Share News

రైల్వే స్టేషన్లలో డిజిటల్‌ పేమెంట్లు

ABN , Publish Date - Aug 10 , 2024 | 01:16 AM

వాల్తేరు డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్‌ పేమెంట్‌ విధానం అమలులోకి తీసుకువచ్చినట్టు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సందీప్‌ శుక్రవారం తెలిపారు.

రైల్వే స్టేషన్లలో డిజిటల్‌ పేమెంట్లు

  • ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులు

  • చిల్లర సమస్యకు పరిష్కారం

విశాఖపట్నం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి):

వాల్తేరు డివిజన్‌లోని అన్ని రైల్వే స్టేషన్లలో డిజిటల్‌ పేమెంట్‌ విధానం అమలులోకి తీసుకువచ్చినట్టు సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ సందీప్‌ శుక్రవారం తెలిపారు. ఈ-టికెట్‌ బుకింగ్‌ సమయంలో మాత్రమే ఇప్పటివరకూ ఆన్‌లైన్‌ పేమెంట్‌ జరుగుతోంది. రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఏ రైలుకు టికెట్‌ తీసుకున్నా నగదు మాత్రమే తీసుకుంటున్నారు. డిజిటల్‌ పేమెంట్లు అందుబాటులోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా స్టేషన్లలో వాటిని అనుమతించలేదు. ప్లాట్‌ఫారం టికెట్‌ కూడా నగదు ఇచ్చి తీసుకోవలసిన పరిస్థితి. విశాఖ రైల్వే స్టేషన్‌కు రద్దీ ఎక్కువ. రిజర్వేషన్‌ లేని బోగీలలో ఎక్కేవారు సరిగ్గా రైలు వచ్చే సమయానికి కౌంటర్‌ వద్దకు వెళ్లి టికెట్‌ తీసుకుంటారు. అక్కడ క్యూ కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఇదే సమయంలో చిల్లర సమస్య తలెత్తుతోంది. పూర్తిగా చిల్లర కావాలంటే...మీరే తగినంత మొత్తం తెచ్చుకోవాలంటూ ప్రయాణికుల వద్ద సిబ్బంది టికెట్‌ లాగేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కోసారి రైలు వెళ్లిపోతుందనే ఆత్రంలో ప్రయాణికులు చిల్లరను వదులుకుంటున్నారు. ఈ విధంగా టికెట్‌ కౌంటర్లలో ఉండేవారికి రోజుకు వేయి నుంచి రెండు వేల రూపాయలు మిగులుతుంటుందని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వాల్తేరు డివిజన్‌ అధికారులు డిజిటల్‌ పేమెంట్‌ విధానం అందుబాటులోకి తెచ్చారు. ప్రతి కౌంటర్‌లో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ను పెట్టారు. దానిని యూపీఐ నంబరు కలిగిన ఫోన్‌పే, లేదా గూగుల్‌ పే ద్వారా చెల్లించవచ్చు. వాల్తేరు డివిజన్‌లో ఇప్పటివరకు 66 స్టేషన్లలో వీటిని పెట్టామని సందీప్‌ తెలిపారు.

పేపర్‌లెస్‌ టికెట్లు కూడా

ప్రయాణికులు క్యూలో నిల్చోకుండా ఆన్‌లైన్‌లో పేపర్‌లెస్‌ టికెట్‌ కొనుగోలు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఆన్‌ రిజర్వ్‌డ్‌ టికెట్ల కొనుగోలుకు ఇబ్బంది లేకుండా ‘యుటీఎస్‌’ యాప్‌ ద్వారా తీసుకోవచ్చునన్నారు.

పార్కింగ్‌, ఫుడ్‌ కౌంటర్లలోను

ఈ డిజిటల్‌ పేమెంట్లు కేవలం టికెట్‌ కోసమే కాకుండా స్టేషన్‌ ఆవరణలో ఎటువంటి చెల్లింపులకైనా ఉపయోగించుకోవచ్చు. వాహనాలు పార్కింగ్‌ చేసుకునే చోట, ఆహార పదార్ధాలు కొనే ఫుడ్‌ స్టాల్స్‌ వద్ద కూడా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని సందీప్‌ తెలిపారు.

Updated Date - Aug 10 , 2024 | 01:16 AM