Share News

ఉద్యానవనంగా డంపింగ్‌ యార్డు

ABN , Publish Date - Nov 14 , 2024 | 12:55 AM

కాపులుప్పాడ డంపింగ్‌ యార్డును చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ కార్యాచరణ రూపొందించారు. యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన 24 లక్షల టన్నుల చెత్త కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అక్టోబరు రెండో తేదీ నాటికి యార్డులో చెత్త లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఉద్యానవనంగా డంపింగ్‌ యార్డు

కాపులుప్పాడలో దశాబ్దాలుగా పేరుకుపోయిన 24 లక్షల టన్నుల చెత్తను తొలగించాలని

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశం

యార్డులోని చెత్త పునర్వినియోగానికి జీవీఎంసీ కమిషనర్‌ కార్యాచరణ

ఇప్పటికే ఉన్న రీసైక్లింగ్‌ యూనిట్ల సామర్థ్యాన్ని పెంచాలని నిర్వాహకులకు ఆదేశాలు

కొత్తగా మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ యూనిట్‌ ఏర్పాటు

ఇప్పటివరకూ 9.5 లక్షల టన్నుల చెత్త తవ్వి తీసి పునర్వినియోగం

ఖాళీ అయిన 33 ఎకరాల్లో మొక్కలు నాటాలని నిర్ణయం

వచ్చే అక్టోబరు రెండో తేదీ నాటికి యార్డులో చెత్త లేకుండా చేయాలని లక్ష్యం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

కాపులుప్పాడ డంపింగ్‌ యార్డును చెత్త రహితంగా తీర్చిదిద్దేందుకు జీవీఎంసీ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ కార్యాచరణ రూపొందించారు. యార్డులో ఏళ్ల తరబడి పేరుకుపోయిన 24 లక్షల టన్నుల చెత్త కారణంగా పర్యావరణ సమస్యలు తలెత్తుతున్నాయని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది అక్టోబరు రెండో తేదీ నాటికి యార్డులో చెత్త లేకుండా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

జీవీఎంసీ పరిధిలో ప్రతిరోజూ 1,100 మెట్రిక్‌ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. అందులో 350 టన్నులు తడి చెత్త కాగా మిగిలింది ప్లాస్టిక్‌, గాజు, కాగితం, డెబ్రిస్‌ వంటి పొడి చెత్త. నగరంలో ఉత్పత్తి అయ్యే చెత్తనంతటినీ కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలిస్తారు. ఏళ్ల తరబడి ఇదే పద్ధతి కొనసాగుతుండడంతో సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉన్న డంపింగ్‌ యార్డులో 24 లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్త కొన్ని అడుగులు ఎత్తున కొండలా పేరుకుపోయింది. యార్డులో చెత్తను తగులబెడుతుండడంతో చుట్టుపక్కల ప్రాంతాలకు కాలుష్యం వెదజల్లేది. అంతేకాకుండా వర్షం పడినప్పుడు ఆ నీరు చెత్త ద్వారా భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చెత్తను శాస్త్రీయ విధానంలో నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చెత్త నుంచి విద్యుత్‌ ఉత్పత్తి చేసే ‘వేస్ట్‌ టు ఎనర్జీ’ ప్లాంటును పీపీపీ విధానంలో జిందాల్‌ కంపెనీ ఏర్పాటుచేసింది. నగరంలో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న 1100 టన్నుల చెత్తలో దాదాపు 750 టన్నుల తడి చెత్తను ఎనర్జీ ప్లాంట్‌కు తరలించేస్తున్నారు. ఇక పొడి చెత్తలో ప్లాస్టిక్‌ను వేరుచేసి ప్లాస్టిక్‌ పిల్లెట్‌ల తయారీకి, పేపర్‌ వేస్ట్‌ను అట్టల తయారీకి, గాజు వ్యర్థాలను గాజు వస్తువులు తయారీకి ముడి సరకు తయారుచేసే యూనిట్లకు, డెబ్రిస్‌ను యార్డులోనే ఉన్న బ్రిక్‌ తయారీ యూనిట్‌కు అందజేస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం ఏరోజు చెత్త అదేరోజు వివిధ రీసైక్లింగ్‌ యూనిట్ల ద్వారా శాస్త్రీయ పద్థతిలో పునర్వినియోగం అయిపోతోంది. ఎటొచ్చీ లెగసీ వేస్ట్‌ (గతంలో యార్డులో పేరుకుపోయిన చెత్త)తోనే సమస్య. దానిని జిగ్మా ఎన్విరాన్‌మెంటల్‌ సొల్యూషన్‌ ప్రైవేటు లిమిటెడ్‌ కంపెనీ బయో మైనింగ్‌ చేస్తోంది. లెగసీ వేస్ట్‌ను ‘బయో రెమిడేషన్‌’ పద్ధతిలో యంత్రాలతో తవ్వి తీసి అందులోని ప్లాస్టిక్‌, గాజు, కాగితం, డెబ్రిస్‌ (కన్‌స్ట్రక్షన్‌ అండ్‌ డిమాలిషన్‌) వ్యర్థాలను వేరుచేస్తున్నారు. ఆ తర్వాత ప్లాస్టిక్‌, గాజు వ్యర్థాలను యార్డులోనే ఏర్పాటుచేసిన సంబంధిత యూనిట్లకు తరలించి వాతావరణానికి ఇబ్బంది తలెత్తకుండా కరిగించేసి పునర్వినియోగానికి అనుగుణంగా మార్చుతున్నారు. అలాగే యార్డులోని భవన నిర్మాణ వ్యర్థాలను సీ అండ్‌డీ యూనిట్‌ ద్వారా సిమెంట్‌ బ్రిక్‌, టైల్స్‌ తయారుచేస్తున్నారు. ఇప్పటివరకూ 9.5 లక్షల టన్నుల లెగసీ వేస్ట్‌ను రీసైక్లింగ్‌ చేయడంతో 33 ఎకరాలు ఖాళీ అయింది.

