Share News

అంబులెన్సులను ఇతర పనులకు వాడొద్దు

ABN , Publish Date - Nov 14 , 2024 | 11:46 PM

రోగులను తరలించడానికి ఉన్న అంబులెన్సులను ఇతర పనులకు ఎట్టి పరిస్థిత్లుల్లోనూ వినియోగించవద్దని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు.

అంబులెన్సులను ఇతర పనులకు వాడొద్దు
అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌

కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ సూచన

పాడేరు, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): రోగులను తరలించడానికి ఉన్న అంబులెన్సులను ఇతర పనులకు ఎట్టి పరిస్థిత్లుల్లోనూ వినియోగించవద్దని కలెక్టర్‌ ఏఎస్‌ దినేశ్‌కుమార్‌ సూచించారు. జిల్లాలో అంబులెన్సుల వినియోగం, రోగుల తరలింపు, తదితర అంశాలపై ఐటీడీఏ, వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబులెన్సులను కేవలం రోగులను తరలించేందుకు మాత్రమే వినియోగించాలని, స్టేషనరీ, ఇతర సామగ్రి తరలింపునకు వినియోగించవద్దని స్పష్టం చేశారు. జిల్లాలోని పాడేరు, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏల పరిధిలో 70 అంబులెన్సులు, 69 ఫీడర్‌ అంబులెన్సులు, 108 సేవల అంబులెన్సులు 28 ఉన్నప్పటికీ రోగులకు సకాలంలో అంబులెన్సుల సేవలు అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. అలాగే మారుమూల గ్రామాల్లోని రోగులకు ఫీడర్‌ అంబులెన్సుల ద్వారా సేవలు అందించాలని, ఒక్కో అంబులెన్సు రోజుకు నలుగురు రోగులను తరలించాలన్నారు. అంబులెన్సుల నెలవారీ నిర్వహణ రూ.45 వేలుకు మరో రూ.15 వేలు అదనంగా మంజూరు చేసేందుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. అంబులెన్సుల్లో విధిగా ఆక్సిజన్‌, అత్యవసర పరికరాలు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. అంబులెన్సుల సమస్యలపై కలెక్టర్‌, ఐటీడీఏ పీవోలకు ఫోన్లు వస్తున్నాయని, ఇకపై అలా కాకుండా సంబంధిత ఆర్‌ఎంవోలకు మాత్రమే అంబులెన్సుల గురించి కాల్స్‌ రావాలన్నారు. అంబులెన్సులకు సంబంధించిన నంబర్లు, ఇతర వివరాలను ఆస్పత్రుల్లో ప్రదర్శించాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ జమాల్‌ బాషా, ఐటీడీఏ పరిపాలనాధికారి హేమలత, ఐటీడీఏల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖాధికారులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:46 PM