ఆశ్రమాల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడాలి
ABN , Publish Date - Nov 20 , 2024 | 11:27 PM
ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ సూచించారు. జి.మాడుగుల మండలం గెమ్మెలి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
ఐటీడీఏ పీవో వి.అభిషేక్
పాడేరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆశ్రమ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్ సూచించారు. జి.మాడుగుల మండలం గెమ్మెలి గ్రామంలోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆశ్రమ పాఠశాలలో 9, 10 తరగతుల విద్యార్థుల పఠనాసామర్థ్యాలను పీవో పరిశీలించారు. ఈ క్రమంలో పలు సబ్జెక్టులను ఆయన విద్యార్థులకు బోధించారు. ప్రధానంగా ఆంగ్లం, గణితంలో విద్యార్థుల సామర్థ్యాలు మరింత మెరుగుపడాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యాప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాఽధ్యాయులంతా కృషి చేయాలన్నారు. విద్యార్థులకు నిర్వహించే బేస్లైన్ టెస్ట్లు, వారి సామర్థ్యాలు, ఏబీసీడీలుగా విద్యార్థుల విభజన, ప్రత్యేక బోధన తదితర అంశాలపై ఐటీడీఏ పీవో ఆరా తీశారు. తరువాత గెమ్మెలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, ఆస్పత్రిలో సేవలు, సదుపాయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తమ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గెమ్మెలి వాసులు కోరగా, అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆయన కొత్తపల్లి జలపాతం సందర్శించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఏఈఈ దుర్గాప్రసాద్, వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.