Share News

పది గ్రామాలకు తీరనున్న డోలి మోతలు

ABN , Publish Date - Nov 22 , 2024 | 10:52 PM

మండలంలో మారుమూల బూదరాళ్ల పంచాయతీలో చీడిపల్లి-తూములోవ మధ్య ఉన్న పది గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం ఆయా గ్రామాలకు రహదారి కల్పనకు నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పది గ్రామాలకు తీరనున్న డోలి మోతలు
ఎక్స్‌కవేటర్‌తో జరుగుతున్న తూములోవ-చీడిపల్లి రహదారి పనులు

శరవేగంగా చీడిపల్లి-తూములోవ రోడ్డు నిర్మాణం

రహదారి కోసం వైసీపీ పాలకుల చుట్టూ

ప్రజలు తిరిగినా ఫలితం శూన్యం

ఎన్నికల సమయంలో గిడ్డి ఈశ్వరి హామీ

కూటమి వచ్చిన ఐదు నెలల్లోనే రోడ్డుకు

నిధులు మంజూరు చేయించిన మాజీ ఎమ్మెల్యే

ఆయా గ్రామాల గిరిజనులు హర్షం

కొయ్యూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మండలంలో మారుమూల బూదరాళ్ల పంచాయతీలో చీడిపల్లి-తూములోవ మధ్య ఉన్న పది గ్రామాల ప్రజలకు రహదారి కష్టాలు తీరనున్నాయి. కూటమి ప్రభుత్వం ఆయా గ్రామాలకు రహదారి కల్పనకు నిధులు మంజూరు చేయడంతో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మండలంలోని బూదరాళ్ల పంచాయతీలో చేరిన చీడిపల్లి నుంచి గోధుమలంక, పోకలపాలెం, చీడిపల్లి, చల్ధిగెడ్డ, కొత్తపల్లి తదితర గ్రామాలను కలుపుతూ తూములోవ వరకు రోడ్డు నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దశాబ్దాల కాలంగా ఈ గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. అనారోగ్య బారిన పడిన వారిని తరలించేందుకు డోలిమోతలే ఈ గ్రామాల గిరిజనులకు శరణ్యం. ఈ రహదారి కోసం వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు పాలకుల చుట్టూ ఆయా గ్రామాల గిరిజనులు ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో ఎన్నికల ప్రచారంలో ఈ సమస్యను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి దృష్టికి ఆయా గ్రామాల గిరిజనులు తీసుకెళ్లారు. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే రహదారికి మోక్షం లభించింది. ఉపాధి హామీ పథకం కింద రోడ్డును మంజూరు చేసింది. దీంతో రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే చీడిపల్లి నుంచి బాలరేవుల వెళ్లే బోడికొండ గొప్పు వరకు బీటీరోడ్డును కలుపుతుంది. దీంతో ఆయా గ్రామాలకు పూర్తిస్థాయిలో రవాణా సౌకర్యం కలుగుతోంది. ప్రస్తుతం ఈ రహదారి నిర్మాణానికి ఎక్స్‌వేటర్‌తో మట్టి పనులు చేస్తుండగా... మరోవైపు ఐదు కొండవాగులపై కల్వర్టుల నిర్మాణాలకు సిమెంట్‌ పైపులు అమర్చే పనులు జరుగుతున్నాయి. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ విభాగం పర్యవేక్షణలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులు రూ.70 లక్షలతో ఏడు కిలోమీటర్ల జీఎస్‌బీ రోడ్డు నిర్మిస్తున్నారు. తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలుగుతుండడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Nov 22 , 2024 | 10:52 PM