవోలు పోటీ పడుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మెజారిటీ గిరిజన రైతులు కాఫీ గింజలను చెర్రీ రూపంలోనే విక్రయించుకునేవారు. అతి తక్కువ మంది రైతులు పండ్లు పార్చిమెంట్‌గా చేసి విక్రయించేవారు. రైతులు పండించిన కాఫీ గింజలను దళారులు, జీసీసీకి మాత్రమే రైతులు అమ్ముకునేవారు. నాలుగేళ్లుగా చింతపల్లి మ్యాక్స్ కాఫీ పండ్ల కొనుగోళ్లు ప్రారంభించింది. దీంతో రైతులు కాఫీ పండ్లను నేరుగా మ్యాక్స్‌కి విక్రయించడం ప్రారంభించారు. మ్యాక్స్‌తోపాటు కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రెండేళ్లుగా కాఫీ పండ్లు కొనుగోలు చేపడుతున్నాయి. ప్రస్తుతం చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో మ్యాక్స్ కిలో రూ.44 ధరకు కొనుగోలు చేస్తున్నది. మార్కెటింగ్ అనంతరం వచ్చిన లాభాల నుంచి బోనస్ చెల్లిస్తామని ఐటీడీఏ అధికారులు ప్రకటించారు. మ్యాక్స్ ప్రస్తుతం ఏజెన్సీ 11 మండలాల్లోనూ కాఫీ పండ్లను కొనుగోలు చేస్తున్నది. అలాగే చింతపల్లి కేంద్రంగా మాతోట, ఆంధ్రకశ్మీర్, గంటన్నదొర, అరుణతారక రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కిలో పండ్లను రూ.50 ధరకు కొనుగోలు చేస్తున్నాయి. కాఫీ పండ్లను కొనుగోలు చేసేందుకు పలు ఎఫ్‌పీవోలు, మ్యాక్స్ పోటీ పడుతుండడంతో రైతులకు ప్రారంభంలోనే మంచి ధర లభిస్తున్నది. కాగా ఈ ఏడాది కాఫీ గింజలకు గరిష్ఠ ధరలు లభించే అవకాశం ఉన్నదని కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం కొచ్చిన్ మార్కెట్‌లో క్లిన్ కాఫీ పార్చిమెంట్ కిలో రూ.430 నుంచి 435ఽ దర పలుకుతోంది. ఈ మేరకు రానున్న రోజుల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, మ్యాక్స్ కాఫీ పండ్ల ధర పెంచే అవకాశం లేకపోలేదు. గిరిజన సహకార సంస్థ కిలో పార్చిమెంట్ రూ.285, చెర్రీ కిలో రూ.150, రొబస్ట్రా రూ.80 ఽధరలకు కొనుగోలు చేయనున్నట్టు ప్రకటించింది. కాగా ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడులు ఆలస్యమయ్యాయి. డిసెంబరు రెండో పక్షం నాటికి 60 శాతం దిగుబడులను రైతులు మార్కెట్‌లో విక్రయించుకునేవారు. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల కాఫీ సకాలంలో పక్వానికి రాలేదు. దీంతో పండ్ల దిగుబడులు ఆలస్యమయ్యాయి. నేటికి గిరిజన రైతులు కేవలం 20 శాతం దిగుబడులను మాత్రమే మార్కెటింగ్ చేసుకున్నారు. వర్షాలతో పండ్ల సేకరణకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నెలాఖరు నాటికి కాఫీ దిగుబడులు రైతులు సేకరించుకుని మార్కెట్‌కి తీసుకొచ్చే అవకాశం ఉన్నది.