యార్డులో పేరుకుపోయిన లెగసీ వేస్ట్‌ను వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని సీఎం చంద్రబాబునాయుడు ఆదేశించిన నేపథ్యంలో గతంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఎండీగా పనిచేసిన అనుభవంతో జీవీఎంసీ కమిషనర్‌ పి.సంపత్‌కుమార్‌ కాపులుప్పాడ యార్డును పూర్తిగా ఖాళీ చేసేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనిని అమలు చేసే క్రమంలో ఇటీవల ఆయన కాపులుప్పాడ యార్డును సందర్శించారు. అక్కడ ప్రస్తుతం ఉన్న రీసైక్లింగ్‌ యూనిట్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని ప్రతినిధులను ఆదేశించారు. వచ్చే ఏడాది అక్టోబరు రెండో తేదీ నాటికి యార్డులో ఉన్న లెగసీ వేస్ట్‌ మొత్తాన్ని ఖాళీ చేయాలనే లక్ష్యంతో కొత్తగా మెటీరియల్‌ రికవరీ ఫెసిలిటీ సెంటర్‌ (ఎంఆర్‌ఎఫ్‌) యూనిట్‌ ఏర్పాటుపనులను వేగవంతం చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. యూనిట్‌ అందుబాటులోకి వస్తే లెగసీ వేస్ట్‌లోని ప్లాస్టిక్‌, క్లాత్‌, పేపర్‌ వంటి వ్యర్థాలను వేరుచేసి వాటిని రీసైక్లింగ్‌కు అవసరమయ్యే ముడిసరకుగా తయారుచేసి ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలకు సరఫరా చేస్తారు. అలాగే బయో సీఎన్‌జీ గ్యాస్‌ ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభించడంతో ఆ యూనిట్‌కు ప్రతిరోజూ 20 టన్నులు తడిచెత్తను అందజేస్తున్నారు. బయో సీఎన్‌జీని నగరంలోని పరిశ్రమలకు సరఫరా చేస్తున్నారు. భవిష్యత్తులో దీని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచితే మరింత తడి చెత్త అవసరం అవుతుంది.

చెత్త యార్డును ఉద్యానవనంగా తీర్చిదిద్దుతాం

పి.సంపత్‌కుమార్‌, జీవీఎంసీ కమిషనర్‌

కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులోని లెగసీ వేస్ట్‌ను వచ్చే ఏడాది అక్టోబరు రెండు నాటికి పూర్తిగా ఖాళీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఖాళీ అయిన యార్డులో మొక్కలు నాటి ఉద్యానవనంగా మార్చుతాం. యార్డులో ఏళ్ల తరబడి చెత్త పేరుకుపోయి ఉండడంతో భూమిలోకి ప్రమాదకరమైన రసాయనాలు చేరి ఉంటాయి. కాబట్టి ఆ భూమిలో కనీసం 15 సంవత్సరాలపాటు గ్రీన్‌ బెల్ట్‌ను నిర్వహించాల్సి ఉంటుంది. తర్వాత ఏదైనా అవసరాలకు భూమిని వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం యార్డులో 9.5 లక్షల టన్నుల లెగసీ వేస్ట్‌ను ఖాళీ చేయడంతో 33 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చింది. ఆ భూమిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

Updated Date - Nov 14 , 2024 | 12:55 AM