షెడ్డు తొలగింపులో వివాదం
ABN , Publish Date - May 30 , 2024 | 01:33 AM
రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహం ఓ గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆక్రమణ పేరుతో నివాసముంటున్న షెడ్డు తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో విధిలేక ఆమె ఒంటిపై పెట్రోలు పోసుకుంది. గమనించిన స్థానికులు రెవెన్యూ యంత్రాంగాన్ని నిలదీయడంతో షెడ్డును సగం కూల్చి వెనుతిరిగారు. ఈ సంఘటన బుధవారం పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలో జరిగింది. బాధితులు అందించిన వివరాల మేరకు...
ఒంటిపై పెట్రోల్ పోసుకున్న గర్భిణి
రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహంతోనే సంఘటన
నోటీసులు ఇవ్వకుండా తొలగింపునకు చర్యలు
సచివాలయ వీఆర్వో కక్ష సాధింపేనని బాధితుల ఆరోపణ
చినముషిడివాడలో ఉద్రిక్తత
పెందుర్తి, మే 29:
రెవెన్యూ సిబ్బంది అత్యుత్సాహం ఓ గర్భిణి ప్రాణాల మీదకు తెచ్చింది. ఆక్రమణ పేరుతో నివాసముంటున్న షెడ్డు తొలగింపు ప్రక్రియ చేపట్టడంతో విధిలేక ఆమె ఒంటిపై పెట్రోలు పోసుకుంది. గమనించిన స్థానికులు రెవెన్యూ యంత్రాంగాన్ని నిలదీయడంతో షెడ్డును సగం కూల్చి వెనుతిరిగారు. ఈ సంఘటన బుధవారం పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలో జరిగింది. బాధితులు అందించిన వివరాల మేరకు...
చినముషిడివాడ గ్యాస్ గోదాము వెనుక ప్రభుత్వానికి చెందిన అతుకుబడి భూమి ఉంది. కొన్నేళ్ల కిందిట ఈ స్థలానికి హక్కులున్నాయని పేర్కొంటూ కొంతమంది విక్రయాలు సాగించారు. ఈ క్రమంలో పలువురు స్థలాలు కొనుగోలు చేసి నిర్మాణాలు చేపట్టి ఆవాసాలు ఏర్పరుచుకున్నారు. వారిలో కొంతమందికి ఇంటి పట్టాలు కూడా అందాయి. ఇదే ప్రాంతానికి చెందిన వ్యాన్ డ్రైవర్ బంద శ్రీను ఇక్కడ 50 గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. అందులో కొంతమేర షెడ్డును నిర్మించి భార్య సంతోషి, కుటుంబసభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం స్థానిక సచివాలయ వీఆర్వో ధర్మ, ఆర్‌ఐ సాయి, రెవెన్యూ సిబ్బంది వారి షెడ్డు దగ్గరికి వచ్చి ఇది ఆక్రమిత స్థలమని, షెడ్డును కూల్చేస్తామని చెప్పారు. ఆ సమయంలో ఇంట్లో శ్రీను భార్య సంతోషి (మూడు నెలల గర్భిణి) మాత్రమే ఉంది. ఇంట్లో ఎవరూ లేరని, తన భర్త వచ్చే దాకా ఆగాలని అధికారులను ప్రాథేయపడింది. దీనికి ససేమిరా అన్న వీఆర్వో ధర్మ షెడ్డును కూల్చాలని సిబ్బందిని ఆదేశించారు. వారు సుత్తులతో కూల్చివేత పనులు మొదలుపెట్టారు. కళ్లముందే ఇల్లు నేలమట్టమవుతుండడంతో ఎటూ పాలుపోని సంతోషి ఇంట్లో ఉన్న పెట్రోల్ సీసాను తీసుకుని ఒంటిపై పోసుకుంది. అనంతరం బిగ్గరగా రోదిస్తూ కుప్పకూలిపోయింది. విషయం తెలిసిన స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని ఆమెకు సపర్యలు చేశారు. నోటీసులు ఇవ్వకుండా షెడ్డును ఎలా కూలుస్తారంటూ రెవెన్యూ సిబ్బందితో వాదనకు దిగారు. సచివాలయ వీఆర్వో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని, ఈ ప్రాంతంలో అనేకమంది పెద్దలు భారీగా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి భవంతులు నిర్మించినా పట్టించుకోని అతను పేదల బతుకులను బుగ్గిపాల్జేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. గర్భిణి పెట్రోల్ పోసుకోవడంతో భయపడిన రెవెన్యూ సిబ్బంది షెడ్డును కొంతమేర తొలగించి వెనుదిరిగారు. సంతోషిని స్థానికుల సహకారంతో ఆస్పత్రిలో చేర్పించామని, ప్రస్తుతం ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఆమె భర్త శ్రీను తెలిపాడు.